సెలబ్రిటీలు… ప్రత్యేకించి సినిమా సెలబ్రిటీలు కాస్త పాపులరైతే చాలు… రకరకాల కమర్షియల్స్‌లో నటించి ఎడాపెడా డబ్బు తీసుకుంటారు… తప్పుకాదు… బ్రాండ్ ప్రమోషన్ల విషయంలో ఉభయతారకం… అయితే తాము ప్రచారం చేస్తున్న సరుకులతో ప్రజలకు నష్టం వాటిల్లే పక్షంలో వాటికి ఆయా సెలబ్రిటీలు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది… లీగల్‌గానే… ఈ విషయం చాలామందికి తెలియదు…
అంతెందుకు..? అనైతికంగానూ డబ్బు సంపాదిస్తుంటారు కొందరు… అప్పట్లో అమితాబ్ బచ్చన్, అక్షయ్ తదితరులు గుట్కా సరోగేట్ యాడ్స్ చేసి, తరువాత చెంపలేసుకున్నారు… కానీ ఈరోజుకూ మహేశ్ బాబు చేస్తూనే ఉంటాడు… జీతెలుగు వాడికి బ్రాండ్ అంబాసిడర్‌గా దిక్కుమాలిన సీరియల్స్‌కు యాడ్స్ చేస్తుంటాడు, బిడ్డతో కలిసి…! చిన్నాచితకా నటులందరూ యాడ్స్ చేస్తూనే ఉంటారు… కొందరు హీరోలు లుంగీలు, చెడ్డీలు, బనియన్లకూ కమర్షియల్స్ చేస్తారు… కానీ బాలయ్య ఇన్నేళ్ల తన కెరీర్‌లో కమర్షియల్స్ చేయలేదు…
తను తలుచుకుంటే బ్రాండ్ ప్రమోషన్లతో కోట్లు సంపాదించి ఉండేవాడు… కానీ వాటి జోలికి పోలేదు తను… అబద్ధపు ప్రచారాలతో కూడిన యాడ్స్ అయితే సాయిపల్లవి వంటి హీరోయిన్లు దూరంగా ఉంటారు… సమాజం పట్ల బాధ్యతను ఫీలయ్యే వ్యక్తిత్వాలు… సరే, బాలయ్య సంగతికే వస్తే, మొదటిసారి అన్‌స్టాపబుల్ పేరిట ఓటీటీ షోలకు వచ్చినట్టే… మొదటిసారి కమర్షియల్స్ స్టార్ట్ చేశాడు… సాయిప్రియ కన్‌స్ట్రక్షన్స్ వాళ్లకు యాడ్స్ చేశాడు…(ప్రింట్ మీడియాకు కూడా వాడుకుంటారు…)
Ads
అవి రెండూ ఆశ్చర్యమేసింది… రెండు యాడ్స్… అందులో ఒకటి పద్ధతిగా, ప్రొఫెషనల్‌గా బాగుంది… ఒక కన్‌స్ట్రక్షన్ కంపెనీ వినియోగదారులకు ఏం చెప్పాలో దాన్నే బాలయ్యతో చెప్పించింది… అట్టముక్కలతో కట్టిన బొమ్మరిల్లు ఎన్నిసార్లయినా కట్టుకోవచ్చు, కానీ మనం కలలు గనే ఇల్లు జీవితంలో ఒకేసారి కట్టుకోగలం… అది నమ్మకం, నాణ్యత, నవ్యత, నిబద్ధత అనే నాలుగు స్తంభాలపైన నిలబడాలి… ఇక్కడి వరకూ వోకే… కానీ..?
మరో యాడ్ చూస్తే… సేమ్, బాలయ్య, సినిమా అయినా, టీవీ అయినా, ఓటీటీ అయినా, యాడ్స్ అయినా… సెల్ప్ డబ్బా తప్పదు, తను తప్పించుకోలేడు అనిపిస్తుంది… బ్లడ్డు, బ్రీడు ఎప్పుడూ మనసులోనే మెదులుతూ ఉంటాయేమో… ‘‘కొందరు నీళ్లలా పల్లానికి కాదు, రాకెట్లలా పైకి దూసుకుపోతారు… ప్రపంచంతో నడవరు, ప్రపంచానికే నడక నేర్పిస్తారు… ఒంటరిగా గెలవడం కాదు, వెంట ఉన్న అందరినీ గెలిపిస్తారు… బంగారంలా తరిగిపోరు, వజ్రంలా వెలిగిపోతారు… లెజెండ్‌లా నిలిచపోతారు…’’ అంటుంటాడు… వెనుక తను నటించిన పాత్రల ఫోటోలు కనిపిస్తుంటాయి…
అచ్చంగా అఖండ సినిమాలో డైలాగుల్లా అనిపించాయి, వినిపించాయి… తన సుత్తి ఎక్కువైంది… అదే లెజెండ్ భాష… ఇది సదరు కన్‌స్ట్రక్షన్ కంపెనీకి ప్రచారంలా గాకుండా, తన స్వీయ ప్రచారంలా ఉంది… ఐనా బాలయ్య ఇప్పుడేం మారతాడు..? మారలేడు… మారడు… సేమ్, అదే పోకడ… ఎస్, రాజకీయమైనా, సినిమాలైనా… పెద్ద తెర అయినా, చిన్న తెర అయినా… చాట్ షో అయినా, కమర్షియల్ యాడ్స్ అయినా… బాలయ్య అంటే అంతే…!!
Share this Article