ఇద్దరు… ఒక ఆడ, ఒక మగ… పెళ్లి చేసుకుందాం అనుకున్నారు… ప్రేమించుకుంటున్నారు… మనసులు కలిశాయి, ఎలాగూ పెళ్లిచేసుకుంటాం కదా అనుకుని స్వేచ్ఛగా శృంగారాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు… కానీ అన్నీ అనుకున్నట్టు జరగవు కదా… ఆ సంబంధం పెళ్లి దాకా పోలేదు… ఎక్కడో ఏవో మనస్పర్థలు వచ్చాయి… అతను మరో మహిళను పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు… మొదటి మహిళతో దూరం జరిగాడు…
కేరళ, కొల్లంకు చెందిన ఆమెకు పట్టరాని కోపం వచ్చింది… శృతి కుదరకపోతే, ప్రేమ పెళ్లి దాకా వెళ్లకపోతే బ్రేకప్ అనేసి, ఎవరి బతుకు వాళ్లు బతకొచ్చు కదా… సమాజంలో ఎన్ని ప్రేమ వ్యవహారాలు ఫెయిల్ కావడం లేదు..? ప్రేమ అంటే పెళ్లి చేసుకోవడం తప్పనిసరా..? ఆమె వదల్లేదు, అతనిపై అత్యాచారం కేసు పెట్టింది… తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, పలుసార్లు అత్యాచారం చేసి, చివరకు మోసం చేసి, వేరే పెళ్లికి సిద్ధపడ్డాడు అనేది కేసు…
పోలీసులు సింపుల్గా కేసు పెట్టేసి, జైలులోకి నెట్టేశారు ఆయన్ని… ఆయన కూడా లాయరే… ఇన్కమ్ టాక్స్ విభాగానికి స్టాండింగ్ కౌన్సిల్… పేరు నవీనీత్ నాథ్… ఆమె కూడా లాయరే, ఆయన గారి కొలీగే… ఆమె ఫిర్యాదును బట్టి అత్యాచారమే అని పోలీసులు ఎలా నిర్ధారిస్తారు..? నిజంగా అది అత్యాచారమేనా..? తనకు నచ్చినన్నిరోజులు ఇద్దరూ ప్రేమ మైకంలో శృంగారాన్ని అనుభవించి, తీరా నాలుగేళ్ల తరువాత తనను మోసం చేసి, అత్యాచారం చేశాడు అని ఆమె ఆరోపిస్తే, ఇక ఆయన నేరస్థుడే అవుతాడా..? శిక్షార్హుడా..?
Ads
ఇవన్నీ ఆలోచిస్తే పోలీసులు అనరు కదా, ముందయితే అరెస్టు చేద్దాం, తరువాత అది కోర్టు తల్నొప్పి, మనకెందుకు అనుకున్నారు కేరళ పోలీసులు…ఒక్క కేరళ అనేముంది..? పోలీసులు ఎక్కడున్నా పోలీసులే… నవనీత్ నాథ్ తన బెయిల్ కోసం ఏకంగా హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది… ‘‘ఇందులో ఆమెకు ఇష్టం లేకుండా, సమ్మతి లేకుండా, నిర్బంధంగా శృంగారంలో పాల్గొన్నదేముంది..? ఇద్దరు యుక్తవయస్కులు పరస్పరం ప్రేమతో, నమ్మకంతో భౌతిక సంపర్కంలో ఉంటే అది అత్యాచారం అని ఎలా నిర్వచిస్తాం..?’’ అంటూ జస్టిస్ బెచు కురియన్ ఆయనకు శుక్రవారం బెయిల్ మంజూరు చేశాడు…
ఈ శృంగార సంబంధం వెనుక దురుద్దేశం లేనప్పుడు, పరస్పర సమ్మతితోనే సంపర్కం చోటుచేసుకున్నప్పుడు, ఇక ఇందులో ఐపీసీ 376 సెక్షన్ పరిధిలోకి వచ్చే అత్యాచారం ఏమున్నట్టు..? ఒకవేళ ఆమె ఆరోపిస్తున్నట్టు సీరియస్ వ్యవహారమే అయినా సరే, ఆయన న్యాయ పరిధి నుంచి ఏమీ తప్పించుకుపోలేడు కదా, తనకు వేరే నేరచరిత్ర కూడా లేదు కదా అని పేర్కొంటూ బెయిల్ మంజూరు చేశాడు న్యాయమూర్తి…
భిన్న విశ్వాసాలకు చెందిన వారి నడుమ ప్రేమ మొదలైనప్పుడు… ఇది పెళ్లి దాకా పోవడానికి పలు అడ్డంకులు వస్తాయనే సంగతి ఆ ప్రేమికులిద్దరికీ తెలుసు, ఐనా వారి నడుమ భౌతిక సంపర్కం నడిచింది… అంటే ఆమె పూర్తి సమ్మతితోనే వ్యవహారం సాగినట్టు కదా… ఇందులో అత్యాచారం ఏముంది..? అని సదరు నవనీత్ తరఫు లాయర్ వాదించాడు…
‘‘పెళ్లి చేసుకుంటాడనే నమ్మకంతో మాత్రమే ఆయనతో శృంగారంలో పాల్గొన్నాను అని కూడా ఆ మహిళ తన ఫిర్యాదులో చెప్పలేదు..’’ అని కోర్టు పేర్కొంది… అయితే కోర్టు తన పరిశీలనల్ని కేవలం బెయిల్ ఇవ్వడం వరకే పరిమితం చేసింది, కేసు ప్రధాన విచారణకు దీనికీ సంబంధం లేదనీ పేర్కొంది… అవునూ, ఇవన్నీ చూస్తుంటే… ప్రేమ వ్యవహారాల్లో మునిగి, దాన్ని పెళ్లికి ముందే శృంగారం దాకా తీసుకెళ్లే పురుషులు కాస్త జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నాయా..? రేప్పొద్దున వ్యవహారం ఎదురుతంతే చివరకు అత్యాచార కేసు నిందితులై జైలుపాలవుతారేమో కూడా… బహుపరాక్…!! (స్టోరీ ఇన్పుట్స్, ఫోటో దిన్యూస్మినట్ సైటు సౌజన్యంతో…)
Share this Article