Nancharaiah Merugumala……. “కేసీఆర్ బిహారీ కుర్మీ, విజయనగరం మీదుగా తెలంగాణకొచ్చిన ఫ్యామిలీ ఆయనది, కేసీఆర్‌ది బిహార్ డీఎన్యే , బిహార్ డీఎన్యే కన్నా తెలంగాణ డీఎన్యే మేలైనది” రేవంత్‌రెడ్డి ఇంత అడ్డగోలుగా మాట్లాడినా కంట్రోలు చేయని ఇండియాటుడే రాహుల్ కవల్
………………………………………..
బుధవారం హైదరాబాద్‌లో ఇంగ్లిష్ న్యూజ్ చానల్ ఇండియా టుడే ‘తెలంగాణ రౌండ్‌టేబుల్’ పేరుతో నవంబర్ 30 అసెంబ్లీ ఎన్నికలపై నడిపిన చర్చాగోష్ఠిలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎ.రేవంత్ రెడ్డి నోటికి అడ్డూఅదుపూ లేకుండా మాట్లాడాడు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రసిద్ధ న్యూజ్ యాంకర్ లేదా బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్టు రాహుల్ కవల్ అతన్ని అదుపు చేసే ప్రయత్నమే చేయలేదు. రేవంత్ రెడ్డిది సంఘ్ పరివార్‌కు చెందిన ఏబీవీపీ నేపథ్యమని బీఆరెస్ వాళ్లు అంటున్నారని రాహుల్ కవల్ అనగానే, రేవంత్ రెచ్చిపోయారు.
Ads
‘‘నాది నూరు శాతం తెలంగాణ డీఎన్యే. పది తరాలుగా మావాళ్లు తెలంగాణలోనే ఉన్నారు. కేసీఆర్ బిహార్ కు చెందిన కుర్మీ కులస్తుడు. ఆయన కుటుంబం మొదట బిహార్ నుంచి ఆంధ్రలోని విజయనగరం వచ్చి, అక్కడి నుంచి తెలంగాణకు వచ్చి స్థిరపడింది. నిజాం నవాబు దగ్గర వాళ్లు పనిచేశారు. అందుకే కేసీఆర్‌ది బిహార్ డీఎన్యే,’ అనగానే ఇండియా టుడే మరో జర్నలిస్టు వెంటనే, ‘వెలమ కులం బిహార్ కుర్మీ ఎలా అవుతుంది?’ అని ప్రశ్నించారు. ‘యూపీ, బిహార్‌లోని కుర్మీలే ఇక్కడికొచ్చి వెలమలయ్యారు. వెలమలను అక్కడ కుర్మీలంటారు. అందుకే కీసీఆర్ ది బిహార్ డీఎన్యే. నాది తెలంగాణ డీఎన్యే. బిహార్ డీఎన్యే కంటే తెలంగాణ డీఎన్యే మేలైనది,’ అని రేవంత్ రెచ్చిపోతూ మాట్లాడారు.
ఈ దశలో కూడా ‘బిహార్ డీఎన్యే కంటే తెలంగాణ డీఎన్యే ఎలా మెరుగైనది అవుతుంది? కేసీఆర్ కులం వెలమ అని అందరికీ తెలసిన తర్వాత కూడా ఆయన బిహారీ కుర్మీ అని చెప్పడం సబబు కాదు, ఇది కులోన్మాదం కిందికి వస్తుంది,’ అని చెప్పే ధైర్యం చేయలేదు ఇండియా టుడే ప్రతినిధులు. ఫలానా నాయకుడు కాపు కాదు, రెడ్డి కాదు, వెలమ కాదు, కమ్మ కాదు అని మాట్లాడడం తెలుగునాట ఎలాంటి సభ్యత లేని రాజకీయ నాయకులకు అలవాటే.
కేసీఆర్ తెలంగాణ వెలమ కాదు, బిహారీ కుర్మీ అంటే జనం చేతి గుర్తు పార్టీని గెలిపిస్తరా?
……………………………………………………………………………………………..
గతంలో ‘వంగవీటి రంగా కాపే కాదు, టంగుటూరి అంజయ్య గారి తల్లిదండ్రులు రెడ్లేగాని ఆయన పెరిగిన ఇంటిని బట్టి ఆయన రెడ్డి కాదు, గౌడ,’ ఈ తరహాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అడ్డగోలుగా మాట్లాడిన నేతలు ఉన్నారు. మరి స్వాతంత్య్రం వచ్చాక.. అదీ 1969 నవంబర్ 8న పుట్టిన రేవంత్ రెడ్డి తెలంగాణ రౌండ్‌టేబుల్ కార్యక్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి, ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కులం గురించి, ఆయన డీఎన్యే గురించి అబద్ధాలు చెబుతూ కారుకూతలు కూస్తుంటే జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే ప్రతినిధులు అతన్ని అదుపు చేసే ప్రయత్నం చేయకపోవడం నిజంగా దారుణం.
ఇందిరాగాంధీ కొడుకులు రాజీవ్,సంజయ్ గాంధీలతో కలిసి (డెహరా) డూన్ స్కూల్లో చదువుకున్న పంజాబీ ఖత్రీ వ్యాపారి అరుణ్ పురీ యాజమాన్యంలోని ఇండియా టుడే–నేటి గ్లోబల్ సిటీ హైదరాబాద్ లో నిర్వహించిన బహిరంగ కార్యక్రమంలో కాబోయే ముఖ్యమంత్రి అని కలలుగంటున్న రేవంత్ రెడ్డి ఇంత చౌకబారుగా రెచ్చిపోవడం ఏమాత్రం బాగోలేదు. అతని వాగుడు జుగుప్స కలిగిస్తోంది.
‘కేసీఆర్ తెలుగోడు కాదు, ఆయన బిహారీ కుర్మీ,’ అని రేవంత్ ప్రచారం చేసినంత మాత్రాన బీఆరెస్‌ను జనం ఓడించరు. ప్రజలు బీఆరెస్ ను ఓడించే సందర్భం వస్తే దానికి వేరే కారణాలుంటాయి. రేవంత్ మాటలు వింటుంటే, ఐదేళ్ల క్రితం ఆయన మాజీ రాజకీయ గురువు నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ ముఖ్యమంత్రిగా ఉండగా చేసిన కొన్ని వ్యాఖ్యలు గుర్తుకొస్తున్నాయి. అప్పట్లో బిహార్ బ్రాహ్మణ మేధావి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పాండే తన ప్రత్యర్థిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ కోసం తన ఐపాక్ బృందంతో పనిచేయడం నచ్చని చంద్రబాబు గారు, ‘పీకే (ప్రశాంత్ కిశోర్) బిహారీ డకాయిట్. డకాయిట్ బుద్ధులు చూపిస్తున్నాడు,’ అంటూ బిహారీలను పరోక్షంగా తిట్టిపోశారు…
Share this Article