మళ్లీ ఒక్కసారిగా ఎంత హడావుడి… ఎంత కళ… అసలు థియేటర్లకు జనం వస్తారా..? అనే పరిస్థితి నుంచి ఒకేసారి పది సినిమాల విడుదల… థాంక్ గాడ్, దిక్కుమాలిన పెద్ద స్టార్ల సినిమాలు మార్కెట్‌లో ఒక్కటీ లేని పుణ్యమాని చిన్న సినిమాలన్నింటికీ థియేటర్లు అడ్జస్టయ్యాయి… ఏ పెద్ద స్టార్ సినిమాయో ఉండి ఉంటే, థియేటర్లలో గంపగుత్తాగా రిలీజ్ చేసి, ప్రేక్షకుల జేబుల్ని కత్తిరించేవాళ్లు…
కానీ ఇప్పుడు..? ఎన్ని సినిమాలు… ఎన్ని ఆశలు, ఎందరు వర్ధమాన కళాకారులు… ఎన్నెన్నో ఆకాంక్షలు… పరీక్షించుకుంటున్నారు… డబ్బులు ఇండస్ట్రీలోకి మళ్లీ ప్రవహిస్తున్నాయి,… షూటింగులు జరుగుతున్నాయి… ఎందరో బతుకుతున్నారు… ఈ సినిమాలు ఎన్ని నడుస్తాయి, ఎన్ని ఫట్‌మని పేలిపోతాయి అనేది వేరే సంగతి…
సోకాల్డ్ స్టార్ల సినిమాలు మార్కెట్‌లో లేకపోతే ఎంత సందడి, ఎందరికి థియేటర్ల ఊరట… ఎందరి ఆశలకు యూరియా… ఎటొచ్చీ ఎప్పుడో గానీ ఈ సిట్యుయేషన్ రాదు… మొన్నమొన్నటిదాకా కరోనా భయాలు… ఓటీటీ విజృంభణ, (అఫ్ కోర్స్ ఇప్పటికీ…)… అడ్డగోలు టికెట్ రేట్లు, దోచుకునే క్యాంటీన్ రేట్లు, పార్కింగ్ కష్టాలు… అసలు థియేటర్‌కు రావడం అంటేనే ఓ పెద్ద ప్రయాస… తీర్థయాత్రకు వెళ్లినంత ఆయాసం…
Ads
ఈ స్థితిలో ఒకేసారి పది సినిమాలు కొత్త కొత్తగా థియేటర్లలో కనిపించడం ఓ పాజిటివ్ సంకేతం… మళ్లీ స్టార్లవి అయిదారు సినిమాలు రిలీజుకు సిద్దంగా ఉంటే, వాళ్లలో వాళ్లే రిలీజు గ్యాపుల గురించి మాట్లాడుకుని, థియేటర్లన్నీ కబ్జా పెట్టేస్తే… మళ్లీ చిన్న సినిమాలకు పెద్ద శాపం… ఇప్పుడు మార్కెట్‌లో కాంతార తప్ప ఎవరికీ ఏ పోటీ లేదు… కొద్దిగా సర్దార్… అంతే… ఉరికేంత మైదానం…
కాకపోతే ఆ పదిలో ఒకటి ఎలాగూ పాతది ప్రతిబింబాలు రీరిలీజ్… నడిస్తే నడిచింది, పోతే పోయింది… మిగతావి ఏవీ క్లిక్కయ్యే సీన్ లేదు… వేటికీ హైప్ లేదు… అడ్వాన్స్ బుకింగుల హడావుడి లేదు… కాకపోతే… అసలు థియేటరే దొరకని దురవస్థకన్నా, డబ్బాల్లోనే మిత్తీల బరువుతో చచ్చిపోయే దుస్థితికన్నా ఇది నయమే కదా… ఎంతొస్తే అంత… లక్ కరుణిస్తే నాలుగు డబ్బులు ఎక్కువ వస్తే మరో పదిమంది బతుకుతారు… మరో నాలుగు సినిమాలు వస్తాయి…
సంక్షిప్తంగా ఒకటీరెండు సినిమాల గురించి చెప్పుకోవాలంటే… బనారస్… ఈ నటీనటులు ఎవరో తెలియదు… సినిమా ఎవరు తీశారో తెలియదు… కానీ ఇప్పుడు ప్రతి దిక్కుమాలిన సినిమా పాన్ ఇండియా సినిమాలాగా మనపైకి దాడి చేస్తోంది కదా… అదుగో, ఇదీ అలా వచ్చిందే… థియేటర్లు కూడా బాగానే దక్కాయి…
ఊర్వశివో రాక్షసివో అనే సినిమాకు కాస్త హైప్ క్రియేటైంది… అదీ ప్రిరిలీజుకు బాలయ్య రావడం వల్ల… అది అల్లు అరవింద్ కొడుకు సినిమా కావడం వల్ల, తను శ్రద్ధ తీసుకోవడం వల్ల… ఇవే కాదు, తగ్గేదేలే… లిమిటెడ్ థియేటర్లలో జాన్వీ సినిమా మిలీ… లైక్ షేర్ సబ్‌స్క్రయిబ్, ఆకాశం, జెట్టి, సారథి… ఇలా కొన్ని సినిమాలు రిలీజవుతున్నాయి… ఏ సినిమాలో ఎవరు నటించారో కూడా తెలియదు… మార్కెట్‌లో పెద్ద సినిమాలు లేకపోవడం ఎంతమందికి సానుకూలతో కదా…!!
Share this Article