నిన్న నమస్తే తెలంగాణలో ఫస్ట్ లీడ్ స్టోరీ ఒకటి వచ్చింది… ఏమిటీ అంటే..? తెలంగాణ భారత యూనియన్‌లో కలిసి 74 ఏళ్లు పూర్తయినందున, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని వజ్రోత్సవం నిర్వహించాలని పలువురు మేధావులు ముఖ్యమంత్రిని అడిగారట… సీఎం సానుకూలంగా స్పందించాడట… కేబినెట్‌లో చర్చిస్తామని చెప్పాడట… 75 ఏళ్లు కాలేదు, 74 ఏళ్లే… ఐతేనేం… రాజకీయ అవసరం… మేధావులు కేసీయార్‌కు చెప్పడం, ఆయన సావధానంగా వినడం, సానుకూలంగా స్పందించడం అసలు జరిగే పనేనా..? కావాలనే ఆ స్టోరీ వండబడింది…
నిజానికి సెప్టెంబరు 17 వస్తుందంటే చాలు… విమోచన, విలీనం, విద్రోహం, విముక్తి వంటి పదాలతో బొచ్చెడు వ్యాసాలు అప్పటికప్పుడు అల్లబడతాయి… మీడియాలో అచ్చేయబడతాయి… ఏదో ఒకటి… మనం ఇప్పుడు ఆ చర్చలోకి వెళ్లడం లేదు… నిజాం పాలన నుంచి హైదరాబాద్ సంస్థానం విముక్తి పొంది, భారత యూనియన్‌లో కలిసిందిగా.., దాన్ని సెలబ్రేట్ చేసుకుంటే తప్పేమిటి అనే వాదన ప్రతిసారీ బలంగా వినిపిస్తుంది… కానీ కేసీయార్ ఒప్పుకోడు…
వాస్తవానికి తెలంగాణ ఉద్యమసమయంలో… అప్పటి ఉమ్మడి ప్రభుత్వాల్ని ‘‘ఏం..? ఎందుకు విమోచనదినాన్ని నిర్వహించరు..? తెలంగాణ అంటే అంత నిర్లక్ష్యమా’ అని గద్దించినవాడే… గద్దెనెక్కాక యూటర్న్… అధికారికంగా విమోచన జరపడం తమ జాన్ జిగ్రీ దోస్త్ పార్టీ మజ్లిస్‌కు ఇష్టం ఉండదు… పైగా నిజాం పాలన అంటే కేసీయార్‌కు అదొక ఇష్టం… విమోచనదినం జరిపితే ముస్లింలు తనకు వ్యతిరేకం అయిపోతారనే అంచనా… అధికారికంగా నో సెలబ్రేషన్స్…
Ads
అప్పట్లో హైదరాబాద్ సంస్థానంలోని కొన్ని ప్రాంతాలు కర్నాటకలో, మహారాష్ట్రలో కలిసిపోయాయి… ఆ రాష్ట్రాల్లో అధికారికంగానే విమోచన దినం నిర్వహించుకుంటారు… ఎటొచ్చీ తెలంగాణలోనే ఏమీ ఉండదు… ఇప్పుడు హఠాత్తుగా తెలంగాణ వజ్రోత్సవం నిర్వహించాలని తలంపు… ‘హైదరాబాద్ స్టేట్’లో తెలంగాణ మాత్రమే ప్రత్యేక రాష్ట్రంగా ఉండిపోయింది కాబట్టి, అస్థిత్వపోరాటం చేసి స్వపరిపాలన సాధించుకున్నది కాబట్టి 74 ఏళ్ల వజ్రోత్సవం నిర్వహించాలట… గందరగోళంగా ఉన్నట్టనిపిస్తోందా..? అసలు ఈ ఆలోచనకు పూర్వరంగం ఏమిటో చెప్పుకోవాలి…
ప్రతిసారీ సెప్టెంబరు 17 అనగానే బీజేపీలో ఓ కదలిక వస్తుంది… విమోచన దినం జరపాల్సిందే అని గొంతెత్తుతుంది… ఈసారి గొంతు ఎత్తడమే కాదు, కేసీయార్‌ను ఇరుకునపెట్టడానికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఓ పెద్ద మీటింగ్ పెట్టి, అమిత్ షా హాజరు కావాలని ఓ ప్లాన్… దానికి మహారాష్ట్ర, కర్నాటక సీఎంను ఆహ్వానించాలని ఆలోచన చేశారట… నిన్నంతా ఆ వార్తలు చక్కర్లు కొట్టాయి… మహారాష్ట్రలో ఎలాగూ బీజేపీ అనుకూల ఏకనాథ్ షిండే సీఎం, కర్నాటకలో సొంత పార్టీ బొమ్మై… పిలవగానే వచ్చి వాలతారు…
తద్వారా కొంత మైలేజీ తీసుకుందామని, కేసీయార్‌ను గోకుదామని ఆలోచన… కానీ కేసీయార్ ఊరుకోడు కదా… బీజేపీ నుంచే ఈ సమాచారం అంది ఉంటుంది… బీజేపీకి ఏమాత్రం మైలేజీ వచ్చే చాన్సున్నా అడ్డంగా నరికే పనిని అర్జెంటుగా చేపడతాడు కదా తను… అసలే ఇప్పుడు ఉప్పూనిప్పూ యవ్వారంలాగా ఉంది… కౌంటర్ ఆలోచించాడు…
స్వతంత్ర భారత వజ్రోత్సవాల పేరిట రెండు వారాలపాటు రాష్ట్రమంతా ఆగస్టు 8 నుంచి ప్రత్యేక కార్యక్రమాల్ని నిర్వహించారు తెలుసు కదా… ప్రతి ఇంటికీ జెండా పంపిణీ, ఒకరోజున ఒకే సమయంలో జాతీయ గీతాలాపన వంటివి జరిగాయి… అలా మొత్తానికి ఆజాదీకా అమృత మహోత్సవ్ ద్వారా బీజేపీ ఏ మైలేజీ తీసుకోకుండా చూశారు… నిజానికి ‘హర్ ఘర్ తిరంగా’ అనేది అమృత మహోత్సవ్‌లో భాగమే… ఇప్పుడు విమోచన దినంపైనా అంతే…
కేంద్ర హోం మంత్రి ఆధ్వర్యంలో, హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా కేంద్ర ప్రభుత్వమే నిర్వహిస్తే కేసీయార్ ఎలాగూ కాదనలేడు… పర్మిషన్ ఇవ్వనుఫో అనలేడు… అందుకని కౌంటర్‌గా ఈ వజ్రోత్సవాల ఆలోచనను తెరపైకి తీసుకొస్తున్నారన్నమాట… కాకపోతే విమోచన ఎట్సెట్రా పదాలు వాడరు, తెలంగాణ స్వరాష్ట్రం, స్వపరిపాలన, తెలంగాణ పోరాటం, చారిత్రిక ఉద్యమం వంటి పదాలతో కథ నడిపించేయాలి… బీజేపీకి ఏమాత్రం ఫాయిదా దక్కొద్దు… అలా ఊదరగొట్టేయాలి… కౌంటర్ స్ట్రాటజీ బాగుంది… బీజేపీ వాళ్లకు తెలిసేలా కావాలని తన పత్రికలో స్టోరీ రాయించడమూ బాగుంది… ఎటొచ్చీ బీజేపీ నిజంగానే విమోచన దినం నిర్వహించే ఆలోచనలో సీరియస్‌గా ఉందానేదే పెద్ద ప్రశ్న..!!
Share this Article