వారసత్వం, బ్యాక్ గ్రౌండ్ అనేది ఎంట్రీకి, పరిచయానికే, తరువాత ఎవరైనా సరే తమ ప్రతిభను నిరూపించుకుంటేనే నిలబడతారు…… అని తమ వారసుల్ని తెలుగు తెర మీద రుద్దే ప్రతివాళ్లూ చెబుతారు… వాళ్ల భక్తులూ చెబుతారు… పాక్షిక సత్యమే ఇది… బ్యాక్ గ్రౌండ్ పదే పదే నిలబెట్టడానికి ప్రయత్నిస్తుంది… ఆ సౌలభ్యం వేరేవాళ్లకు ఎందుకు ఉంటుంది..? అక్కినేని నాగసుమంత్… సారీ, అక్కినేని కుటుంబం నుంచే వచ్చిన యార్లగడ్డ సుమంత్ సంగతే తీసుకుందాం… అక్కినేని వారసత్వం, ఒక స్టూడియోలో భాగస్వామ్యం… 1999లో మొదలుపెడతే ఇప్పటికి సగటు ఏడాదికి ఒక సినిమా కూడా లెక్కతేలదు… 22 ఏళ్లు అనేది ఇండస్ట్రీలో మామూలు విషయం కాదు… ఇదీ నా సినిమా అని గొప్పగా చెప్పగలిగే ఒక్క సినిమా లేకుండా… ఇన్నేళ్లు ఇండస్ట్రీలో నిలబడటం, ఇప్పటికీ హీరోగా అవకాశాలు రావడం సాధారణ విషయం కాదు…
ఇన్నేళ్లయినా పట్టువదలని ఆ విక్రమార్కతత్వానికి అభినందించాలో, ఇక చాల్లేవోయ్ అని సానుభూతిగా ఓ సూచన చేయాలో అర్థం కాదు సుమంత్‌ను చూస్తే… కమ్ముల శేఖర్ తీసిన గోదావరి సినిమా ఒక్కటే తన కెరీర్ మొత్తంలో పర్లేదు అనిపించే సినిమా… ఆ క్రెడిట్ కూడా దర్శకుడు శేఖర్, హీరోయిన్ కమలిని ముఖర్జీ ఖాతాలోకే వెళ్తుంది… పైగా అది అంత సూపర్ హిట్టేమీ కాదు… సత్యం, గౌరి సోసో… నిజంగా ఈ స్థితిలో ఏ వారసత్వం, ఏ బ్యాక్ గ్రౌండ్ లేని హీరో అయితే ఎలా ఉండేది..? ఇన్నేళ్లుగా పరీక్షలు రాసే చాన్స్ దొరికేదా..? ఇంపాజిబుల్… అందుకే బ్యాక్ గ్రౌండ్ అనేది ఎంట్రీకి మాత్రమే కాదు… నిలబెట్టడానికి పదే పదే అవకాశాల్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది… గతంలో కూడా వడ్డే నవీన్ కూడా ఇంతే… ఆర్యన్ రాజేష్ కూడా అంతే… ఇంకా ఒకరిద్దరు ఉండవచ్చు… కానీ ఎట్ లాస్ట్ వాళ్లు తప్పుకున్నారు… కానీ సుమంత్ మొక్కవోని ఆశావాది… వైఫల్యాల బాటలోనూ ఆశల్ని బతికించుకుంటూ సాగిపోతూ ఉంటాడు… ఇప్పుడు అనగనగా ఓ రౌడీ అనే ఓ సినిమా రాబోతోంది తను హీరోగా… ఏక్‌దోతీన్ ప్రొడక్షన్స్ ఓ కొత్త దర్శకుడితో తీస్తోంది సినిమా… వాల్తేరు శీను తన పాత్ర పేరు… కాస్త డిఫరెంటు లుక్కు కనిపిస్తోంది… ఇక ఇదే చివరి పరీక్ష వంటి అపశకునాలు పలక్కండి… ఆల్రెడీ కపటధారి అనే సినిమా నిర్మాణంలో ఉంది… ఇవిగాకపోతే మరొకటి… ఆఫ్టరాల్ ఇంకా తన వయస్సు 46 మాత్రమే కదా… ఇంకా పొలం లేదా..? పొద్దు లేదా..? బ్యాక్ గ్రౌండ్ లేదా..?!
Ads
Share this Article