సెలెబ్రిటీ అభిమానుల సోషల్ వార్!
——————–
“I may disapprove of what you say, but I will defend to the death your right to say it”
“నాకు నీ అభిప్రాయం నచ్చినా, నచ్చకున్నా- ఆ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పుకునే నీ హక్కును కాపాడ్డానికి మాత్రం చివరిదాకా ప్రయత్నిస్తాను” ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రచారంలో ఉన్న భావప్రకటన ఆదర్శం ఇది. ఆదర్శాలెప్పుడూ అందనంత ఎత్తులో ఆకాశంలో ఉంటాయి. ఆచరణ సహజంగా పాతాళం అంచుల్లో ఉంటుంది. సినిమా తారలు, క్రీడాకారులు, అత్యంత ధనవంతులు, వివిధ రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ పేరు ప్రతిష్ఠలు సంపాదించినవారంతా సెలెబ్రిటీలు. వీరి చదువు సంధ్యలు, విషయ పరిజ్ఞానం, అవగాహనలతో ప్రపంచానికి పని లేదు. వారు ఏ సోపు కొనమంటే మనం అదే కొంటాం. వారు ఏ బట్టలు వేసుకోమంటే అవే వేసుకుంటాం. వారు ఏవి తినమంటే అవే తింటాం. వారు కూర్చోమంటే కూర్చుంటాం. లేవమంటే లేస్తాం. మనకంటూ సొంతంగా మెదడు ఉండదు కాబట్టి, ఉన్నా దానికి ఆలోచించే శక్తి ఉండి చావదు కాబట్టి- మన మెదడు ఏమి ఆలోచించాలో…ఏమి చించకూడదో అన్న యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని మనకు ఉచితంగా ప్రసాదించే పవిత్ర కర్తవ్యాన్ని సెలెబ్రిటీలు తమ భుజస్కంధాల మీద ఎవరూ అడగకపోయినా తమకు తామే వేసుకున్నారు.
Ads
ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు ఉంటాయి. ఒక ఉత్తరాది సినిమా తార హైదరాబాద్ బ్రాండ్ బట్టలకు ప్రకటనల్లో పెళ్లి కూతురిలా సిగ్గుల మొగ్గలు ముగ్గులు వేస్తుండగా ఫోజులిచ్చింది. పేపర్లలో, హోర్డింగుల్లో, థియేటర్లలో ఎక్కడ చూసినా ఆ ప్రకటనలే. సరిగ్గా అదే సమయానికి ఆమె భర్తతో విడాకుల కేసు గొడవల వార్తలు అవే పత్రికల్లో లోపలి పేజీల్లో వస్తూ ఉండేవి. తన పెళ్లే పెటాకులు చేసుకుని కోర్టుల్లో జుట్లు పీక్కునే తార- ప్రపంచాన్ని పెళ్లి పీటల మీద కూర్చోబెట్టే ప్రకటనల్లో ఎలా నటిస్తుందన్నది అర్థరహితమయిన ప్రశ్న. “నటన” అన్న మాటలోనే అర్థ పరమార్థాలు దాగి ఉంటాయి. భారతీయ సనాతన ధర్మాన్ని వస్త్రంగా ధరించి తిరుగుతున్నట్లు చెప్పుకునే సెలెబ్రిటీ అనివార్యంగా, చట్టబద్ధంగా, చుట్టబద్ధంగా రెండు మూడు విడాకులు తీసుకుని ఉండవచ్చు. అంతమాత్రం చేత ఆ సెలెబ్రిటీ ఆదర్శాలను కూర్చోబెట్టుకుని ప్రవచనాలు చెప్పకూడదని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. అలా ఉండాలనుకోవడం కలియుగ ధర్మం కాబోదు.
——————-
తాజాగా రైతు ఉద్యమాల నేపథ్యంలో సెలెబ్రిటీలు రెండుగా చీలిపోయారు. కేంద్ర ప్రభుత్వానిది తప్పు అని రైతులకు మద్దతు తెలిపేవారు ఒక వర్గం. రైతులదే తప్పు- కేంద్రానిది కరెక్ట్ అని మరో వర్గం. మధ్యలో ఎటూ అభిప్రాయం చెప్పనివారు మూడో వర్గం. ఏ వర్గంలో ఎవరెవరు ఉన్నారు? ఎవరి వాదన ఎంత సబబు? అన్న చర్చ ఇక్కడ అనవసరం. ఈ సెలెబ్రిటీల అభిప్రాయాల వల్ల వారి అభిమానులు కూడా నిలువునా రెండు గ్రూపులుగా చీలి, సోషల్ మీడియాలో పరస్పరం తిట్టుకుంటూ ఉండడమే ప్రస్తుత సమస్య. సెలెబ్రిటీలు మనకు ఎంగిలి మెతుకు విదల్చరు. వారి మనుగడలో మన చెమట చుక్కలే తార చుక్కలుగా వెలుగుతుంటాయి. తినీ తినక మనల్ను పెంచి పోషించిన మన అమ్మా నాన్నల ముందు సెలెబ్రిటీలు గడ్డిపోచల కంటే తక్కువ. మనకు బతుకు పాఠాలు చెప్పి మనుషులుగా నిలబెట్టిన మన టీచర్లకంటే చాలా తక్కువ. మన ఉన్నతికి కారణమయిన ఎందరో అజ్ఞాత వ్యక్తులకంటే చాలా చాలా తక్కువ.
అభిమానం ఉండవచ్చు. అది దుర్మార్గమయిన దురభిమానంగా మారితే- సెలెబ్రెటీలకు పండగ. మనకు దండగ. సోషల్ మీడియా షేర్లు, లైకులు, కామెంట్లే సర్వస్వమయిన కాలంలో- అందరూ సోషల్ వార్ లో సైనికులే. అందరూ బలిపశువులే. పరస్పరం కత్తులు దూసుకున్న సెలెబ్రిటీలు రాత్రికి చీర్స్ చెప్పుకుని పొద్దున్నే పరస్పర అంగీకారంతో రహస్యంగా వ్యాపారం ప్రారంభించవచ్చు. ఇంకా నచ్చితే బహిరంగంగా బంధుత్వం కలుపుకోవచ్చు. అప్పుడు అభిమానులు బట్టలు చించుకోవచ్చు. ఇంకా కావాలనుకుంటే ఒళ్లు కోసుకుని సెలెబ్రెటీలకు రక్తాభిషేకాలు చేయవచ్చు. అభిమానిస్తే పోయేదేముంది? జేబులో డబ్బులు; ఒంట్లో రక్తం తప్ప….. By…. -పమిడికాల్వ మధుసూదన్
Share this Article