రైతు పేరిట జాతీయ రాజకీయాల్లో దూసుకుపోదామని కేసీయార్ చెబుతున్నాడు… రైతుసంక్షేమంలో తెలంగాణ నమూనాను దేశవ్యాప్తంగా ప్రచారం చేసి, ప్రజలకు ఆదర్శంగా చూపిస్తామనీ అంటున్నాడు… బీఆర్ఎస్ ఢిల్లీ ఆఫీసు ఓపెన్ కాగానే ఫస్ట్ కిసాన్ సెల్‌నే ప్రకటించాడు… రైతుబంధు, రైతుభీమా, రైతుకు సాగుసాయం, ఉచితకరెంటు, 24 గంటల కరెంటు వంటి పథకాలను తెలంగాణ నమూనాలో చూపిస్తున్నాడు…
ఐతే ఇదేరోజు రైతు స్వరాజ్యవేదిక తెలంగాణలో రైతుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఓ సర్వే రిపోర్టు ద్వారా వెల్లడించింది… కేసీయార్ చెబుతున్న రైతుసంక్షేమ ప్రభుత్వంలోని డొల్లతనాన్ని బట్టబయలు చేసింది… ప్రత్యేకించి కౌలురైతుల దుస్థితిని గణాంకాలతో సహా వివరించింది… ఆత్మహత్యలు ఆగడం లేదు… ఆ ఆత్మహత్యల్లో 80 శాతం కౌలుదారులవే… అసలు రాష్ట్ర వ్యవసాయంలో 36 శాతం కౌలుదారులే… 20 జిల్లాల్లోని 7744 మంది రైతులను కలిసి రిపోర్టు రూపొందించారంటే ఇది నాణ్యమైన రిపోర్టే…
వ్యవసాయం అంతా కౌలుదారుల చేతుల్లో ఉన్నప్పుడు… పంటల్ని, ప్రాణాల్ని రిస్క్ తీసుకుంటున్నప్పుడు… ఆర్థికంగా చితికిపోతున్నప్పుడు ప్రభుత్వ సాయం నిజంగా అందాల్సింది కౌలుదారులకు… కానీ తెలంగాణలో కౌలు రైతు అనే పదమే వినిపించడానికి వీల్లేదు… బేసిక్‌గా తెలంగాణ రైతుసంక్షేమ నమూనాలో పెద్ద లోపం ఇదే… వాళ్లకు ప్రభుత్వ పథకాలు అందవు… భూయజమానుల్లో 55 శాతం మంది ఉద్యోగులు, వ్యాపారులే అయినా కేసీయార్ వాళ్లకు డబ్బులు ఇస్తుంటాడు… ఎందుకు…?
Ads
నిజంగా సాయం అందాల్సిన వాళ్లకు మొండిచేయి… అసలు సాగు చేయని వాళ్లకు అప్పనంగా డబ్బూదస్కం… ఇదేమంటే కౌలుదార్లు ఏటా మారుతుంటారు, స్థిరయజమాని ఉండడు కదా అంటుంది ప్రభుత్వం… అదీ నిజం కాదు… రైతుస్వరాజ్యవేదిక సర్వేలో 43 శాతం మంది ఒకే భూమిలో మూడేళ్లకు పైబడి, 39 శాతం మంది ఐదేళ్లకు పైబడి, 18 శాతం మంది పదేళ్లకు పైబడి సాగుచేస్తున్నట్టు తేలింది… కౌలుదార్లకు ప్రభుత్వం ఎలాగూ చిల్లిగవ్వ ఇవ్వదు… కనీసం బ్యాంకుల నుంచి ఇప్పించేందుకు కూడా తోడ్పడదు…
విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి మాట్లాడుతూ ఓ మాటన్నాడు… ‘‘అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో ఉంటున్న ఎన్ఆర్ఐలకు కూడా ఈ ప్రభుత్వం రైతుబంధు డబ్బును వాళ్ల ఖాతాల్లో వేస్తోంది…’’ అన్నింటికీ మించి రెవిన్యూ వ్యవహారాల్లో విప్లవం పేరిట తీసుకొచ్చిన ధరణి ఘోరంగా విఫలమైంది… పంటల బీమా గురించి మాట్లాడేవారు లేరు… ఏదైనా పథకంలో తప్పొప్పులు ఎవరూ సూచిస్తే, వాటిని దిద్దుకుంటే ఆ పథకాలకు సార్థకత ఉంటుంది… కానీ తెలంగాణ ప్రభుత్వం ఎవరి మాటనూ వినదు కదా… అవి అలా లోపాలతోనే కొనసాగుతుంటాయి… ఢిల్లీలో వీటిని ఆహా ఓహో అని ప్రచారం చేసుకుంటాయి..!!
తెలంగాణలో ఆత్మహత్యలకు పాల్పడిన చాలామంది రైతుల కుటుంబాలకు పరిహారం ఇంకా పెండింగ్ ఉన్నట్టు రైతుస్వరాజవేదికే ఆమధ్య ఆరోపించింది… పోతేపోనీ, పంజాబ్ రైతులకు చెక్కులైతే ఇచ్చాం కదా… వాళ్లలో ఎవరు నిజంగా వ్యవసాయ కారణాలతో మరణించారు…? ఎవరూ లేరు… కానీ తెలంగాణలో వ్యవసాయ నష్టాలతో ఆత్మహత్యలు చేసుకున్నారు… **మన సూరు ఊరుస్తుంటే మంది గూన సదురబోయినట్టుగా…** మన రైతుల్ని వదిలేసి, పంజాబ్ వాళ్లకు డబ్బు ఇవ్వడం… రాజకీయమే పరమావధి…! అధికారమే అసలు లక్ష్యం..!! (మెయిన్ స్ట్రీమ్ తెలుగు మీడియా ఈ సర్వే వార్తకు మంచి కవరేజీ ఇచ్చింది…)
Share this Article