Bharadwaja Rangavajhala……. ఆత్రేయా ప్రకాశరావూ … ప్రేమనగర్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. హీరో ఓపెనింగ్ కోసం ఓ బర్త్ డే సాంగ్ పెడితే బావుంటుందనిపిస్తోంది …. అన్నారు కె.ఎస్ ప్రకాశరావు. బర్త్ డే సాంగా ? అన్నారు ఆత్రేయ … ఏమంట్లా, ముఖం చిట్లించావ్, బర్త్ డే సాంగ్ అయితే బావుంటుందనిపిస్తోంది అన్నారు ప్రకాశరావు ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా కనబడి … పుట్టినరోజు పాట ఏం రాస్తాం ప్రకాశరావ్ … హ్యాపీ బర్త్ డే టూ యూ అంటూ … నా వల్ల కాదు అనేశారు ఆత్రేయ.
అలా కాదయ్యా … సన్నివేశానికి అవసరం కాస్త ఆలోచించు అని బతిమాలుకున్నారు ప్రకాశరావుగారు. అంతగా అవసరం అని ఫీలైతే ఇంకెవరితోనైనా రాయించుకో … నే మాత్రం రాయను … అసలు రాయదల్చుకోలేదు … నేను బర్త్ డే పాట రాస్తే వేరేలా ఉంటుంది … నీకు నచ్చదు … నీకు నచ్చినా ప్రొడ్యూసర్ కు నచ్చకపోవచ్చు … ఎందుకొచ్చిన గొడవ మనకి అని లేచారు ఆత్రేయ. తనకు నచ్చని పని చేయాలంటే మహా చిరాకు పడిపోయేవాడు ఆత్రేయ.
సరే అని రామానాయుడుతో కల్సి మరో కవితో కూర్చున్నారు ప్రకాశరావుగారు. విషయం చెప్పారు. అరగంటలో పాట రాసిచ్చి పైకం పుచ్చుకుని వెళ్లిపోయారా కవిగారు. పాట బర్త్ డే సాంగే కానీ … రొటీన్ గా ఉంది … ఇంకేదో కావాలక్కడ అని ప్రకాశరావుగారి మనసు పీకుతోంది … పాట బానే ఉంది కదా అంటారు రామానాయుడు. నా మనసు ఆయన మనసుకు ఎలా అర్ధమౌతుంది? అనేది ప్రకాశరావుగారి అభిప్రాయం. ఫైనల్ గా మళ్లీ ఆత్రేయను పిల్చారు.
Ads
బాబూ ఆత్రేయా … అన్నారు ప్రకాశరావుగారు. పాట రాయించేసుకున్నారా అని అడిగారు ఆత్రేయ. రాయించుకోవడమూ అయ్యింది … ఆ కవికి డబ్బులు ఇచ్చేయడమూ అయ్యింది అని తేల్చారు ప్రకాశరావు. సరే, ఇంకేంటి విశేషాలు అని లోకాభిరామాయణంలోకి వచ్చారు ఆత్రేయ. అద్సర్లేగానీ నువ్వు పుట్టినరోజు పాటలు రాయలేనూ … నేను రాస్తే నువ్వు ఏడుస్తావూ అన్నావు కదా … నువ్వు రాస్తే ఎలా ఉంటుందో ఓసారి చెప్దూ వినాలని ఉంది అన్నారు ప్రకాశరావు .
నేను ఏడ్చాను ఈ లోకం నవ్వింది
నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది
నాకింకా లోకంతో పని ఏముందీ?
అన్నారు ఆత్రేయ.
ఇది కదా నాకు కావాల్సింది … అనవసరంగా ముక్కెక్కడుందంటే … మద్రాసంతా తిప్పి చూపిస్తావు అనుకోలేదు … అని ఆత్రేయను దాదాపు కావలించుకున్నంత పన్జేశారు ప్రకాశరావు. నేను ఏడ్చాను అంటే నేను పుట్టాను అనే సెన్సులోనే రాశారు ఆత్రేయ. పుట్టగానే ఎవరైనా ఏడుస్తారు కదా … అలాగన్నమాట. ఆ ఏడ్చే పసిగుడ్డును చూసి ఆనందంతో చూస్తూ, తాము నవ్వుతూ ఆడించాలని చూస్తారందరూ … ఆ పసికందు ఏమనుకుంటోందో వీళ్లు తెలియరు. అదే సెన్సును నేను ఏడ్చాను, ఈ లోకం నవ్విందీ అంటాడు. పెరిగి పెద్దయ్యాక సహజంగానే అనేక కాంప్లెక్సుల కారణంగా పెద్దోడైన ఆ పసికందే నవ్వితే ఈ లోకం ఏడుస్తుంది … అంచేత డోంట్ కేర్ అన్నాడు …
చాలా మంది ప్రకాశరావు వల్ల ఆత్రేయ గొప్పవాడయ్యాడు అంటారు… కొందరేమో దీన్నీ తిరగేసి ఆత్రేయ ఉండడం వల్లే ప్రకాశరావు గొప్పోడయ్యాడు అంటారు. ఆ రెండు స్టేట్మెంట్లూ కరెక్ట్ కాదనేవారు ప్రకాశరావుగారు. నా వల్ల ఆత్రేయ గొప్పోడయ్యాడంటే నన్ను కించపరచినట్టుగానే భావిస్తా అని విజయచిత్రలో ఇచ్చిన ఓ ఇంటర్యూలో అన్నారాయన. ఆత్రేయలోని ప్రతిభా విశేషాలే అతను గొప్పవాడవడానికి దోహదపడ్డాయి తప్ప నేను కాదు అన్నారాయన.
నాకు కావల్సిందేమిటో నాకు తెల్సు. అది ఎక్కడ దొరుకుతుందో కూడా తెల్సు. అందుకే దీక్ష తీసేటప్పుడు ఆత్రేయను బలవంతంగా లాక్కొచ్చి రాయించి, సినిమా రచయిత అనే ఓ హోదా ఇచ్చాను. అలా చేయడం ద్వారా ఆత్రేయకు నేను చేసిందేమీ లేదనేదే నా అభిప్రాయం … కానీ ఇండస్ట్రీ నాకు ఎప్పటికీ రుణపడి ఉంటుందనేది కూడా నా నిశ్చితాభిప్రాయమే అని జోడించారు ప్రకాశరావుగారు….
Share this Article