అమెరికాలోని అరిజోనా… అల్కర్ లైఫ్ ఎక్స్‌టెన్షన్ ఫౌండేషన్ ఫెసిలిటీ… ఇక్కడేం చేస్తున్నారంటే..? శరీరమైతే కోటిన్నర, మెదడయితే 65 లక్షలు తీసుకుని, భద్రపరుస్తారు… దీనికి క్రయోనిక్స్ పద్ధతిని వాడుతున్నారు… మనిషి చనిపోయాడని చట్టపరంగా ధ్రువీకరించిన వెంటనే వీళ్లు వస్తారు… శరీరం నుంచి రక్తం, ఇతర ద్రవ పదార్థాల్ని తొలగిస్తారు… పెద్ద పెద్ద స్టీల్ ట్యాంకుల్లో ద్రవరూప నెట్రోజన్ నింపి, అందులో మైనస్ 200 ఉష్ణోగ్రత వద్ద శరీరాన్ని భద్రపరుస్తారు…
నిజానికి మనిషి గుండె కొట్టుకోవడం ఆగిపోవడంతోనే మరణ ప్రక్రియ పూర్తి కాదు… మన కణజాలం, కండరాలు, అవయవాలు కొంతసేపు చేతన స్థితిలోనే ఉంటాయి… సో, అవి పనిచేయడం ఆగేలోపు ఈ సంస్థ వాళ్లు వచ్చేసి, వాటిని గడ్డకట్టిస్తారు… మొత్తానికి మన శరీరం అలా ఆ స్టీల్ ట్యాంకుల్లో ఏళ్లకేళ్లు అలా ఉండిపోతుంది… ఇదీ క్రయోనిక్స్… ఇప్పటికి 200 మనిషి శరీరాలు, 100 పెంపుడు జంతువుల శరీరాలు భద్రపరిచారు… అయితే ఇదంతా ఎందుకు..?
భవిష్యత్తులో మెడికల్ టెక్నాలజీ ఇంకా వేగంగా డెవలప్ అవుతుందనీ, ఆగిపోయిన గుండెను మళ్లీ కొట్టుకునేలా చేయవచ్చుననీ, తద్వారా తిరిగి మన శరీరాన్ని చేతన స్థితిలోకి తీసుకువచ్చేంతగా వైద్య పరిజ్ఞానం ఎదుగుతుందనీ నమ్ముతున్నారు… సో, మన శరీరాన్ని ఇలా భద్రపరుచుకుంటే, ఈ టెక్నాలజీ వచ్చాక తిరిగి బతికించేస్తే, ఎంచక్కా మనం మన పాత అనుభవాలతో, జ్ఞానంతో మన జీవితాన్ని ‘‘కొనసాగించవచ్చునని’’ వందలాది మంది విశ్వాసం… ఈ బాడీ స్టోర్ వెనుక కథ ఇదే…
Ads
నిజానికి ఈ కోరికే సమంజసంగా లేదు… ఎందుకంటే..? ఎన్నేళ్లకో నిజంగా ఆ టెక్నాలజీ వస్తే, మనం మళ్లీ బతికితే… ఆ ముసలి శరీరంతోనే ఎందుకు ‘‘కొనసాగాలి’’… యవ్వన దశ నుంచో, బాల్యం నుంచో పునర్జన్మ ప్రారంభమైతే అదొక థ్రిల్… ఆ జీవితానికి మళ్లీ అన్ని సుఖాలూ దక్కుతాయి… పైగా సపోజ్, ఏ యాభై ఏళ్లకో ఈ టెక్నాలజీ వచ్చేసి, మనం మళ్లీ బతికిపోయాం అనుకొండి… అప్పటికి ఈ ప్రపంచం మనం అలవాటు కానంతగా ముందుకు పోతుంది… ఏ 1940, 50 వాడిని దేవుడు టైమ్ జోన్ మార్చేసి, హఠాత్తుగా ఈ 2022లో పడేస్తే ఎలా గిలగిల్లాడిపోతాడో అలా ఉంటుంది…
నిజానికి ప్రపంచంలోని మతసంస్థలు ఉరుముతున్నాయి… ప్రభుత్వాలు సమ్మతించడం లేదు… అసలు మనిషి మనుగడే క్రైసిస్‌లో పడిపోతుందనే భయాందోళనల నడుమ క్లోనింగ్ టెక్నాలజీ ఎప్పుడో సక్సెసయినా సరే, ఇప్పుడు దానిపై తదుపరి ఆధునిక డెవలప్‌మెంట్ పరీక్షలు లేవు, ప్రయోగాలు లేవు… నిజానికి క్లోనింగ్‌ను గనుక అనుమతిస్తే మన కణం నుంచే మళ్లీ మనల్ని పుట్టించడం అసలైన పునర్జన్మ… మనమే మళ్లీ పుడతాం… జీన్ మ్యాపింగ్, జెనెటికల్ ఇంజనీరింగ్, జీన్ ఎడిటింగ్, డిజైనర్ బేబీ టెక్నాలజీ గట్రా ఇంకా డెవలప్ అయితే… మనలోని మైనస్ పాయింట్లను కూడా సవరించుకుని మళ్లీ పుట్టొచ్చు…
అదే నిజమైతే, ఇక కొత్త తరాలు రావు… ఉన్నవాళ్లే మళ్లీ మళ్లీ పుట్టేస్తుంటారు… మానవ పరిణామ క్రమమే ఆగిపోతుంది… అదొక సంక్షోభం… పోనీ, అలా క్లోనింగ్ ద్వారా కొత్త శరీరాల్ని పుట్టించి, అవసరమైన అవయవాల్ని తీసేసుకుంటే ఎలా ఉంటుందనే చర్చలూ జరిగాయి… కానీ అవయవాలు తీసుకుని, ఆ ‘కొత్త జీవి’ని చంపేయాల్సిందేనా..? అసలు అవయవాల కోసం కొత్త జీవాల పుట్టుక అనే భావనే భీకరంగా, డిస్టర్బింగ్‌గా ఉందనే వాదనలూ జరిగాయి…
రాబోయే కాలంలో ఖచ్చితంగా మనిషి ఆయుష్షును పెంచవచ్చు… గత శతాబ్దంతో పోలిస్తే ఇప్పటికే బాగా పెరిగింది… ఇది ఇంకా పెరుగుతుంది… వందేళ్లు బతికాడు అంటే ఎవరూ ఆశ్చర్యపోయే సీన్ ఉండకపోవచ్చు… అలాగే మనిషిని మరింత యంగ్ చేసి, రోగాల్ని తొలగించి, ఫుల్ సర్వీసింగ్ చేసి ఇచ్చే రోజులూ వస్తాయేమో… మరి అలాంటప్పుడే శరీరాలను భద్రపరిచే క్రయోనిక్స్ ఓ మూర్ఖ ప్రక్రియగా తోస్తుంది…!!
చివరగా :: 2016లో ఓ కేసు… బ్రిటన్‌లో… క్రయోనిక్స్ ద్వారా శరీరం భద్రపరుచుకుంటాననే ఒకరి కోరికను అధికారులు అంగీకరించలేదు… కోర్టుకు వెళ్లింది పంచాయితీ… వీర్యం, అండం భద్రపరిచినట్టే, శరీరం భద్రపరుస్తారు, యూకే హ్యామన్ టిష్యూ యాక్ట్ ప్రకారం శరీరం భద్రపరుచుకోవడం నేరమేమీ కాదు అని కోర్టు చెప్పింది… అవునూ… వీర్యం, అండం భద్రపరచడానికీ, ఏకంగా శరీరమే భద్రపరుచుకోవడానికీ తేడా లేదా..?!
Share this Article