ఫాఫం… మల్లారెడ్డికి అమెరికా పోయినా సరే ఉపశమనం లేదు… ఎటుపోయినా జనం వెంటపడుతూనే ఉన్నారు… ఆమధ్య ఏకంగా రెడ్డి సంఘం మీటింగులోనే పరాభవం వెన్నాడింది కదా… తన కారు మీదకు కుర్చీలతో తమ సామాజికజనమే దాడులకు ప్రయత్నించింది కదా… ఇప్పుడు ఆటా సభలకు వెళ్తే అక్కడా తమ సామాజిక మహిళ నాయకురాలే ఫుల్లు కడిగేసింది… సహజంగానే మల్లారెడ్డి దగ్గర ఆన్సర్ ఉండదు కదా…
సాధారణంగా అమెరికాలోని తెలుగు సంఘాల సమావేశాల్లో రాజకీయాల ప్రస్తావనలు అధికంగా రావు, ఒకవేళ వచ్చినా నిర్వాహకులు సర్దిచెప్పి, కట్ చేయించేస్తారు… తెలుగు రాష్ట్రాల్లో ఎలాగూ రాజకీయ కాలుష్యం తప్పదు, దాన్ని అమెరికా దాకా మోసుకుపోవడం దేనికి..? కూడదు..! కానీ మల్లారెడ్డిని చూడగానే సిద్ధిపేట మహిళా కాంగ్రెస్ నాయకురాలు భవానీరెడ్డికి అవేవీ గుర్తురాలేదు…
Ads
‘‘అక్కడ చేసేదేమీ లేదు, మీ పాలనలో ప్రజలకు కష్టాలు, ఇక్కడికొచ్చి గొప్పలు చెప్పుకుంటారు’’ అని స్టార్ట్ చేసింది ఆమె… అయితే ఆమె విమర్శలో కొన్ని పాయింట్లు ఆలోచింపజేసేలా ఉన్నయ్… మరీ కార్మికుల బీమా ప్రీమియం విషయం కొత్తగా వినిపించి, టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల్లో ఒకటిగా కనిపిస్తోంది… 2019 నుంచి అసలు మల్లారెడ్డి ఒక్కటంటే ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టలేదట… ఔను మరి, తనకేం అర్థమవుతుంది..?
10 లక్షల మంది కార్మికులకు సంబంధించి, ఒక్కొక్కరికీ 200 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం కట్టాల్సి ఉంటే, అదీ ఎగ్గొట్టిందట… దాంతో ఎవరైనా మరణిస్తే పరిహారం దక్కదు… అలాగే కార్మికశాఖకు కమిషనరే లేడు… డిప్యుటేషన్ మీద వచ్చిన అధికారి కమిషనర్‌గా వ్యవహరిస్తున్నాడు… ఏం..? రాష్ట్రంలో ఒక్క ఐఏఎస్ అధికారి దొరకలేదా..?….. దిశ డిజిటల్ పేపర్‌లో వచ్చిన వార్త మేరకు భవానీరెడ్డి విమర్శలు ఇలా సాగాయి…
ఇవన్నీ సరే… కానీ భవానీరెడ్డి ఓ బేసిక్ పాయింట్ మరిచిపోయినట్టుంది… ఆయనకేమో చదువు సరిగ్గా లేదు… ఫైళ్లు చూడటం గట్రా ఆయనకు ఏం తెలుసు..? తనకు చదువు లేదనే కసితో, లక్షల మందికి చదువు చెప్పించాలనే సామాజిక సేవాదృక్పథంతో, ఏదో పదీఇరవై కాలేజీలు పెట్టుకుని, యూనివర్శిటీ పెట్టుకుని ఫాఫం ఏదో కష్టపడుతున్నాడు… ఒకవైపు తనలో ఇప్పటికీ రగిలే తెలంగాణ పోరాట స్పూర్తి, మరోవైపు ఈ విద్యావితరణ లక్ష్యం… ఇంకోవైపు కేసీయార్ తన మీద పెట్టుకున్న అపారమైన విశ్వాసం …
వీటిని బ్యాలెన్స్ చేయడానికి అహరహం కష్టపడుతూ, సతమతమవుతూ కేసీయార్ గర్వపడేలా తయారవుతున్నాడు… అదేమీ అర్థం చేసుకోకుండా మల్లారెడ్డిని ఎక్కడికక్కడ నిలదీస్తే పాపం, ఆ అమాయకుడి హృదయం ఎంత గాయపడి ఉంటుందో ఆలోచించకపోతే ఎలా తల్లీ..?! కేసీయార్ అత్యంత ప్రేమగా తెలంగాణ సమాజం మీద రుద్దే అదృష్టధాతువుల గురించి తెలియకుండా ఇలా ఆటా సభల్లో ఆట ఆడుకుంటే తప్పు కదా…!!
Share this Article