ఊరూరూ తిరిగి, ఇల్లిల్లూ తిరిగి శుభలేఖలు పంచిపెట్టే ఓపిక, టైం నేడెక్కడిది..? ఆ శుభలేఖలతోపాటు పిలిచే గెస్టులతో మనకున్న పరిచయం, సాన్నిహిత్యం, బంధుత్వాన్ని బట్టి కుడుకలో, పోకలో, స్వీట్లో పెట్టేవాళ్లు… గెస్టులు సమయానికి ఇంట్లో ఉంటే, వాళ్లు పోసే చాయ్‌లు తాగీ తాగీ కడుపు ఖరాబ్ కావడం మరో సహజవిషయం… మునుపు పెళ్లి పనులంటే కుటుంబానికి సంబంధించిన అందరూ అరుసుకునేవాళ్లు… ఇప్పుడదీ లేదు…
సొసైటీకి కరోనా చేసిన పుణ్యమేమిట్రా అంటే…. శుభలేఖల్ని వాట్సపులో పంపించేసి, ఫోన్లు చేసి ఆహ్వానించడం..! కరోనా భయాలు కాస్త కాస్త తొలుగుతున్నవేళ ఈ వాట్సప్ శుభలేఖల పంపిణీ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది… వచ్చినా సరే, రాకపోయినా సరే, ఆహ్వానించడం నా మర్యాద అన్నట్టు ఉంటుంది ఇది… మరి అప్పట్లో ఉన్న భయం అలాంటిదే కదా…
ఈ శుభలేఖల్లో కూడా యానిమేషన్ వెడ్డింగ్ కార్డులు, వీడియో వెడ్డింగ్ ఇన్విటేషన్లు సరేసరి… ఎన్ని కొత్తగా వచ్చి పలకరించినా పదే పదే అదే యాది బాగుంటుంది… పల్చటి, పచ్చటి పాతకాలం కార్డులు… వాటిపై ఆదిత్యాది గ్రహస్సర్వేతో మొదలయ్యే కంటెంటు… నాలుగు మూలలకూ వేలితో అద్దిన కాసింత పసుపు…
Ads
తరువాత భారీ కార్డులు, ఎంత ఖరీదైన కార్డు ముద్రించి పంచితే అంత ఖదర్… ఇక బలిసినవాళ్లింటి కార్డు అయితే అందులోనే చిన్న గిఫ్టులు… అవి కార్డులు కాదు, పెట్టెలు… కొందరు చిత్రవిచిత్రంగా కొత్త కొత్తగా కార్డుల్లో కంటెంటు ముద్రిస్తుంటారు… పక్కా మాండలికంలో, డిఫరెంట్ స్టయిల్స్‌లో కంటెంటు రాస్తారు… కొందరైతే మరీ క్షుప్తంగా ఫలానారోజు, ఫలానాచోట మేం పెళ్లిచేసుకుంటున్నాం, రండి, కలిసి భోంచేద్దాం అని రాసేస్తారు… ఆ కార్డుల కథలోకి వెళ్లేకొద్దీ ఇక బయటికి రాలేం…
సరే, అవన్నీ ఎలా ఉన్నా… ఇది వాట్సప్ శుభలేఖల కాలం కదా… ఎక్కువ మందికి పంపించేది అదే… ఇప్పుడు దగ్గరి వాళ్లకూ అవే పంపిస్తున్నారు చాలామంది… వాటిల్లో కూడా క్రియేటివిటీ చూపిస్తున్నారు… అలాంటి కార్డుల్లో ఇది బాగుంది… ఈ వీడియో చూడండి… మాటలు అనవసరం…
పద్యరూపంలో ఆహ్వానం… అందులోనే అన్ని వివరాలూ… ఎవరు రాసిచ్చారో కూడా బాగున్నాయి పద్యాలు… నిజానికి ఆసక్తి ఉన్నవాళ్లు ఇవే పద్యాలలో తమవారి పేర్లను పొదుగుకుంటే సరిపోతుంది… అందుకున్నవారికి కూడా కనెక్టయ్యేలా ఉంది… బాగుంది…
Share this Article