మంచి చావు చచ్చిండు… ఈ వాక్యం విన్నారా ఎప్పుడైనా..? మిగతా ప్రాంతాల్లో ఏమో గానీ… ఎవరితో సేవలు చేయించుకోకుండా, కార్పొరేట్ డాక్టర్ల బారిన పడకుండా… సొంత ఇంట్లోనే, సొంత ఊళ్లోనే, హఠాత్తుగా కన్నుమూస్తే… తనకేమయ్యా మంచి మరణం పొందాడు, బంగారు చావు చచ్చిండు అంటరు తెలంగాణలో…! ఆ చావు తాలూకు శోకాలు కొద్దిసేపే… సాగనంపే (ఈ లోకం నుంచి) అంత్యక్రియల్ని కూడా ఘనంగా చేస్తారు…
పరామర్శకు వచ్చిపోయే బంధు, స్నేహితగణానికి కాసింత మందు పోస్తారు… కర్మ రోజున మటన్ పెడతరు… ఉన్నకాడికి ఘనంగా చేసి, మృతుడిని స్మరించుకుంటరు… మన సినిమాల్లో అనేకానేక ఉద్వేగాల సీన్లు ఉంటయ్ గానీ… పల్లెలో ఓ అంత్యక్రియల సీన్…? దానికి ఒక బ్యాక్ గ్రౌండ్ వైరాగ్యపు పాట..? (ఇదీ లింక్)… ఇది బలగం సినిమాలోనిది… బలగం అంటే బంధువులు, స్నేహితులున్న సర్కిల్…
ఈ బలగం సినిమాలో దర్శకుడు ఎల్దండి వేణు ఈ సీన్ పెట్టాడు… కాడె మీద పడుకోబెట్టడం, డప్పు కళాకారులు శవయాత్రలో ముందు డాన్సులు చేస్తూ కదలడం, అంత్యక్రియలు చేసేవాళ్లకు దండలు వేయడం, అన్నం కుండ… అచ్చంగా కుదిరాయి… ఆ గూనపెంకుల పల్లెలోనే షూట్ చేశారు కదా, ఆ పరిసరాలు, ఊరి వాతావరణానికి తోడు కాసర్ల శ్యాం రాసిన ‘చావు పాట’ కనెక్టింగుగా ఉంది… చావుపాట అంటే నెగెటివ్ కాదు, మరణించిన వాడి గురించి కాస్త మంచి చెప్పుకోవడం… ఈమధ్య శ్యాం పాటల్లో తెలంగాణ పదాలు మంచిగా పడుతున్నయ్…
Ads
ఈ ‘బలరామ నర్సయో‘ పాటలో కూడా కొంచబోతివో, అటెటు పోతున్నవే, సప్పుడు చేయిరా, సాగదోలుతమే, అగ్గిలోన తానం జేశి వంటివి ఈ పాటలో కూడా తెలంగాణతనాన్ని నిండుగ వినిపించినయ్… (అటెటు పోతున్నవే అనే పదాల దగ్గర ఆటేటు పోతున్నవే అని పాడటం కాస్త ఆడ్‌గా ఉంది…) కంటెంటు కూడా కదిలించేలా ఉంది… బాధంటూ లేని చోటు వెతుక్కుంటూ పోతివో… భూమ్మీద లేని హాయి చచ్చి అనుభవించయో… రాంగ రాంగ ఏమీ తేమురో పోంగ పోంగ కట్కపోమురో (వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాం, పోయేటప్పుడు ఏమీ తీసుకుపోం), తొమ్మిది తొర్రలురో (నవరంధ్రాలు), ఒల్లు ఉత్త తోలు తిత్తిరో… ఇలా…
ఎహె, అంత్యక్రియల సీన్‌కు కూడా ఇంత సీన్ ఉందా అనడక్కండి… చావు అశుభం, పెళ్లి శుభం… రెండింటినీ సమానంగా స్వీకరించడం తెలంగాణ సమాజపు విశేషం… చావులో సంబరం ఏముందనే భావన ఇక్కడ తప్పు… నన్ను సంబురంగా సాగదోలారు అని మృతుడి ఆత్మ ఆనందించడమే అందులోని ఉద్దేశం…
ఈమధ్య భీమ్స్ సిసిరాలో సంగీత దర్శకత్వాన్ని ఇరగేస్తున్నడు… ధమాకా పాటలు ఎంత దుమ్మురేపుతున్నయో చూస్తున్నం కదా… ఎక్కడ చూసినా అవే పాటలు, అవే స్టెప్పులు… ఈ బలగం పాట కంపోజ్ చేయడమే కాదు, తనే పాడాడు… పాట చిత్రీకరణలో నిజమైన డప్పుల్ని పెడితే ఇంకా నేచురాలిటీ, సహజమైన చప్పుడు వచ్చేదేమో అనిపించింది… ఈ చిన్న చిన్నవి వదిలేస్తే పాట బాగుంది… కాడె మీద జల్లుతున్న పేలాలు, పూలు, పైసల్లాగా…!!
Share this Article