నిజానికి ఏపీ రాజకీయాల్లో ఎవరూ తక్కువ కాదు… ఒకడిని మించి మరొకడు… వైసీపీ, టీడీపీ క్యాంపుల్లో కొందరు పేరొందిన నేతలున్నారు… బూతులు తప్ప మరో భాష రాదు… పీకేదేమీ ఉండదు, ఆ భాషలో వాగడం తప్ప…! సాక్షాత్తూ నా భార్యను అవమానిస్తున్నారంటూ అంతటి సుదీర్ఘమైన కెరీర్ ఉన్న చంద్రబాబు భోరుమని ఏడవడం ఏపీ బురద రాజకీయాల్లో ఓ మరుపురాని ఘట్టం… అంతకుముందు జగన్ మీద కూడా అసెంబ్లీలోనే అలాంటి దాడి జరిగేది… సో, ఎవరూ తక్కువ కాదు… ఏపీ రాజకీయాల సంస్కార స్థాయి అది… ఇళ్లల్లో పెళ్లాలు, తల్లులను కూడా ట్రోలింగులోకి లాగి, బట్టలిప్పి అవమానించే దుశ్శాసనులు…
పవన్ కల్యాణ్‌ను ఒకవేళ ఎవరైనా రాజకీయ నాయకుడిగా పరిగణిస్తే అది వాళ్ల మూర్ఖత్వం… దానికి పాపం పవన్ ఎలా బాధ్యుడు అవుతాడు..? ఎవడైనా తనను ఏమైనా అంటే చెప్పు తీసుకుని కొడతాను, ఇళ్లల్లో నుంచి లాక్కొచ్చి మరీ తాటతీస్తాను, కొడకల్లారా, దద్దమ్మల్లారా, ఇక యుద్ధమే, ఇన్నాళ్లు నా సహనమే మిమ్మల్ని కాపాడింది… నాకు రాజకీయం తెలియదు అనుకుంటున్నారా..? అని అదోరకం ఉన్మాద బాడీ లాంగ్వేజీలో ఊగిపోయాడు సాక్షాత్తూ ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడు… రాజకీయాలకు ఇంతటి స్పష్టమైన నిర్వచనం చెప్పుతో కొట్టినట్టుగా చెప్పిన నాయకుడు దేశంలో బహుశా ఇంకెవరూ లేరు… రారు… ది గ్రేట్ బీజేపీకి ఈ పార్టీతో పొత్తు.., అసలు ఒక రాష్ట్రంలో రాజకీయాల్లో సిగ్గూ, దశ, దిశ ఏమీ లేకుండా నడుస్తున్నదీ అంటే బహుశా ఏపీలో బీజేపీ ఒక్కటే కావచ్చు… మరోసారి నిరూపితమైంది…
జగన్ శుద్ధపూసా..? చంద్రబాబు శుద్దపూసా..? అనే ప్రశ్నలు అప్రస్తుతం… వాళ్లు ఎంత ప్రయత్నించినా వాళ్ల మొహాలకు పవన్ కల్యాణ్ వాడే భాష, ఆ టోన్, ఆ బాడీ లాంగ్వేజీ,, ఆ ఊగిపోవడంలో 5 శాతం కూడా చేతకావు… అంటే, వాళ్లకు పవన్ కల్యాణ్ భాష ప్రకారం రాజకీయాలు తెలియవు అని అర్థం… ఇక ఈ తమ్ముడిని ముఖ్యమంత్రి పోస్టులో చూసుకోవాలని అన్నయ్య చిరంజీవి ఆరాటం… అందుకే తను తప్పుకున్నాడట, అవసరమైతే భరోసాగా ఉంటాడట… ఈయనకే కదా జగన్ ఇంటికి పిల్చి, భోజనాలు పెట్టి, కానుకలు ఇచ్చి దండం పెట్టింది… గుడ్… వాళ్లు బాగానే ఉంటారులే… జగన్‌కు ఈరోజుకూ అర్థం కానిదేమిటంటే… సినిమావాడెప్పుడూ సినిమావాడే…
Ads
జనసేన జోలికి పోవద్దు, పవన్ జోలికి పోవద్దు, తనను ఏమైనా అనాలంటే ఎవరో ఒకరిద్దరు కాపు లీడర్లను ఎగేయాలి అంతే… లేకపోతే తనతో బీజేపీతో పొత్తు, బీజేపీవాళ్లకు కోపమొస్తే తన బెయిల్ రద్దవుతుంది, తన సర్కారు పీకేస్తారు అని జగన్ భయపడుతున్నట్టుగా….. నిజంగా జనసేన వంటి పార్టీని జగన్ టాకిల్ చేయలేడా..? ఒక్కొక్కడికీ ఇళ్లల్లో నుంచి లాగి చెప్పులతో కొడతాను, ఇదే యుద్ధం, ఇదే ఆరంభం అని ఆ పార్టీ ప్రకటించేదాకా విషమిస్తుందా..? మంత్రుల కాన్వాయ్లపైనే దాడులు జరుగుతాయా..? ఒక కోణంలో జగన్ శాంతిభద్రతల వైఫల్యం కూడా…
ఇదే పవన్ కల్యాణ్ హైదరాబాదులో కిక్కుమనడు… ఏమాటకామాట కేసీయార్‌ను ఖచ్చితంగా మెచ్చుకోవాలి… ఇలాంటి కేరక్టర్లను కంటిచూపుతో శాసిస్తాడు… పవన్ రాడ్లు, రాళ్లు, చెప్పులతో యుద్ధ ప్రకటన తరువాత వెంటనే కలిసింది చంద్రబాబును… అంటే ఏమిటి అర్థం..? ఇద్దరమూ కలిసి జగన్ తాటలు తీద్దాం అని ఒప్పందానికి వచ్చారా..? మరి అదే కదా వైసీపీ మొదటి నుంచీ ప్యాకేజీ స్టార్ అని ఆరోపిస్తోంది..? వికేంద్రీకరణ కు మద్దతుగా, టీడీపీ స్పాన్సర్డ్ యాత్రలకు కౌంటర్‌గా వైసీపీ గర్జనలో, మన్నో మశానమో ప్లాన్ చేస్తే, పవన్ ని టైంకు రంగంలోకి దింపి, చేతులకు తడి అంటని రాజకీయం ప్లే చేసిన చంద్రబాబుదే అసలు పాలిటిక్స్… కానీ జనం ఎదుట పిచ్చోడు అయింది ఎవరు..?
ఇక వేరే దిక్కులేక బీజేపీ హైకమాండ్ ‘అన్యథా శరణం నాస్తి’ అంటూ వీళ్లద్దరి పాదాల ఎదుట సాగిలబడాలా..? బాబ్బాబు, మీ దయ, ముగ్గురమూ కలిసి జగన్ తాట తీద్దాం అని దిగిరావాలా…? ఫాఫం బీజేపీ… ఫాఫం జగన్… అసలు ఏపీలో రాజకీయ నాయకులు చెప్పులు ధరించి తిరగొచ్చా లేదా తేల్చడానికి ముందైతే ఓ అయిదుగురు కొత్త సలహాదారులతో అర్జెంటుగా ఓ కమిటీ వేసెయ్ జగనన్నా…!!
Share this Article