అందరూ ఆదిపురుష్ సినిమా ఆరు నెలలు వాయిదా పడింది… మరో 100 కోట్లు బొక్క అని రాసేస్తున్నారు… సినిమాకు గ్రాఫిక్ రిపేర్లు చేయించాలని చెబుతున్నారు… కానీ నిజానికి చెప్పాల్సింది అది కాదు… గ్రాఫిక్స్ కాదు, అసలు కంటెంటుకే రిపేర్లు అవసరం… ఇప్పుడున్న స్థితిలో ఆదిపురుష్ గనుక రిలీజ్ చేస్తే దర్శకుడు ఓం రౌత్‌ను ఎక్కడైనా కట్టేసి కొడతారేమో…
అసలు ఇలాంటి పిచ్చోడిని పట్టుకుని టీ-సీరీస్ వాళ్లు 500 కోట్ల బడ్జెట్ పెట్టడం ఏమిటి..? ప్రభాస్ గుడ్డిగా, అసలు సినిమా ఎలా వస్తుందో కూడా చూసుకోకపోవడం ఏమిటి..? ఆగండాగండి… ఆరునెలల వాయిదా, మరో వంద కోట్ల రిపేర్ల బడ్జెట్ కాదు, ఓం రౌత్ ఈ నిర్మాతలను ఇంకా ముంచేయబోతున్నాడు… ఇందులో ప్రభాస్ తప్పు కూడా ఉందట…
ఎక్కడో రాజమౌళి చెబుతున్నాడు… ‘‘మహాభారత కథలో నాకు చీమతలకాయంత కూడా తెలియదు… చాలా చదవాలి… చాలా వర్క్ జరగాలి… ఆ తరువాతే దాని జోలికి వెళ్తాను, అది నా డ్రీమ్ ప్రాజెక్టు…’’ నిజం… కానీ యావత్ భారతమే కాదు, ఇతర దేశాల్లో సైతం ప్రజలు దేవుడిలా పూజించే రాముడి కథ విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి… ఆదిపురుష్ విషయంలో అదే జరగలేదు… పైగా రావణుడిని ఓ మానవీయ వ్యక్తిగా చూపించే కథ అట…
Ads
ప్రభాస్ ఆరోగ్యం బాగాలేకపోవడం, సర్జరీలు, డేట్లు సరిగ్గా ఇవ్వకపోవడంతో… దర్శకుడు ఇష్టారాజ్యంగా చుట్టిపారేశాడు… ఏవేవో యానిమేటెడ్ కార్టూన్ ఫిల్మ్స్ నుంచి యథాతథంగా ఎత్తిపారేసి, ఘోరమైన ఔట్ పుట్ ఇచ్చాడు… అబ్బే, త్రీడీలో చూడండి, అదిరిపోతుంది అని ఏదో కలరింగ్ ఇచ్చాడు… నిర్మాతలకు పాపం సిగ్గులేదు… ఆ దర్శకుడు ఏం చేస్తున్నాడో కూడా చూసుకునే దిక్కులేదా 500 కోట్లు పెట్టే వాళ్లకు..? మరీ ప్రత్యేకించి ఆ రావణ పాత్ర గురించి వెనక్కి తిరిగి చూసుకున్నారా..?
ఇప్పటికీ 100 కోట్లు అదనంగా పెట్టినా… చిక్కులు తప్పేట్టు లేవు… ఎందుకంటే..? సరిగ్గా రెండేళ్ల క్రితం వార్తల్లోకి వెళ్దాం ఓసారి… అప్పటికి సినిమా ప్రొడక్షన్ ఎందుకో ఆగిపోయి ఉంది… రావణ పాత్రధారి సైఫ్ ముంబై మిర్రర్ పత్రికతో మాట్లాడుతూ ఓ వివాదానికి తెరలేపాడు… ఈ సినిమాలో రావణుడిలోని మానవీయ కోణాన్ని చూపించనున్నట్టు చెప్పాడు…
అంటే ఓ రాక్షసుడిగా గాకుండా మనిషిగా చిత్రీకరించడమే కాదు… సీతమ్మను ఎత్తుకుపోవడాన్ని కూడా జస్టిఫై చేస్తారట… అంటే శూర్ఫణఖకు లక్ష్మణుడు చేసిన అవమానానికి ప్రతీకారంగా సీతను ఎత్తుకుపోవడం సబబే అన్నట్టుగా కథనం ఉంటుందట… రావణుడు సీతను ఎత్తుకుపోవడం సబబే అని ఆదిపురుష్ సినిమాలో గనుక చిత్రీకరించి, రిలీజ్ చేస్తే ‘రామభక్తులు’ ఊరుకుంటారా..? అసలు ఈ దేశం వేల ఏళ్లుగా ఆరాధిస్తున్న కేరక్టర్లను, పురాణగాథలను ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు భ్రష్టుపట్టించేయడం ఏమిటి..?
ఇది అప్పుడే కొన్ని విమర్శలను, వివాదాలను రేపింది… దేశం మొత్తం రాముడిని హీరోగా, రావణుడిని విలన్‌గా భావిస్తుంటే… దానికి భిన్నంగా ఈ సినిమా కంటెంట్ గనుక జనంలోకి తీసుకువెళ్తే అది ప్రభాస్‌ను అనవసర చిక్కులకు గురిచేస్తుందనే అభిప్రాయాలు వినిపించాయి… ఆ నిర్మాతలకు ఎలాగూ ఏ సోయీ లేదు కదా… కానీ మీడియాలో వెల్లువెత్తిన విమర్శలతో సైఫ్ ఒక్కసారిగా సర్దుకున్నాడు…
‘‘నా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నాను… వివాదాలకు తావివ్వదలుచుకోలేదు…’’ అన్నాడు… అంటే వివాదాలు దేనికిలే అనుకుని ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నాడా..? అంతేతప్ప, కంటెంటు గురించి తప్పుడు సమాచారం ఇచ్చాను అనలేదు… అంటే సీతమ్మ కిడ్నాప్‌ను జస్టిఫై చేసేట్టుగా కంటెంటు ఉంటే, దానిపై నిర్మాతల నుంచి ఏ వివరణా లేదు… ప్రభాస్‌కు ఏ సోయీ లేదు… సో, రావణుడు మంచివాడు, తను చేసిన ప్రతిపనీ సమర్థనీయమే అన్నట్టుగా కంటెంట్ ఉంటే… ఇప్పుడు కేవలం గ్రాఫిక్స్ రిపేర్లు చేస్తారు గానీ, కంటెంటు మాటేమిటి..? అలాగే రిలీజ్ చేస్తారా..?
నిజానికి రావణుడు చాలామంది దృష్టిలో విలన్ ఏమీ కాదు… పైగా పూజనీయుడు… అనేకచోట్ల రావణుడికి గుళ్లున్నాయి… తమిళనాడు, కేరళ దక్షిణ ప్రాంతాల్లో రావణుడినే దేవుడిగా ఆరాధిస్తారు పలుచోట్ల… (రావణుడిది వైరభక్తి… అంటే దేవుడిని వేగంగా చేరుకోవడానికి అవలంబించే భక్తి… అందుకే చాలామంది యోగులు కూడా రావణుడిని ద్వేషించరు… సఖ్యభక్తికన్నా వైరభక్తిలోనే గాఢత అధికంగా భావిస్తారు… సరే, అదంతా వేరే కథ… అదొక తత్వం…)… ఎన్టీయార్ వంటి నటదర్శకులు గతంలో రావణుడికి హీరోయిజం ఆపాదించి మరీ సినిమాలు తీశారు, ప్రజలు అభిమానించారు… ఎవరూ వ్యతిరేకించలేదు…
ఒక ఎన్టీయార్ రావణ పాత్రను ప్రేమించాడు అంటే, దాన్నే సినిమాలో చూపించాడు అంటే… దానికి జస్టిఫికేషన్ ఇస్తాడు… అంతే తప్ప సీతను కిడ్నాప్ చేయడం కరెక్ట్ అనడు… రావణుడు విజ్ఞానఖని, భక్తిపరుడు, మంచి పాలకుడిగా చూపిస్తాడు, అంతేతప్ప తన ప్రతి చర్యనూ వెనకేసుకురాడు… రావణుడికి హ్యామన్ యాంగిల్ ఏదీ అద్దడు… కానీ టీ-సీరిస్, ప్రభాస్ నమ్ముకున్న ఓం రౌత్ 600 కోట్ల మాటేమిటో గానీ… (ఇప్పటివరకూ ఇండియన్ సినిమాలో ఇదే అత్యధిక బడ్జెట్…) సినిమాను మాత్రం ముంచేసే సూచనలే కనిపిస్తున్నాయి… ఈ కథకు, ఈ గ్రాఫిక్స్‌కు, ఈ యానిమేటెడ్ కార్టూన్లకు 600 కోట్లు ఏమిట్రా…!!
Share this Article