ఇట్లైంది విద్యా ఈ మధ్య! ఏసి రూముల్లో కూసొని ఎడ్యుకేషన్ పాలసీలు తయారు చేయవడితిరి! ఎక్స్పర్టల చేత ఎనలేని పాఠ్యాంశాలు రాయించవడితిరి!
టీచర్ పాఠం ఎలా బోధించాలో మీరే సెలవిప్పించవడితిరి! టీచర్ చెప్పాల్సిన పుస్తకాలన్నీ మీరే అచ్చువేయించి అందియ్యవడితిరి! అది ఎట్ల చెప్పాలో కూడ శిక్షణ మీద శిక్షణ మీరే ఇప్పించవడితిరి!
పిల్లలను ఎలా చదివించాలో, ఏం రాయించాలో కూడ మీరే ప్లానియ్యవడితిరి! సదువుడు, రాసుడు రావాలని కొత్త కొత్త ప్రోగ్రాంలు పెట్టవడితిరి!
Ads
మీరు అనుకున్నట్టు బోధన జరుగుతుందో లేదో పర్యవేక్షణలు గావించనేవడితిరి! ప్రశ్న పత్రాలన్నింటిని కూడ మీరే తయారు చేయించవడితిరి!
పరీక్షలన్నింటిని మహాప్రభో తమరే నిర్వహించవడితిరి! ఒక్కలు కూడా ఫెయిల్ కావద్దని ఆజ్ణలు జారి చేయవడితిరి!
వంద శాతం ఉత్తీర్ణత కావాలని ఉరిమి ఉరిమి చెప్పవడితిరి! సదువు చెప్పుడేమో కానీ సంబంధిత రికార్డులను గుట్టలకొద్ది రాయించవడితిరి!
మీరు హుఖూం జారి చేసినట్టె ఉపాధ్యాయుల చేత పని చేయించవడితిరి! మన వయసుడిగిన చాదస్తాన్ని పసిపిల్లల చదువులపై పటాతోపంగ రుద్దవడితిరి!
పిల్లలు కాకి దాహ కథను స్ట్రాతో ముగిస్తం అంటే లేదు గులకరాళ్ళతోనే ముగించాలనవడితిరి! ఆలోచనలన్నీ మీరే ఇస్తరు ఆచరణ మాత్రం టీచర్లతో చేయిస్తరు ఫలితం ఫేయిల్ వస్తే బాధ్యులు టీచర్లంటరు, మీరు మాత్రం మహానుభావులు మిన్నకుంటరు!
ఆటలంటే ఇష్టం ఉన్నోనికి హండ్రెడ్ మార్క్స్ ఎట్లొస్తయ్ సార్? పాటలంటే పాణం పెట్టెటోనికి పది జిపిఎ ఎట్లొస్తది సార్? కళలంటే కోసుకునెటోనికి కాస్తైనా కళాపోషణ లేని సదువు ఎట్లొస్తది సార్?
నిత్య జీవితానికి అవసరం అనిపించని విద్య నిత్యం చదివినా రావట్లేదు సార్! చిత్త శుద్ధి లేని విద్య చిత్తు కాగితాల్లోనే అమలౌతుంది! రీతి రివాయి లేని విద్య రికార్డుల్లోనే అమలౌతుంది! ఎక్స్పర్టులు ఏరి కోరి కాపీ పేస్టులు చేస్తున్న కరిక్యులంలోనే క్లారిటీ లేదు సార్!
విద్యా విధానమే విచిత్రంగ వినాశకరంగ తయారౌతుంటే,,, ప్రైవేట్ పరం చేయాలనే లక్ష్యం అంతర్లీనం అయి ఉంటుంటే,,, విద్యను వ్యాపార వస్తువుగ చూసే వాళ్ళే ప్రజలచేత ఎన్నుకోబడి పాలకులౌతుంటే,, చదువు కొనేవాళ్ళదే చదువౌతుంది కానీ చదువుకునే వాళ్ళకెక్కడిది సార్ చదువు!
చదువుకుని ఎదిగితే చదువు విలువ తెలుస్తది కానీ,,, చదువు కొని, ఓట్లూ కొని గద్దెనెక్కేటొల్లకు ఎక్కడ తెలుస్తది సార్?! సదువు సక్కగ రాని, సంస్కారం లేని, రాజనీతి తెలియని రాజకీయ నాయకులు నా జిల్లా ఫస్టంటె నా జిల్లా ఫస్టని పోటీ పడి మరీ కాపీలు కొట్టిస్తుంటే, వందశాతం రిజల్ట్ ఉత్సవాలు జరుపుతుంటే ఎందుకు సదువుతరు సార్ పోరలు ఎన్ని స్టడీ అవర్లు పెట్టినా…!?
పాఠాలు జెప్పనికి పంతుల్లను నియమించరు గానీ పాఠశాలలను పాకశాలలు జేసి తరాలను నిర్మించే తరగతి గదికి టీచర్లను దూరం జేయవడితిరి!
ఆల్లు పాఠాలు జెప్పుడా, లేక బియ్యం, కూరల పద్దులు రాసుడా!? టెక్నాలజి వాడితే పని తగ్గాలి కానీ పెరుగుతుందేది సార్? సాఫ్ట్ కాపీ, మల్ల హార్డ్ కాపీ అని అడిగిందే మల్ల మల్ల అడిగి అంగడి జేయవడితిరి!
ఆగం జేయవడితిరిగద సార్, అమాయక పిల్లల చదువును! నాశనం జేయవడితిరిగద సార్, నా బిడ్డల విద్యను! -అక్షర శరం
Share this Article