ఓ చిన్న వార్త… నవ్వొచ్చింది… ‘‘దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఇక బుల్లితెర మీదకు వచ్చేశాడు, ఇక రికార్డులన్నీ బద్దలే, కృష్ణతులసి అనే సీరియల్‌ను జీటీవీ ప్రసారం చేయబోతోంది త్వరలో… అది ఆయన సీరియలే… అసలు తన టార్గెట్ ఎవరో తెలుసా..? కార్తీకదీపం..! వంటలక్క ఇన్నేళ్లూ అనుభవిస్తున్న టాప్ ర్యాంకును ఆయన కూలదోయబోతున్నాడు…’’ ఇదీ ఆ వార్త సారాంశం… కొన్ని యూట్యూబ్ చానెళ్లు, కొన్ని సైట్లలోనే కాదు… మెయిన్ స్ట్రీమ్ పత్రికల అనుబంధ సైట్లు కూడా నానా కంగాళీగా ఇదే వార్తను దాదాపు ఇదే అర్థంలో రాసుకొచ్చాయి… సదరు టీవీ వాడు కూడా విపరీతంగా ప్రొమోలు కొడుతున్నాడు, ప్రచారం చేసుకుంటున్నాడు… ఫుల్ హైప్ క్రియేట్ చేస్తున్నాడు… సోషల్ మీడియాను వాడేస్తున్నాడు… మరి ఎందుకు నవ్వొచ్చింది అంటారా..? ఉంది… దానికీ ఓ బేస్ ఉంది…
ఆ వార్తలన్నింటికీ ఒకటే బేస్… పిచ్చి తర్కం… వంటలక్కది బ్లాక్ షేడ్ ఉన్న మహిళ పాత్ర… అనుమానపు మొగుడి వల్ల సంసారం దెబ్బతిని, పదేళ్లుగా ఆ మొగుడి కోసం ఎదురుచూసే ఒక సతీ వంటలక్క పాత్ర… ఇప్పుడు రాఘవేంద్రరావు తీయబోయే సీరియల్లో పాత్ర పేరు శ్యామ… ఆమే నలుపే… కానీ కోకిల కంఠం, తన గొంతును ఇంకెవరికో తాకట్టు పెట్టి, నానా అవమానాల పాలవుతూ ఉంటుంది… సో, రెండు సీరియళ్లలోనూ ప్రధాన పాత్రలు బ్లాక్ షేడ్సే కాబట్టి… ఈ సీరియల్ కార్తీకదీపాన్ని టార్గెట్ చేసి తీస్తున్నారనేది ఆ వార్త తర్కం… అబ్సర్డ్… కారణాల్లోకి వెళ్తే… రెండు కథలూ పూర్తిగా వేర్వేరు… కార్తీకదీపం మళయాళీ ఒరిజినల్… కృష్ణతులసి బెంగాలీ ఒరిజినల్… రాఘవేంద్రరావు డెబ్భయ్ దాటినా ఇంకా చురుకుగానే ఉండవచ్చుగాక, కానీ తెలుగు సీరియళ్ల దిక్కుమాలినతనాన్ని ఒంటపట్టించుకోవడం అంత ఈజీ కాదు… ఆ ప్రొమోలు చూస్తుంటేనే అర్థం అవుతోంది, అది రాఘవేంద్రరావు మార్క్ కాదని… ఎవరో డైరెక్టర్ చేతుల్లో పెట్టి, తన పేరుతో ప్రచారం చేస్తున్నారని…! ప్రొమోల్లోనే సీరియల్ తలాతోకలేనితనం కనిపిస్తూనే ఉంది…
Ads
రమ్యకృష్ణను ముందుపెట్టి, ఓ ప్రధానపాత్రలో ప్రవేశపెట్టి నాగభైరవి అనే సీరియల్‌ను ఇలాగే ఊదరగొట్టారు… పత్రికల్లోనూ ప్రకటనలు ఇచ్చారు… చివరకు ఏమైంది..? తుస్సుమని తోకపటాకులా పేలిపోయింది… అన్నింటికీ మించి మాటీవీ వాడి రేటింగుల మాయ… నిజానికి నానా దర్శకత్వ లోపాలతో, సోది కథనంతో కార్తీకదీపం సీరియల్ పరమచిరాకెత్తిస్తోంది ఈమధ్య… కానీ ఏకంగా సూపర్ స్టార్ల సినిమాలను మించి 17, 16 రేటింగులుంటయ్… గృహలక్ష్మి, దేవత కూడా 9, 10 రేటింగులు కొడుతుంటయ్… వాటితో పోటీపడాలనుకున్న జీవాడు త్రినయని, ప్రేమ ఎంత మధురం సీరియళ్లను ఎంత లేపాలని ట్రై చేస్తున్నా సరే, అవి 7 నుంచి 8 వరకే సాధిస్తున్నయ్… అదొక మాయ… ఈ స్థితిలో వంటలక్కకు పోటీ ఇది, అబ్రకదబ్ర, హాంఫట్ అనగానే కృష్ణతులసి టాప్ వన్‌కు చేరదు… నిజానికి మాయలు, మంత్రాలు గట్రా ఉన్న సతీ త్రినయనికి దర్శకత్వ లోపాలే పెద్దశాపం, లేకపోతే అది ఇంకా కాస్త బెటర్‌గా పర్ఫామ్ చేసేది… పునర్జన్మతో లింకై ఉన్న ప్రేమ ఎంత మధురం సీరియల్ కూడా దమ్మున్న కథే… దానికీ డైరెక్షన్ లోపాలే పెద్ద మైనస్… ముందు తమ ప్రయారిటీ సీరియళ్ల లోపాలు దిద్దుకోకుండా జీవాడు ఎంత తన్నుకున్నా మాటీవీ సీరియళ్లను కొట్టడం కష్టం… కష్టమున్నర… అది ఎంతటి రాఘవేంద్రరావైనా సరే..!!
Share this Article