మెచ్చుకోవాలి… ఆ ఇద్దరూ ప్రదర్శించిన పరిణతి బాగుంది… ఎంతసేపూ బూతులు, వ్యక్తిగత దూషణలతో, కక్ష ప్రదర్శనతో మకిలి పట్టిన మన రాజకీయాల్లో కింద వరకూ ఆ పరిణతి ఇంకాలి… అందుకే వాళ్లిద్దరినీ మెచ్చుకోవాలి… చప్పట్లు కొట్టాలి… ఎంతసేపూ విద్వేషాన్ని, విషాన్ని వ్యాప్తి చేసే వార్తలేనా..? అసలు ఇవి కదా ప్రయారిటీ దక్కాల్సిన వార్తలు… విషయం ఏమిటంటే..? రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ ఈ వారాంతంలో రిటైర్ అవుతున్నాడు… ఈ సందర్భంగా వీడ్కోలు చెబుతున్నప్పుడు ప్రధాని మోడీ, ధన్యవాదాలు చెబుతూ ఆజాద్ కన్నీటిపర్యంతం అయ్యారు… రాజకీయ విభేదాలు ఒక దశ వరకే… అది దాటి నాయకులు వ్యక్తిగత గౌరవపూర్వక సంబంధాల్ని ఎలా కొనసాగించవచ్చో వాళ్ల ప్రసంగాలు చెబుతున్నయ్… అంతేకాదు, ఆజాద్ తనను ఓ రియల్ ఇండియన్ ముస్లింగా ప్రదర్శించుకున్న తీరు కూడా ఆసక్తికరంగా ఉంది…
ప్రధాని మోడీ మాట్లాడుతూ ఒక సంఘటనను గుర్తుచేసుకున్నాడు… ‘‘నేను సీఎం కాకముందే ఆజాద్ నాకు పరిచయం, తను సీఎం అయ్యాక ఓసారి గుజరాత్ పర్యాటకులపై ఉగ్రదాడి జరిగింది… తనే ఫోన్ చేసి చెప్పాడు, తన సొంత మనుషులే చిక్కుల్లో పడ్డట్టుగా మాట్లాడాడు, తను చూపిన కన్సర్న్ నేను మరిచిపోలేకపోయాను… ఈ అధికారం, ఈ పదవులు వస్తుంటయ్, పోతుంటయ్… కానీ..?’’ అంటూ సెల్యూట్ చేశాడు… నిజమైన స్నేహితుడిని నేనెందుకు దూరం చేసుకుంటాను, నా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటయ్, నీ అనుభవం, నీ సలహాలు మాకు అవసరం’’ అని ఉద్వేగంగా ప్రసంగించాడు… విపక్షంలోని ఒక నాయకుడిని గానీ, స్వపక్ష నాయకుడిని గానీ మోడీ ఇంతగా తలుచుకుని ఉద్వేగానికి గురికావడం తొలిసారి…
Ads
ఆజాద్ కూడా ప్రతిస్పందించిన తీరు అలాగే ఉంది… ‘‘ఆరోజు నాకిప్పటికీ గుర్తు… నేను సీఎం అయ్యాక రెండుమూడు రోజులకే ఆ ఉగ్రదాడి జరిగింది… చనిపోయిన తమ వాళ్లను తలుచుకుని ఏడుస్తూ పిల్లలు ఎయిర్పోర్టులో నా కాళ్లను చుట్టేసినప్పుడు నా కళ్లల్లో నీళ్లొచ్చాయి… బాధను తమాయించుకోలేకపోయాను… ఇక్కడికి పర్యటనకు వచ్చి, శవాలతో, కన్నీళ్లతో తిరిగి వెళ్తున్న వాళ్లకు నేనేం జవాబు ఇవ్వగలను..? పండుగల వేళ నేను ఇద్దరి నుంచి ఖచ్చితంగా శుభాకాంక్షలు అందుకుంటాను… ఒకటి సోనియా, రెండు మోడీ… సభలో గంటల తరబడీ వాదనలుంటయ్, విభేదించుకుంటాం, కానీ మోడీ ఎప్పుడూ మా విమర్శల్ని వ్యక్తిగతంగా తీసుకోలేదు… అవి మా సంబంధాల్ని దెబ్బతీయలేదు… సభలో ఎలా వ్యవహరించాలనేది నేను నిజానికి దివంగత వాజపేయిని చూస్తూ నేర్చుకున్నాను…’’ ఇదీ ఆజాద్ రిప్లయ్… ‘‘నేను పాకిస్థాన్ ఎప్పుడూ వెళ్లలేదు… అదృష్టవంతుడిని… అక్కడి పరిస్థితులు నాకు తెలుసు, అవి విన్నప్పుడల్లా హిందుస్థానీ ముస్లింగా గర్విస్తాను… అనేక ముస్లిం దేశాలలో… హిందువులు, ఇసాయిలు, సిక్కులు లేని చోట్ల కూడా వాళ్లలో వాళ్ళు కొట్టుకుని చచ్చిపోతున్న ముస్లింలని చూశాక చెప్తున్నా… హిందూస్థాని ముస్లింలు తలెత్తుకుని చెప్పాలి, మేము హిందూస్థాని ముస్లిములం అని.. ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నా ఇతర ముస్లిం దేశాలలో ఉండే జాడ్యం నా దేశ ముస్లింలకు ఎప్పటికీ రాకూడదు అని…”’’ అనే ఆజాద్ వ్యాఖ్యలు పాకిస్థాన్ అంటే ఓ భూతలస్వర్గంగా భ్రమపడే వాళ్లు మరోసారి చదవాలి… కాశ్మీర్ నాయకులకన్నా మిగతావాళ్లకు పాకిస్థాన్ పరిస్థితులేమిటో ఏం తెలుసు..? నిండు సభలో ‘నేను రియల్ హిందూస్థానీ ముస్లింను, దానికి గర్వపడుతున్నాను’ అని తలెత్తి ప్రకటించిన తీరు అభినందనీయం..!
Share this Article