ఆహా… మనల్ని ఎన్నోఏళ్లు నిర్దయగా పాలించిన ఆ తెల్ల దొరలను ఇప్పుడు మనం పాలించబోతున్నాం… ఇదేనా మీ ఆనందం..? రుషి సునాక్ బ్రిటన్ ప్రధాని అవుతున్నాడు… కింగ్ చార్లెస్ సంతకం చేయడమే తరువాయి రుషికి ప్రధాని కిరీటం అధికారికమవుతుంది… ప్రస్తుతం పోటీదారులు లేరు, పాత ప్రధానులు బోరిస్ తదితరులు కూడా పోటీ నుంచి విరమించుకున్నారు… సో, రుషి కుర్చీ ఎక్కడమే తరువాయి…
ఇప్పటికీ తన హిందూ రూట్స్ మరవని మనిషి… ఇండియన్ కల్చర్ అంటే ప్రేమించే మనిషి… మన ఇన్‌ఫోసిస్ నారాయణమూర్తి బిడ్డ అక్షతను పెళ్లి చేసుకున్నాడు… ఆమె ఈరోజుకూ ఇండియన్ సిటిజెనే… ఇవేనా మనం కాలరెగరేయడానికి దోహదపడేవి…? నిజానికి రుషి తాతలది పంజాబ్… తూర్పు ఆఫ్రికా మీదుగా బ్రిటన్ వెళ్లి స్థిరపడ్డారు… రుషి తండ్రి యశ్‌వీర్ కెన్యాలో పుట్టగా, తల్లి ఉష టాంజానియాలో పుట్టింది… రుషి మాత్రం బ్రిటన్‌లో పుట్టినవాడే… ఇండియన్ రూట్స్ కావచ్చుగాక… కానీ వాళ్లది విశ్వకుటుంబం…
సరే, ఎక్కడ పుడితేనేం… మనవాడు… ఓ అగ్రదేశాన్ని పాలించబోతున్నాడు, అది గర్వకారణమే కదా అంటారా..? ఒక కోణంలో పాక్షికంగా నిజమే… కానీ బ్రిటన్‌లో ప్రధాని పదవి అనేది మన దేశంలో ఓ సీనియర్ ఐఏఎస్ పోస్టులాంటిది… పెత్తనాలు చెలాయించి, ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఏమీ ఉండదు… చాలా కంట్రోల్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్… పార్లమెంటు ఎంత యాక్టివ్ అంటే… కొత్తగా లిజ్ ట్రస్‌ను ప్రధానిని చేశాక, నచ్చకపోతే 45 రోజుల్లో పీకిపారేశారు… సో, రుషి అయినా అంతే… పనితీరును బట్టి పదవీకాలం… అంతే…
Ads
తనను అధికారికంగా నియమించేది కింగ్… అధికార పార్టీ, ఎన్నికలు, ఫలితాలు రొటీనే అయినా, ప్రధానిని నియమించే సంప్రదాయం మాత్రం రాజుదే… నీ సీనియర్ కొలీగ్స్ నుంచి ఎవరిని కీలక శాఖలకు తీసుకుంటావో నీ ఇష్టం… పాలసీల్లో ఏం మార్పులు చేస్తావో నీ ఇష్టం… కానీ రిజల్ట్ కనిపించాలి… ప్రస్తుత సవాళ్ల నుంచి దేశాన్ని గట్టెక్కించాలి…
సీనియర్ కొలీగ్స్ ప్రధానంగా ట్రెజరీ, హోం వంటి కీలకశాఖల్ని నిర్వర్తిస్తారు… వీలైనంతమేరకు పార్టీ నిర్ణయాలు, పార్లమెంటు నిర్ణయాలు ప్రధాని అడుగుల్ని ప్రభావితం చేస్తుంటాయి… అంతేతప్ప, వాడిని పీకెయ్, వీడిని పెట్టెయ్ తరహా అధికారాల చలామణీ ఏమీ ఉండదు… ప్రధాని దేశభద్రతకు సంబంధించిన కీలక నిర్ణయాలను తీసుకోవచ్చా..? ప్రత్యేకించి అణ్వస్త్రాలు ఎట్సెట్రా…? ఎస్, ప్రధానికి ఆ అధికారాలున్నయ్… కానీ ప్రధానిని గైడ్ చేయడానికి టీమ్స్ ఉంటాయి…
ప్రతివారం ప్రధాని వెళ్లి రాజును మర్యాదపూర్వకంగా కలవాల్సి ఉంటుంది… దేశంలో ఏం జరుగుతున్నదో చెప్పాలి… ఇదంతా అనధికారికమే… ఓ గౌరవపూర్వక తంతు మాత్రమే… కానీ నిర్వర్తించకతప్పని విధి… సో, మనవాడు పాలిస్తున్నాడహో అనేంత గొప్ప ఆనందం అక్కర్లేదు… రేప్పొద్దున ఆ పార్లమెంటు ఇండియాకు వ్యతిరేకంగా ఏదైనా కఠిన నిర్ణయం తీసుకుంటే, సంతకం పెట్టాల్సింది, అమలు చేయాల్సింది ఈ రుషి సునాకే… అర్థమైంది కదా… మనవాడితో మనకు ఒరిగేదేమీ ఉండదు… అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా ఇండియనే… సో వాట్..? పాకిస్థాన్‌కు బలమైన స్నేహం మళ్లీ అమెరికాతో అల్లుకుపోతోంది…
అన్నట్టు చెప్పనేలేదు కదూ… బ్రిటన్ ప్రధాని జీతం ఎంత..? ఇండియాలో కొందరు ముఖ్యమంత్రులు అయితే రూపాయి జీతగాళ్లు కూడా ఉండేవాళ్లు… ఇండియాలో ఈ జీతాలు, గీతాల యవ్వారాలు వేరు కదా… బ్రిటన్‌లో అలా కాదు… అన్నీ లెక్క ప్రకారం ఉంటాయి… రుషి సునాన్‌కు ఎంపీగా 84 వేల పౌండ్లు వస్తాయి… ప్రధాని అయ్యాక మరో 80 వేల పౌండ్లు అదనంగా ఇస్తారు… అంటే 1.64 వేల పౌండ్లు… అనగా కోటిన్నర రూపాయలు…
సంప్రదాయికంగా వర్క్ ఫోర్స్, అఫీషియల్ మీటింగ్స్, గౌరవం ఎట్సెట్రా పొందడానికి ప్రధానులు 1735 నుంచీ 10 డౌనింగ్ స్ట్రీట్‌లో ఉంటారు… కాకపోతే మరింత ఎక్కువ విస్తీర్ణం ఉన్న బిల్డింగ్ కావాలనే పేరిట బోరిస్ జాన్సన్ సహా పాత ప్రధానులు నంబర్ 11 వాడుతున్నారు… అఫ్‌కోర్స్, బకింగ్‌హామ్‌షైర్‌లోని ప్యాలెస్ వంటి చెకర్స్ సరేసరి… ఇదీ అధికారిక నివాసమే… 1921 నుంచీ దీన్ని ప్రధానులు వాడుతున్నారు…
పింఛన్లు అంటారా..? ఏటా లక్ష పౌండ్ల వరకూ తీసుకునే చాన్స్ ఉంది… కానీ పెద్దగా ఎవరూ క్లెయిమ్ చేసుకోరు… ప్రధానిగా దిగిపోయినా సరే, వాళ్ల ప్రైవేటు లైఫ్‌లో వాళ్లే సంపాదించుకుంటారు… ఏమీ లేకపోతే పుస్తకాలు రాసి, రాయల్టీ పొందుతుంటారు… అంతేతప్ప ఇండియాలోలాగా అధికారిక బంగళాలను ఖాళీ చేయకుండా, చిల్లరగా వ్యవహరించరు…
సో, విస్తృతాధికారాలు అనే పదం పెద్దగా బ్రిటన్ ప్రధానులకు వర్తించదు… వాళ్లకు అధికారంకన్నా వర్క్, రిజల్ట్ చూపించడం ముఖ్యం… ముందే చెప్పుకున్నట్టు కీలక ఉన్నతాధికారి… అంతే… కీలక నిర్ణయాలు గనుక తమ పార్టీ వాళ్లకు, పార్లమెంటుకు నచ్చకపోతే మొన్న లిజ్ ట్రస్‌ను దింపినట్టే నిర్మొహమాటంగా దింపేస్తారు… లేదంటే అవిశ్వాసం పెట్టే అవకాశమూ ఉంది… అది కొన్నిసార్లు మళ్లీ ఎన్నికలకు దారితీయవచ్చు కూడా… డేవిడ్ కామెరూన్ నుంచి థెరాసమే బాధ్యతలు తీసుకున్నప్పుడు ఆమె ఎన్నికల వైపు వెళ్లలేదు… బోరిస్ జాన్సన్ కూడా అంతే కదా… ఐనా సరే, అంతటి బ్రిటన్ పెద్ద కుర్చీపై మనవాడు కూర్చోవడం అంటే… ఎక్కడో కాన్షియస్ హేపీగా ఫీలవుతున్నదీ అంటారా..? కానివ్వండి..!!
Share this Article