నో డౌట్… కృష్ణంరాజు మరణానికి తెలుగు ఇండస్ట్రీ ఘన నివాళినే అర్పించింది… హైదరాబాద్‌లో ఉన్న ప్రముఖులు అందరూ వెళ్లారు, షూటింగుల కోసం ఎక్కడెక్కడో ఉన్నవాళ్లు కూడా సంతాపం ప్రకటించారు… హైదరాబాద్‌కు రాలేకపోయినవాళ్లు ట్వీట్లు, పత్రికా ప్రకటనలు, సోషల్ మీడియా పోస్టుల ద్వారా తమ నివాళి కనబరిచారు… కానీ రాంగోపాలవర్మకు అది సరిపోలేదట… ఓ వింత వాదనకు తెరతీశాడు…
అఫ్‌కోర్స్, ఇప్పుడు తన స్థాయిని బట్టి, తనను ఎవరూ పట్టించుకోరు ఇండస్ట్రీలో… కాకపోతే ఏదో ఒకటి గెలకడంలో నంబర్ వన్ కదా, అందుకే ఏదేదో గెలుకుతున్నాడు… విచిత్రం ఏమిటంటే, తను నమ్మేది వేరు, ఇప్పుడు చెబుతున్నది వేరు… అవి చెప్పుకునే ముందుగా, తను ఏమని ట్వీట్లు పెట్టాడో ఓసారి చదవండి…
కృష్ణగారికి,మురళీమోహన్ గారికి, చిరంజీవిగారికి , మోహనబాబుగారికి, బాలయ్యకి , ప్రభాస్ కి,మహేష్,కల్యాణ్కి నేను ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే రేపు ఇదే దుస్థితి మీలో ఎవరికీ కూడా తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది.
భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు లాంటి అత్యంత గొప్ప చిత్రాలని అందించిన మహా నటుడు, గొప్ప నిర్మాత కోసం ఒక్క రోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్ధపూరిత తెలుగు సినిమా పరిశ్రమ కి నా జోహార్లు. సిగ్గు! సిగ్గు!
మనసు లేకపోయినా ఓకే. కనీసం మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగారి లాంటి పెద్దమనిషికి విలువ ఇద్దాం .. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం. డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతోంది అని నెలరోజులు షూటింగ్ ఆపేసిన పరిశ్రమ మనది.
….. ఇవీ తన ట్వీట్లు… ఇక స్ట్రెయిట్‌గా చెప్పుకుందాం… 1) ఈ జననాలు, మరణాలు, సెలబ్రేషన్స్, సంతాపాలు ట్రాష్ అని భావిస్తాడు వర్మ… వాటికి విలువే ఇవ్వడు… అలాంటిది హఠాత్తుగా కృష్ణంరాజు మరణానికి సంతాప ప్రకటన పట్ల ఏమిటీ నిందలు..? 2) నిర్మాతల మండలి, మా, ఫిలిమ్ ఛాంబర్‌లను గాకుండా కొందరు హీరోలను ట్యాగ్ చేస్తూ ఈ నిందలు దేనికి..? వాళ్లేనా ఇండస్ట్రీకి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేది..? 3) పోనీ, ఫిలిమ్ ఛాంబర్ గనుక రెండు రోజుల బంద్ నిర్ణయం తీసుకుంటే వాళ్లేమైనా వద్దంటారా..?
Ads
4) కృష్ణంరాజు నిర్మాత, వెరీ సీనియర్ నటుడు, లెజెండ్… కాబట్టి ఘనంగా వీడ్కోలు పలకాలట, వోకే… రేప్పొద్దున ఇంకెవరో మరణిస్తారు… తనకు కూడా షూటింగులు బంద్ పెట్టి మరీ సంతాపం ప్రకటించాలా వద్దా అని ఎవరు డిసైడ్ చేయాలి..? దానికి ప్రామాణికాలు ఏమిటి..? 5) రెండు రోజులు షూటింగులు బంద్ పెడితే, ఆ కాస్త ఆదాయం కోల్పోయే డెయిలీ కార్మికుల మాటేమిటి..? 6) షూటింగ్ ఆపకపోతే, మహోన్నత వీడ్కోలు ఇవ్వకపోతే అది మనమీద మనమే ఉమ్మేసుకోవడం అట… 7) మీరూ చస్తారు కదా, రేపు మీరు కూడా చస్తారు, మీరు ఇదే కోరుకుంటున్నారా అన్నట్టుగా దబాయించి, ఓ క్షుద్రమైన వాదనను ముందుకు తీసుకొస్తున్నాడు..
గతంలో ఎప్పుడూ ఇలా స్పందించని వర్మ ఇలా శోకాలు పెట్టడం వెనుక సామాజికవర్గ కోణం కూడా మెల్లిగా చర్చకు వస్తుంది… నాకు కులం లేదు, మతం లేదు అనే వర్మ మాటల్లోని డొల్లతనం మరోసారి ప్రదర్శితమవుతుంది… షూటింగులు బంద్ పెడితేనే ఒకరి మరణం పట్ల సంతాపం ప్రకటించినట్టా..? అదేనా ఘనమైన వీడ్కోలు..? అలాగైతే ఓ రేంజ్ నిర్మాతలు, దర్శకులు, నటులు, ఇతర వృత్తినిపుణులు గనుక మరణిస్తే, ఇలాగే బందులు ప్రకటిస్తూ పోతే… ఇండస్ట్రీ ఎదుర్కునే నష్టాల పరిస్థితి ఏమిటి..?! తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలను ప్రకటించింది… ఇంతకన్నా మంచి గౌరవప్రదమైన నివాళి ఏముంటుంది..?
Share this Article