“నా కాఫీ కప్పులో షుగరు క్యూబు నువ్వే నువ్వే
నా కంటి రెప్పలో కాటుక ముగ్గు నువ్వే నువ్వే
నా చెంపలకంటిన చేమంతి సిగ్గు నువ్వే నువ్వే
నా ఊపిరి గాలిని పర్ఫ్యూమల్లె చుట్టేస్తావే
ఓ మై బేబీ నీ బుగ్గలు పిండాలి
ఓ మై బేబీ నీకు ముద్దులు పెట్టాలి
ఓ మై బేబీ నా చున్నీ నీకు టై కట్టాలి …”
కాలంతో పాటు భావకవిత్వం, గేయకవిత్వం మారాలి. మారింది. అయినా ఈ పాటలో ఏమి తక్కువయిందని సామాజిక మాధ్యమాల ట్రోలర్లు స్వయంప్రకటిత సరస్వతీ పుత్రుడి మీద పడ్డారు? ఈ పాటను ఆయన ఎంత ప్రేమించి రాశాడో ప్రతి ట్రోలరును పిలిచి కూర్చోబెట్టి వివరణ ఇవ్వాలా? ఆయ్ఁ … కావాలంటే శీతాకాలంలో పుచ్చకాయ సగానికి కోసి… రాంజో పాతపాటల జోలలో నిద్రపోండి!
రాంజో రచయిత ఎక్కడో అంతెత్తున ఉంటాడు. శ్రోతలు కింద ఎక్కడో పాతాళంలో ఉంటారు. ఇద్దరికీ పొత్తు కుదరడం లేదు. ఆయనే అన్నట్లు ఈ పాటలో ఏమి తక్కువ?
Ads
1 . కాఫీలో షుగర్ క్యూబ్ లు ఎక్కువ.
2 . కంట్లో కాటుక ముగ్గు ఎక్కువ.
3 . చెంపలకు అంటుకున్న చేమంతులు ఎక్కువ.
4 . ఊపిరి గాలిలో పెర్ఫ్యూమ్ ఎక్కువ.
5 . బుగ్గలు పిండుడు ఎక్కువ.
6 . పెట్టిన ముద్దులు ఎక్కువ.
7 . చున్నితో కట్టిన టై తాడు కూడా పెద్దదే. చాలా గట్టిదే.
ఆమధ్య హీరోయిన్ నడిచే వీధిలో హీరో పేడ కళ్లాపి చల్లి… కళ్లావి? కళ్లావి? అంటూ చించి… అతికించి… ఇరికించి… వదిలించి… జాడించి… గిలకొట్టి… గ్రైండర్లో రుబ్బి… రోకట్లో దంచి… చాటలో చెరిగి… బతుకుని చెడగొట్టి కుళ్లబొడిచి… అధోగతి పాలు చేసిన పాట మీద ఇలాగే తెలుగు భాషాభిమానులు బాధపడితే… ఆ రచయిత అనంత్ శ్రీరామ్ కూడా ఇలాగే లాఠీ తీసుకుని ఒక్కొక్కడి వీపు వాయించడానికి ఊరి మీద పడ్డాడు. జనం గట్టిగా తిరగబడేసరికి భాషలో, సంగీతశాస్త్రంలో లేని కొత్త కొత్త సిద్ధాంతాలను చెప్పి… చివరికి తనేమి చెబుతున్నాడో తనకే అర్థం కాక అయోమయం కప్పుకుని కామ్ అయ్యాడు.
తెలుగు సాహితీ వీధుల్లో ఒక సరస్వతీపుత్రుడు యాభై ఏళ్లుగా అత్యంత ప్రచారంలో ఉంటే… ఈయన కొత్తగా సరస్వతీపుత్రుడు ఎప్పుడు ఎలా అయ్యాడు? అని ఎవరో రాయలసీమ సాహిత్య బృందం వారు సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నించినప్పుడు కూడా రాంజో ఇలాగే బిరుసుగా నేనింతే… మా అమ్మపేరు సరస్వతి, నేను సరస్వతీపుత్రుడిని… మీకు ఇష్టం లేకపోతే నాదారిలోకి రాకండి! అని సమాధానమిచ్చాడు. సరస్వతి పేరుతో ఉన్న తల్లుల కొడుకులందరూ ఇలాగే “సరస్వతీపుత్ర” బిరుదు తగిలించుకోవచ్చా? అని అడిగి రాంజో విజ్ఞతకే వదిలేసింది లోకం.
ఏయ్.. ఎవర్రా అది ట్రోల్ చేసేది… హన్నా! రేప్పొద్దున పుసుక్కున ఆస్కార్ వస్తే… మళ్లీ మీరే ప్రతిపదార్థ తాత్పర్యాలు, పేజీలకు పేజీలు వ్యాఖ్యానాలు రాసి… ఆహా! ఓహో! అనాల్సి వస్తుంది! జాగ్రత్త!!… హమ్మా… ఏమో! రాజమౌళి కొడుకు కార్తికేయ లాంటి కత్తిలాంటి డిజిటల్ మార్కెటింగ్ కుర్రాడు తగిలితే… ఆస్కార్ పైరవీ క్లిక్కయితే… ఇప్పుడు అన్ని వేదికలకూ ఆ అవార్డు పట్టుకుని తిరుగుతున్న చంద్రబోస్ లాగా ఈ సరస్వతీ పుత్ర కూడా తిరుగుతాడేమో!
ఫాఫం… రెండుమూడు ట్వీట్లకే అలిసిపోయి… ట్రోలింగ్ తీవ్రత సునామీగా మారడంతో ఇక వివరణలు, స్పష్టీకరణలు అన్నీ ఆపేసి ఓవరాల్ మొత్తంగా తన ట్విట్టర్‌కే షట్‌డౌన్ ప్రకటించాడు… అబ్బే, పరిస్థితులెంత ట్రోలుతున్నా సరే తెలుగు సినిమా కవి అనేవాడు కలంకూతలు ఆపవద్దు సార్… తమన్ చూడండి, కాపీ మాస్టర్ అని ఆధారాలతో సహా లక్షల పోస్టులు దాడిచేసినా సరే, ఉలిక్కిపడ్డాడా..? మరింత ఉత్సాహంగా కాపీ కళకు ప్రాణం పోస్తున్నాడా లేదా..? ఈ గుంటూరు కారానికీ ఆయన సంగీతమే కదా… నారాజ్ అయ్యాడా, లేదు కదా…
లాయర్ నోటీసులు పంపినా సరే మంచు వారిని వదిలారా ట్రోలర్లు… అనసూయాంటీ, హేమాంటీలను వదిలారా, లేదే… అసలు వర్మ అంటే ట్రోలర్లకే బెదురు, తెలుసా మీకు… ట్రోలింగ్ అనగా జనాభిప్రాయం… సోషల్ మీడియాలో ఉండటం అంటేనే… మూసీ నది నడుమ కుర్చీ వేసుకుని కూర్చున్నట్టు… వాసనొస్తుంది, కంపు, యాక్ అంటే కుదరదు… అబ్బే… మీ సాహిత్య సృష్టి గొప్పదనం జనానికి అర్థం కాకపోతే… పోతే పోనివ్వండి… పోయిందేముంది..? అరిచీ అరిచీ వాళ్లే పోతారు, అంతేగానీ మనమే పోతామంటే ఎలా సార్..?
అసలు తెలుగు సినిమా పాట అంటే ఏమిటి..? అప్పట్లో ఎన్ని కళాఖండాలు వచ్చేవి… ఎవరెన్ని తిట్టినా ఆ పాత కవులు పట్టించుకున్నారా..? మీరు ఆ కళకు ప్రాణం పోస్తున్నారు… మీరూ పట్టించుకోవద్దు… మచ్చుకు మూడునాలుగు చెప్పాలంటారు అంతేగా… నీ యమ్మ నా అత్తో… గుద్దుతా నీయవ్వ గుద్దుతా… చల్లగా లేస్తోంది… గుగ్గూ గుడిసుంది, మమ్మా మంచముంది… అబ్బో, బోలెడు… అందువల్ల కనుక వెంటనే మీ ట్విట్టర్ రాజీనామాను వెనక్కి తీసుకోవాలని మేం డిమాండ్ చేస్తున్నాం… పాటలో పంచ్ లేకపోతే మనదా తప్పు..? ఆ పంచె బిగించి కట్టని తమన్ తప్పు… అంతేగానీ మన కలంకూతలు ఆపొద్దు, ఆగొద్దు… కమాన్ రాంజో… గుంటూరుకారం ఘాటు లేకపోతేనేం… మనం ఈసారి కడప గొడ్డుకారం రాద్దాం… కమాన్…
Share this Article