………. ఎడిటర్ అనగానే మనలో చాలామందికి వాళ్లు జ్ఞానులు అనే భ్రమ ఉంది… ఎడిటర్ అంటే తెలుగులో సంపాదకుడు… నిజమే… వాళ్లలో అధికులు ప్రస్తుతం కేవలం సంపాదకులు మాత్రమే… వర్తమాన సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంకేతిక వ్యవహారాలపై చాలామంది సంపాదకుల జ్ఞానం సున్నాలు… వితండవాదాల్లో మిన్నలు… అందరూ కాదులెండి.,. కానీ చాలామంది… అసలు అప్డేట్ కారు… ఎడిటర్స్ గిల్డ్ అని ఓ పే-ద్ద సంఘం ఉంది… ఆర్నబ్ గోస్వామి అప్పట్లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ప్రకారం… ఆ గిల్డ్‌లో కొందరు అసలు సంపాదకులే కాదు ఇప్పుడు… మాజీలు… కొందరు కేవలం చిన్న చిన్న సొంత బ్లాగులకు సంపాదకులు ప్రస్తుతం…
అందులోనూ బొచ్చెడు రాజకీయాలు… అక్షరమ్ముక్క రాయలేని వాళ్లు కూడా ఉంటారట… ఢిల్లీలో పలుకుబడి కలిగి ఉంటే చాలునట… సరే, దానిపై తనేమన్నాడో వదిలేద్దాం… తనే ఇవన్నీ చూసి గిల్డ్‌కు రాజీనామా చేసి, బయటికొచ్చేసి, బ్రాడ్‌కాస్టర్ ఫెడరేషన్ పేరిట వేరే దుకాణం ఓపెన్ చేశాడు… సరే, ఇవన్నీ ఎందుకు చర్చల్లోకి వస్తున్నాయంటే… ఒకావిడ… ఎడిటరమ్మ… గిల్డ్‌కు రాజీనామా చేసిపారేసింది… అదేమిటీ, ఆమెకు అంత కోపం ఎందుకు వచ్చింది అంటారా..?
Ads
ఈమె పేరు పత్రీసియా ముఖిమ్… పద్మశ్రీ పురస్కార గ్రహీత… ది షిల్లాంగ్ టైమ్స్‌కు ఎడిటర్… మొన్నటి జూలైలో, మేఘాలయలో ఓ సంఘటన గురించి ఆమె ఫేస్బుక్లో ఓ పోస్టు పెట్టింది… ఒక ట్రైబల్ డామినేటెడ్ ఏరియాలో ఆడుకుంటుంటే నాన్-ట్రైబల్స్‌పై ఐరన్ రాడ్లతో దాడి చేశారు… అక్కడి సామాజిక పెద్దల కమిటీ (Dorbar Shnong)ని ప్రశ్నిస్తూ… ఈ పోస్టుకు ముఖ్యమంత్రి సంగ్మాను కూడా ట్యాగ్ చేసింది… దీని మీద ఆ కమిటీ నిర్ణయం మేరకు కేసు నమోదైంది… సామాజిక అశాంతి రేపటానికి ప్రయత్నిస్తున్నదనేది ఆరోపణ…
హైకోర్టు కూడా ఆమెను తప్పుపట్టింది… ఆ కేసు కొట్టేయాలని ఆమె పెట్టుకున్న పిటిషన్‌ను మేఘాలయ కోర్టు కొట్టేసింది… ఈమె ఏం చేసిందంటే… సదరు కోర్టు ఆర్డర్ కాపీని ఎడిటర్స్ గిల్డ్‌కు పంపించి, తనకు అండగా నిలవాలని కోరింది… అది కోర్టు ఆదేశం… అది కరెక్టు కాదని భావిస్తే ఆమె ఇంకా పైకోర్టుకు వెళ్లాలి… అంతేతప్ప దీన్ని పాత్రికేయం మీద దాడిగానో, భావప్రకటన స్వేచ్ఛకు ప్రతిబంధకమనో భావించలేం కదా… ఎడిటర్‌ను కదా, నా ఇష్టం వచ్చినట్టు రాసుకుంటాను అంటే కుదరదు కదా…
కానీ గిల్డ్ సభ్యురాలిని, నాకు ఇబ్బంది వస్తే అండగా ఉండరా..? అని బాగా కోపమొచ్చేసింది… వెంటనే రాజీనామా చేసేసింది… ఇదేమిటమ్మా అంటే… ‘‘ఇదో డొల్ల గిల్డ్… వీళ్లకు ఎంతసేపూ సెలబ్రిటీ ఎడిటర్లు, యాంకర్లు మాత్రమే కావాలి… నాలాంటి ఎడిటర్లకు వీళ్లు చేసే సాయం ఏమీ ఉండదు… అంతెందుకు, ఆ ఆర్నబ్ గోస్వామి అసలు గిల్డ్ సభ్యుడే కాదు కదా, పైగా ఈ గిల్డ్‌కు వ్యతిరేకి కదా… తనపై మహారాష్ట్ర పోలీసులు వేధింపులకు దిగితే… అరెస్టు చేస్తే, ఇదే గిల్డ్ తనకు మద్దతుగా లేఖ రాసింది… మరి నా విషయంలో ఎందుకు స్పందించలేదు..?’’ అంటోంది…
అసలు సెలబ్రిటీ ఎడిటర్లు అనగా ఎవరు..? అసలు ఎడిటర్ అర్హతలు ఏమిటి..? ఓ చిన్న యూట్యూబ్ చానెల్ ఎడిటర్‌కు కూడా సభ్యత్వం ఇస్తారా అడిగితే..? గిల్డ్ సభ్యుడు కావడానికి అర్హులు ఎవరు..? నిజానికి అందులో ఎడిటర్లుగా పనిచేయనివాళ్లు, గతంలో పనిచేసినవాళ్లు ఎవరెవరు..? మాజీలకు సభ్యత్వం వెంటనే ఊడిపోవాలా..? ఎన్నేళ్లయినా కొనసాగుతుందా..? అసలు పాత్రికేయంలో అక్షరమ్ముక్క రానివాళ్లు ఎందరు..? ఇన్ని ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి ఈ పద్మశ్రీ జర్నలిస్టు రాజీనామా చర్యతో…
ఈమె చెప్పినట్టు యాంకర్లు, డిబేట్ హోస్టులను కూడా ఎడిటర్లు, జర్నలిస్టులు అనవచ్చా..? ఇది మరో సంక్లిష్టమైన ప్రశ్న… మీకేమైనా ఐడియా ఉందా..? రియల్ ఎడిటర్లు అనగా ఎవరు..? జస్ట్, షో ఎడిటర్లు అనగా ఎవరు..? మరీ తెలుగులోకి వచ్చేసి.., ఎడిటర్లు- అర్హతలు- నైతికతలు అనే అంశం మీద చర్చ గనుక పెడితే… అది ఒడవదు, తెగదు… సో, ఇక్కడే దీన్ని ముగించేద్దాం…
తాజా వార్త :: ఆమెకు ఐజెయు మద్దతు ప్రకటించింది… గిల్డ్ అండగా నిలవాలని కోరింది… రాజ్ దీప్ సర్దేశాయ్ కూడా సేమ్ ఆమె వాదనతోనే ఓ ఆర్టికల్ పుష్ చేశాడు…
Share this Article