యాన్ యాపిల్ ఏ డే… కీప్స్ అవర్ ఫోన్ డేటా అవే!
————————
ఫోన్ అంటూ ఉన్న తరువాత దానికి ట్యాపింగ్/ ట్రాకింగ్ కూడా ఉంటుంది. అది అధికారిక ట్యాపింగా, అనధికారిక ట్యాపింగా అన్నది వేరే విషయం. ఇటుకలు సిమెంటుతో కట్టిన గోడలకే వినే చెవులుంటే- చెవుల దగ్గరే వినపడే ఫోన్ సంభాషణలను వినే ట్యాపింగ్ చెవులు ఎందుకుండవు? ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చా? లేదా? అన్నది బ్రహ్మపదార్థం. ఎప్పుడో బ్రిటీషు వారు దేశం వదిలి వెళ్ళడానికి ముందు తయారు చేసిపెట్టిన టెలికాం యాక్ట్ మొన్నటివరకు దిక్కు. ఈమధ్య టెలికాం రెగ్యులేటరీ అథారిటీ -ట్రాయ్ ట్యాపింగ్ పై కొన్ని విధి విధానాలను రూపొందించింది.
మిలటరీ, పోలీసులు విస్తృతంగా ట్యాపింగ్ చేస్తూనే ఉంటారు. తీవ్రవాదులు, ఉగ్రవాదులు, సంఘ విద్రోహక శక్తుల ఫోన్ సంభాషణలను వినడానికి ట్యాపింగ్ కు అనుమతులు ఉంటాయి. ఫోన్ ట్యాపింగ్ కు ఒక రాష్ట్రంలో హోం శాఖ కార్యదర్శి స్థాయి అధికారి అధికారికంగా ఫోన్ సర్వీస్ ప్రొవైడర్ ను అడగాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను, ఎన్ఫోర్స్ మెంట్, సీబీఐ, ఎన్ఐఏ లాంటి శాఖలకు కూడా ఫోన్ ట్యాపింగ్ కు అనుమతులుంటాయి. అనధికారికంగా, రహస్యంగా ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఇజ్రాయిల్ లాంటి దేశాలు వినూత్నమయిన పరికరాలను ఆవిష్కరించి ప్రపంచ వ్యాప్తంగా అమ్ముకుంటున్నాయి.
ఎలాంటి సాంకేతిక విజ్ఞానం, పరికరాలు, ట్యాపింగ్ కు అనుమతులు అవసరమే లేకుండా యాపిల్, శాంసంగ్ లాంటి స్మార్ట్ ఫోన్ కంపెనీలు కొన్ని కోట్ల మంది ఫోన్ సంభాషణలను, ఫోన్లో ఏమేమి చూస్తున్నారు? ఫోన్ తో ఏమేమి చేస్తున్నారు? ఫోన్లో ఏమేమి డేటా భద్రపరుచుకుంటున్నారు? లాంటి సమస్త వివరాలను హాయిగా రికార్డు చేసుకుంటున్నాయి. పైకి తమ ఫోన్లను ఎలా వినియోగిస్తున్నారన్న బిహేవియర్ వివరాలను సేకరిస్తున్నామని ఫోన్ తయారీ కంపెనీలు చెబుతున్నా- వినియోగదారులకు నమ్మకం కుదరడం లేదు.
Ads
యూరోప్ లో నన్ ఆఫ్ యువర్ బిజినెస్- ఎన్ఓవైబి పేరిట యాపిల్ కంపెనీపై ఉద్యమాలు మొదలయ్యాయి. న్యాయ పోరాటాలు జరుగుతున్నాయి. యాపిల్ కార్యాలయాల ముందు నిరసనలు హోరెత్తుతున్నాయి. ఫోన్ వాడకం బిహేవియర్ ను మాత్రమే, అది కూడా ఫోన్ కొన్న వినియోగదారుడి అంగీకారంతోనే రికార్డు చేస్తున్నామని యాపిల్ కంపెనీ ఇచ్చిన వివరణతో ఎన్ఓవైబి ఉద్యమకారులు సంతృప్తి చెందడం లేదు. స్మార్ట్ ఫోన్ వాడుతున్న ఏ వినియోగదారుడి డేటా భద్రం కాదని వారు ఆధారాలతోసహా రుజువు చేస్తున్నారు.
అది యూరోప్ కాబట్టి ప్రతిదీ అంత సున్నితంగా ఉంటుంది. మన దేశంలో ఆ భయమే లేదు. అందరి ఫోన్లు, అన్ని వేళలా ఎవరో ఒకరు ట్యాపింగ్, రికార్డింగ్ చేస్తుంటారన్న స్పృహ, క్లారిటీ మనకు ఉంది. ఈ క్లారిటీ లేనివారికి ప్రభుత్వాలు ఆ అవగాహన కలిగిస్తుంటాయి. మన వాళ్లు బ్రీఫ్డ్ మీ…అన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి మాటలనే అడియో, వీడియో రికార్డు చేసిన ట్యాపింగ్, స్పై క్యామ్ టెక్నాలజీ మనది. ఇక మామూలు పౌరుల ఫోన్లు రికార్డు చేయడం ఓ లెక్కా?
ప్రభుత్వాలు చేసే ట్యాపింగులకే జనం దిక్కులు చూస్తుంటే- ఏకంగా ఫోన్లు తయారు చేసే కంపెనీలే ట్యాపింగ్, రికార్డింగులు చేస్తే ఇక జనాల సంభాషణలకు, ఫోన్లో దాచుకున్న సమస్త సమాచారానికి దిక్కెవరు? నట్టింట్లోకి నెట్టు వచ్చినప్పుడే రహస్యం అన్న మాటకు విలువ లేకుండా పోయింది. ఆ నెట్టు ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ద్వారా చేతిలోకి, ఒంట్లోకి వచ్చాక అంతా బహిరంగ రహస్యమే. ఫోన్ కంపెనీలు మన మెదడులో డేటాను కూడా తస్కరిస్తున్నాయేమో? ఏమో ?
యాన్ యాపిల్ ఏ డే
కీప్స్ అవర్ ఫోన్ డేటా అవే!
– పమిడికాల్వ మధుసూదన్
Share this Article