బెంగాలీ జర్నలిస్టులు, ఢిల్లీ జర్నలిస్టులు జుత్తు పీక్కుంటున్నారు… బెంగాల్‌లో ఏం జరుగుతోందో అంచనాలు వేయలేక, సోర్స్ దొరక్క, చెప్పేవాడు లేక, విషయం అంతుపట్టక విశ్లేషణరహితులై పోయారు… అన్ని మీడియా హౌజులకు అందింది ఒకే ఫోటో… అందులో బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్, మమత బెనర్జీ, అస్సోం సీఎం హిమంత విశ్వశర్మ కనిపిస్తున్నారు…
ఇది కోల్‌కత్తాలో కాదు, డార్జిలింగ్‌లో జరిగిన భేటీ… నలభై నిమిషాలపాటు జరిగిన ఈ భేటీ గురించి మమత జర్నలిస్టులతో మాట్లాడుతూ… ‘‘పెద్ద రాజకీయ ప్రాధాన్యం ఏమీ లేదు… మర్యాదపూర్వకంగా కలిశాను… అప్పుడు అక్కడ హిమంత ఉన్నాడు… నాకు ఓ అస్సామీ శాలువా బహూకరించాడు… నేనేమో తనకు ఓ బెంగాలీ శాలువా ఇచ్చాను… అస్సోంతో బెంగాల్‌కు కొంత సరిహద్దు కూడా ఉంది… నేను కామాఖ్య గుడికి వెళ్లినప్పుడు సహకరించాడు… మా ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకుంటేనే అస్సోంలోని బెంగాలీలు, బెంగాల్‌లోని అస్సామీలు బాగుంటారు’’ అంటూ ఏదేదో చెప్పుకుంటూ పోయింది… కానీ అంత యథాలాపం ఉండదు…
అంటే… చెప్పటానికి నిజంగానే ఏమీ లేకపోవచ్చు, లేదా ఆమె ఏమైనా దాచిపెడుతూ ఉండవచ్చు… ఇప్పుడు అందరికీ విస్మయంతో కూడిన సందేహప్రశ్న ఏమిటంటే..? 2019 నుంచీ ఆ గవర్నర్‌కు ఆమెకు నడుమ ఉప్పునిప్పు యవ్వారమే… ఆయన్ని అసలు పట్టించుకోదు ఆమె… చిన్న చిన్న విషయాల్లోనూ గవర్నర్‌ను అవమానించేది… ప్రోటోకాల్స్ లేవు, వ్యక్తిగత మర్యాదలు కూడా అసలే లేవు… అలాంటిది ఎక్కడో డార్జిలింగ్‌లోని రాజభవన్‌లో చలికాచుకుంటున్న గవర్నర్‌ను ఆమె మర్యాదపూర్వకంగా కలవడమా..?
Ads
సరే, ఆమె కూడా ఎందుకో ఇవేరోజుల్లో డార్జిలింగ్ పర్యటనను పెట్టుకుంది… పనిలోపనిగా గవర్నర్‌ను కలిసిందీ అనుకుందాం… అక్కడే అదే సమయానికి అస్సోం సీఎం ఉండటం ఏమిటి..? అదేరోజు ఆయన డార్జిలింగ్ రావడం దేనికి..? పోనీ, ఏదో ఆటవిడుపుగా, రిలాక్స్ కోసం అనుకోకుండా డార్జిలింగ్ వచ్చి, అక్కడ రాజభవన్‌లోనే అతిథిగా ఉన్నాడు అనుకుందాం… (మన గవర్నరే కదా…) మామూలుగానైతే గవర్నర్, సీఎం కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు వేరే రాష్ట్ర సీఎం అక్కడ ఉండడు…
రాజకీయాల్లో, అధికారిక ప్రోటోకాల్స్ విషయంలో… కొన్ని పద్ధతులుంటాయి… హిమంత, గవర్నర్ చాయ్ తాగుతుంటే, హఠాత్తుగా మమత అక్కడికి వెళ్లడం కొంచెం అసాధారణమే… తెల్లారిలేస్తే ఆమె బీజేపీకి తిడుతూ ఉంటుంది… అతనేమో బీజేపీ సీఎం… పోనీ, వ్యక్తిగత సంబంధాల కోణంలో చూద్దామనుకున్నా, తను నిత్యం ద్వేషించే గవర్నర్ ఎదుట మర్యాదపూర్వక చిట్‌చాట్ ఏమీ ఉండదు… సో, ఈ ముగ్గురి భేటీ ఎందుకు అనేది ఓ ప్రశ్న…
ఇదే డౌటనుమానం ఎంపీ అధీర్ రంజన్ చౌదరికి కూడా వచ్చింది… తను రాజకీయ కోణంలో ఏదో విమర్శ చేశాడు… ‘‘త్వరలో మోడీ, మమత రహస్య భేటీ జరగబోతోంది… కాంగ్రెస్ ముక్త భారత్ దిశలో ఇద్దరూ ఏదో ప్రణాళిక వేస్తున్నారు… గవర్నర్, మమత, హిమంత భేటీ దానికి సూచిక…’’ అంటున్నాడు… ఔనా..? ఏమో..! అవునూ… బెంగాల్‌లో కాంగ్రెస్ ఆల్‌రెడీ జీరో… అది మళ్లీ లేచే స్థితి లేదు… అక్కడేమీ జాయింట్ కుట్రల అవసరం లేదు… ఆమెకు ప్రధాని కుర్చీ మీద ఆశ… దానికి ఎప్పుడైనా ప్రధాన అడ్డంకి జాతీయ స్థాయిలో కాంగ్రెస్… మోడీదేమో కాంగ్రెస్ ముక్త భారత్ లక్ష్యం… దాన్ని తొక్కితే ఇక తిరుగులేదనేది ధ్యాస… ముందయితే కాంగ్రెస్‌ను ఖతం చేసేద్దాం… తరువాత మనం మనం కొట్లాడుకుందాం అనుకుని, ఉమ్మడి ఆపరేషన్ ఏదైనా మొదలుపెడుతున్నారా..? ఐనా, నిజంగా మమతకు అంత సీన్ ఉందా..? కాంగ్రెస్‌ను ఎవడూ హతమార్చలేడు, అది హరాకిరి చేసుకోవల్సిందే తప్ప..!!
Share this Article