కిరాక్ ఆర్పీ అనబడే నాగబాబు వీరాభిమాని చెడామడా బూతులు తిట్టేస్తున్నాడు మల్లెమాల కంపెనీని… శ్యాంప్రసాదరెడ్డిని… అదేదో చానెల్… సంబరం చేసుకుంటోంది… భలే కంట్రవర్సీ దొరికిందిలే అనుకుని డాన్స్ చేస్తోంది… ఆర్పీని ఖండించడానికి హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్… మళ్లీ ఆర్పీ రీకౌంటర్… ఈలోపు ఇంకెవరో షేకింగ్ శేషు అట ఆర్పీ మీద ఓ ట్యాంకర్ బురద గుమ్మరించాడు… సదరు శేషును, ఇంకెవరో పద్మశ్రీ అట… కలిపి సర్ఫ్ ఎక్సెల్ పెట్టేశాడు ఆర్పీ… మధ్యలో ఇంకో గుండు కేరక్టర్ దూరి, శెభాష్‌రా ఆర్పీ అని మెచ్చేసుకున్నాడు… అదిరె అభి ఇంటర్వ్యూ అదనం… వాళ్ళ బొంద, మళ్లీ పిలిచినా పోను అన్నట్టుగా అప్పారావు మాటలు…
ఓహో, ఇదంతా నాగబాబు పెట్టిన మంటా..? మరీ ఇంత కక్ష శ్యాంప్రసాదరెడ్డి మీద ఎందుకుంది..? ఇదో చర్చ… మొత్తానికి ఏళ్లుగా జబర్దస్త్ పేరిట బూతును, వెకిలితనాన్ని సొమ్ముచేసుకుంటున్న ఆ మల్లెమాల వినోద కంపెనీ ప్రతిష్ట ఒకవైపు కూలుతున్న చప్పుళ్లు… పది మంది బురదలో తన్నుకుంటుంటే చుట్టూ ఉన్నవాళ్ల మీద కూడా పడుతుంది కదా… అందులోకి సుడిగాలి సుధీర్‌ను లాగుతున్నారు… రష్మిని, అనసూయను కూడా బురదలోకి గుంజుతున్నారు… మొత్తానికి వివాదం రోజురోజుకూ కంపు రేగుతోంది…
హఠాత్తుగా ఏడుకొండలు అనే కేరక్టర్ వచ్చిపడింది ఈ వివాదంలోకి… అసలు మొదట్లో జబర్దస్త్ షో మేనేజర్ ఆయనే… నటుల్ని వేధించేలా అక్కడున్న పద్ధతులన్నింటికీ బాధ్యుడు తనే… ఇప్పుడొచ్చి వాడు అదీ, వీడు ఇదీ అని సంస్కారయుతమైన భాషలో తిట్టేస్తున్నాడు… అందరి జాతకాలూ నాదగ్గర ఉన్నయ్, అందరూ తిరిగి రావల్సిందే అంటాడు అదేమిటో… తననే తన్ని తరిమేస్తే ఏదో మాల్ పెట్టుకున్నాడని టీవీ సర్కిళ్లలో టాక్… మరి తను తిరిగి వచ్చి, వీళ్లందరినీ (మాటీవీకి వెళ్లిపోయిన కమెడియన్లు) ముక్కుపట్టి లాక్కొస్తాను అంటాడేమిటి..? అంత కట్టుబానిసత్వమా ఫాఫం టీవీల్లో కమెడియన్లది..?
Ads
అగ్రిమెంట్ల గడువు పూర్తయ్యాక ఏడు కొండలైనా ఏమీ చేయలేడు… వంద కొండలు వచ్చినా ఏమీ చేయలేడు… ఐనా నువ్వూ వద్దు, నీ చెత్తా కంపెనీకి నేను పనిచేయనుపో అని వెళ్లిపోయినవాళ్లను ఎవరు వాపస్ తీసుకురాగలరు..? ఈ వివాదంలో రోజుకు పదీపదిహేను లీటర్ల పెట్రోల్ పోస్తూ చలికాచుకుంటున్న సదరు టీవీ తన ఇంటర్వ్యూ టైంలోనే ఈ ఏడుకొండలు అనబడే పాత మేనేజర్‌తో సుధీర్‌కు ఫోన్ చేయించింది… లిఫ్ట్ చేయలేదు… అంతే ఇక… చూశారా, నా ఫోనే ఎత్తడు, లైఫ్ ఇచ్చిందే నేను, కృతజ్ఞత లేదు, మాల్ ఓపెనింగ్‌కు రమ్మంటే రాలేదు… వాడి సినిమాలన్నీ ఫ్లాప్, ఎవడు చూస్తాడు అని ఒకటే శాపనార్థాలు…
ఆ మొద్దు నితిన్‌కు డాన్స్ నేర్పిందే నేను, నా సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్‌కు రాలేదు చూశారా అని మొన్న ఓ అరివీర అరవ దర్శకరత్నం ‘‘హమ్మా రాజశేఖరుడు’’ అరిచిన అరుపులు గుర్తొచ్చాయి… అకస్మాత్తుగా ఏమైంది వీళ్లందరికీ..? సుధీర్ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే కూడా ఏడుపులు, తిట్లా..? ఏడుకొండలు అసలు మనస్తత్వం అదే… సో వాట్..? సుధీర్ తన దారి తను వెతుక్కున్నాడు..? తనేమీ కట్టుబానిస కాదు కదా… వారానికి ఓసారి ఇంటికి వెళ్లి ఈ ‘‘డబ్బుల మేనేజర్’’ కాళ్లు పట్టుకుని… త్వమేవ శరణం నాస్తి అని జపించాలా..?
కానీ ఏమాటకామాట… తను జబర్దస్త్ నుంచి, ఈటీవీ నుంచి, మల్లెమాల బందిఖానా నుంచి ఎందుకు, ఎలా వెళ్లిపోయాడో… ఎన్ని పరాభావాల్ని భరించాడో ఇప్పటివరకూ సుధీర్ ఒక్కమాట కూడా ఎక్కడా మాట్లాడలేదు… పొల్లు మాట జారలేదు… తన పనేమిటో తను… దట్సాల్… సాధారణంగా సుధీర్‌తో ఆడుకునే స్కిట్లే ఉంటాయి టీవీ షోలలో ఎక్కువగా… ఐనా ఎక్కడా హర్ట్ కాడు, నవ్వుతూ ఉండిపోతాడు… అదే వైఖరిని ఈ వివాదం సందర్భంగా కూడా చూపిస్తున్నాడు…
గుడ్… అదే సరైన పోకడ… బాగా అవమానపడ్డావు, ఎట్టకేలకు బంధనాలు తెంచుకున్నావు… నీ దోస్త్ రాంప్రసాద్ ఇంకా అక్కడే పొర్లుతున్నాడు… నీ మరో దోస్త్ జాడలేడు… సో వాట్… ఆ యూట్యూబ్ టీవీ చానెల్ పెద్ద క్యాన్‌లో పెట్రోల్ రెడీగా పెట్టుకుందట… పొరపాటున అటువైపు వెళ్తావేమో… జాగ్రత్త…!! ఇలాంటి పంచాయితీలు వచ్చినప్పుడు వెంటనే టెంపర్ లూజయ్యే అనసూయ కూడా నిశ్శబ్దాన్ని పాటిస్తోంది… అఫ్కోర్స్, రష్మి కూడా…!!
Share this Article