పాన్ ఇండియా సినిమాకు, ప్రత్యేకించి హిందీ సినిమాకు సౌత్ పాటలు, సౌత్ మార్కెట్ కావాలి… లేకపోతే ఎవడూ దేకడం లేదు ఇప్పుడు…! అందులోనూ తెలుగు మార్కెట్ పెద్దది, రెండు రాష్ట్రాల్లో విస్తరించిన ప్రేక్షక సమూహాలు… అది కావాలి… ఆ డబ్బు కావాలి… అందుకే హిందీ సినిమాకు తెలుగు పాట కావాలి, తెలుగుదనం కావాలి… తెలుగు పాటకు తెలంగాణతనం కావాలి… తెలంగాణ జోష్ కావాలి… ఇదీ ఈక్వేషన్…
చిరంజీవి వంటి బడా హీరోలు సైతం హిందీ మార్కెట్ కోసం తమ సినిమాల్లో సల్మాన్ ఖాన్లను తోడు తెచ్చుకుంటుంటే… అదే సల్మాన్ ఖాన్ తెలంగాణతనాన్ని తోడుతెచ్చుకుంటున్నాడు… వెంకటేశ్‌ను సహ హీరోగా పెట్టుకుంటున్నాడు… రానానాయుడు సినిమా తాలూకు గబ్బును వదిలించుకోవడానికి వెంకటేశ్‌కు కూడా ఓ ఫ్యామిలీ పాత్ర కావాలి అర్జెంటుగా… అందుకే సల్మాన్ ఖాన్ కొత్త సినిమా Kisi Ka Bhai Kisi Ki Jaan లో వెంకటేశ్ ఉన్నాడు… తనకు ఓ చెల్లె ఉంది, ఆమే పూజా హెగ్డే… ఉండగానే సరిపోదు కదా, ఓ బతుకమ్మ పాట కూడా పెట్టేశారు…
సరే, పెడితే పెట్టారు, ఆనందమే… కానీ ఇప్పటికీ తెలంగాణ కల్చర్‌ను ఖూనీ చేసే మన తెలుగు సీరియళ్లలోలాగా, మన సినిమాల్లోలాగా ఈ సల్మాన్ ఖాన్ సినిమా కూడా అదే ధోరణి, అదే బాట… ఒరేయ్, వందల కోట్లు పెడుతున్నారు కదా ఖర్చు..? కాస్త తెలంగాణతనం తెలిసినవాళ్లను పెట్టుకోవచ్చుకదరా అనాలనిపిస్తుంది… అనాలి కూడా… ఎందుకంటే..?
Ads
బతుకమ్మ పాట పెట్టారు కదా… సదరు దర్శకుడు యూట్యూబులో బతుకమ్మ పండుగల స్పెషల్ ప్రత్యేక పాటల్ని బాగా చూసినట్టున్నాడు… మైండ్ పనిచేయడం లేనట్టుంది… అందుకే సదరు బతుకమ్మ పాట స్టార్ట్ కావడమే గొబ్బెమ్మలు, ముగ్గులతో మొదలవుతుంది… బతుకమ్మలకూ ఈ గొబ్బెమ్మలకూ లింకేమిట్రా నాయనా అని తలపట్టుకుంటామా..? పూజా హెగ్డే ప్రత్యక్షం…
అసలే రాధేశ్యామ్ సినిమా చూశాక పూజా హెగ్డేను చూస్తే కాస్త భయమేస్తోంది… ఓ పెద్ద కాగితపు బతుకమ్మను నడుమ బెట్టి, చిన్న చిన్న బతుకమ్మలను చుట్టూ పెట్టి ఇక డాన్సులు అందుకున్నారు… అన్నీ సినిమా మార్క్ స్టెప్పులే… పేరుకు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని వినిపిస్తుంటే కోలాటాలు, సినిమా స్టెప్పులు వేస్తుంటారు డాన్సర్లు… బతుకమ్మ ఆట అంటే పాట అంటే ఇదే అనుకుని దేశమంతా అనుకునేలా… బతుకమ్మను పూర్తిగా వక్రీకరిస్తూ…
తెలంగాణ వచ్చాక, బతుకమ్మ ఉత్సవాలు అధికారికం అయ్యాక తప్పనిసరై చాలా ఆఫీసుల్లో బతుకమ్మల్ని ఆడుతున్నారు… ఎవరికీ బతుకమ్మ ఆడటం రాదు, డీజే పెట్టి, ఏదో యూట్యూబ్ బతుకమ్మ సాంగ్ పెట్టేసి, చుట్టూ ఎగిరి మమ అనిపించేయడం జరుగుతోంది… మన బతుకమ్మకు ఇదేం ఖర్మరా బాబూ అని తలబాదుకుంటాం కదా… ఇదుగో ఇక హిందీ సినిమాలు కూడా ఖూనీపర్వాన్ని కొనసాగిస్తున్నయ్… నవ్వాలా, ఏడవాలా..?
ఇటు వెంకటేశుడు, అటు సల్మానుడు కూడా మాంచి మెరిసే శంకు మార్కు లుంగీలు ధరించి, పైన కండువా కూడా వేసుకుని, అచ్చం తమిళ తంబీల్లాగా ఈ పాటలో కనిపిస్తుంటారు… మనం రాజీపడాలి, ఇదే మన తెలంగాణ వేషధారణ అనుకుని…! సంక్రాంతి గొబ్బెమ్మలనూ, తంగేడు పూలనూ కలిపేసినట్టే… తమిళ సంస్కృతినీ లాక్కొచ్చి ఇందులో మిక్స్ చేసిపారేశారు… ఇంకా నయం… పనిలోపనిగా కేరళ ఓనం, తమిళ పుత్తాండు, తెలుగు-కన్నడ ఉగాదులను కూడా గుంజుకొచ్చి, ఇదే పాటలో కలిపేసి, పచ్చడి కూడా పూజా హెగ్డేతో కలిపించి, తాపించి, కనుమ పండుగ ఛాయల్ని కూడా కలబోస్తే మన సౌత్ పనైపోయేది…!! దక్షిణ కిచిడీ పాటగా రక్తికట్టేది…!!
Share this Article