లగ్గపు లాడూలు
****
(మాఘమాసం కోసం.. మధురమైన జ్ఞాపకం)
1980-85 కాలపు సంగతి !
అవి నేను primary to upper primary
చదివే రోజులు…. ఆ కాలంల-
మా కరీంనగర్ చుట్టుపక్కల గ్రామసీమలల్ల
పెండ్లిపేరంటాలకు, ప్రభోజనాలకు ఊరందరికీ
శుభలేఖలు పంచెటొల్లు.
చెయిగలిసిన వారందరి ఇంటింటికీ,,
పొద్దుగాలనే శుభకార్యం జరుపుతున్నవారి
ఇంటిచాకలి వచ్చి ‘పిలుపు’అందించి పోయెవాడు.
పిలుపందుకున్నవారు(సహజంగా మగవారు)
ఉదయం పలారం, మధ్యాహ్నం భోజనానికి
విధిగా పొయ్యేటొల్లు…
ఎప్పుడెప్పుడా అని ఎదిరిచూసి ఎదిరిచూసి
తండ్రులవెంట జోజోటంగా పిల్లలమూ పోయేది.
కుడుమంటె పండుగని సంబురపడే ఎడ్డిమొకాలకు
లగ్గంల ‘లాడుముద్దలు’ పెడుతరంటె అదేమన్న
చిన్నబొన్న సంబురమా…!
పల్లకి ఎక్కినదానికంటె
చింతాకంత ఎక్కువనే ..!
Ads
మూడిండ్ల భవంతిల ఒక చంకకో,కచ్చీరింట్లనో,
పాలపొరుకతోటి కప్పిన ఇంటెనుక పందింట్లనో
గోనెపట్టాలు/చుట్టసాపలు పరిచి
ఎదురెదురుగ బంతికూచోబెట్టి
మోతుకాకుల ఎండు విస్తర్లువేసి
పలారంగా లాడూలు&అటుకులు పెట్టెటోల్లు.
పెద్దలకు రెండు లాడూలువెట్టి
పిల్లలకు మాత్రం ఒకటే పెట్టేది.
గంపెడాశతోటి ఎదురుచూస్తున్న
పిల్లలకు ఒక్కటి ఏమూలకైతది…?
అసలు లెక్కకైతె పిల్లలకు రెండువెట్టి,
పెద్దొల్లకు ఒకటి వెట్టినా సరిపోదా…???
పిల్లగండ్ల ఆరాటం పెద్దలకే తెల్సుగనుక,,
తండ్రులు ఒకలడ్డు తిని,
మరొకటి పిలగండ్లకు ఇచ్చెటొల్లు.
ఇగ మేమేమొ మా బాపు ఇచ్చింది తిని,
మా వంతుది లాగుజేబుల వేసుకొని
పానాపానంగ ఇంటికితెచ్చుకునెటొల్లం.
దయ్యానికి దొరుకకుంట దాసుకొని
మల్ల తెల్లారెప్పుడో తినెటొల్లం..!
ఆ వయసులో—
లడ్డూ ఖరీదు తెలియదుగానీ
దాని విలువెంతటిదో
మాకు మాత్రమే తెలుసు..!
మల్ల ఏదన్న పెండ్లిపత్రిక
వచ్చెదాక,,, పాతలడ్డు
ఒక సరికొత్త ఙ్ఞాపకం…!!
ఎనుకట గట్లుండెమరి !
ముట్టుకుంటె ముడుచుకపొయ్యే
ఆరుద్రపురుగు లెక్క
అప్పటి బాల్యం
ఎంత అపురూపం,అమూల్యం…!!
ఇప్పటిపిల్లలకు
సరైన బాల్యమెక్కడిది.. ?
ఆకలిగొన్న తిండెక్కడిది.. ?
అసలిప్పుడు, తిండికి విలువెక్కడిది..?
ఇగ ఈ కాలంలో– లడ్డూలంటరా
అదెంత మహత్కార్యం
కుక్కనుకొడితె రాలుతయి…!!
~\~
✍ డా.మట్టా సంపత్‌కుమార్ రెడ్డి
కరీంనగర్
Share this Article