నిన్నలేని వికారమేదో నిదుర లేచెనే! అపురూపమయిన రూపం అన్న మాట నిజానికి పాక్షికమే కానీ- పరమ ప్రమాణం కాదు. అసలు విషయంలోకి వెళ్లే ముందు తెలుగులో వాడుకలో ఉన్న కొన్ని మాటలను ఒకసారి తలచుకుందాం.
అసలు రంగు బయట పడింది.
నిజరూపం తెలిసింది.
స్వస్వరూప జ్ఞానం.
ఎలుక తోలు తెచ్చి ఎంతగా ఉతికినా నలుపు నలుపేగానీ- తెలుపు కాదు.
పగలు చూస్తే రాత్రి కలలోకి వచ్చి భయపెడుతుంది.
మసిపూసి మారేడు కాయ చేసి.
కంటికి మించిన కాటుక.
ఇంకా చాలా సామెతలున్నాయి కానీ- ఎవరి మనోభావాలూ దెబ్బతీయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడికి వదిలేద్దాం.
Ads
———————–
అల్జీరియా దేశంలో ఒక ఆసామి పెళ్లి కోసం ఎన్నో కలలు కన్నాడు. కుదరక కుదరక ఒక సంబంధం కుదిరింది. మధురోహల్లో తేలిపోయాడు. కాబోయే భార్య చంద్రబింబంలా పదే పదే కలలోకి వచ్చి గిలిగింతలు పెట్టేది. అందని ఆ చంద్రవదన ఎప్పుడెప్పుడు అందుతుందా అని ఎదురు చూశాడు. పెళ్లి ముహూర్తం రానే వచ్చింది. కోటి సూర్యుల కాంతితో, వేయి చంద్రుల అందంతో వెలుగుతున్న చంద్రవదనను శాస్త్రీయంగా పెళ్లి చేసుకున్నాడు. రాత్రి గడిచింది. సూర్యుడు ఎప్పటిలా తూర్పునే పొడిచాడు.
మన ఆసామి బతుకు తెల్లారింది. కారు చీకట్లు కమ్ముకున్నాయి. అంతా శూన్యంగా తోచింది. ఇంతకూ ఏమి జరిగిందనేగా మీ అనుమానం?
భార్య పొద్దున్నే లేచి పళ్లు తోముకుని, మొహం కడుక్కుని మన ఆసామికి దర్శనమిచ్చింది- అంతే. నిన్న పెళ్లి మంటపంలో చంద్రుడు చిన్న బోయే అందంతో కనిపించిన భార్య ఇప్పుడు- బొగ్గు తలదించుకునే నలుపుతో వికారంగా కనిపించింది. నిన్న కనిపించిన అందమంతా అర అంగుళం మేకప్ మందం అని తెలిసి ఆసామి రంగుల కలలన్నీ కరిగిపోయాయి.
“నిన్నలేని వికారమేదో నిదుర లేచెనే…?”
అని వికారంగా పాటలు పాడుకుంటూ…మేకప్ తో మోసం చేసిన భార్య నుండి నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా ఒక కేసు వేశాడు. మన కరెన్సీలో హీన పక్షం పది లక్షల రూపాయలయినా ఇప్పించమని ప్రార్థిస్తున్నాడు.
ఏది నలుపు?
ఏది తెలుపు?
ఏది అందం?
ఏది మేకప్?
ఏది అసలు?
ఏది నకిలీ?
ఓ మహాత్మా!………………. By…… -పమిడికాల్వ మధుసూదన్
Share this Article