కరోనా వ్యాప్తి నిరోధానికి రైల్వేశాఖ చిట్కా వైద్యం!
——————-
ప్రజలచేత, ప్రజలకోసం, ప్రజల వలన, ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రభుత్వం అంటారు. తెలుగులో మనం ప్రయత్నపూర్వకంగా మరచిపోయిన విభక్తి ప్రత్యయాల్లో మరికొన్ని కలిపి ప్రజల కిన్, కున్, యొక్క, లోన్, కంటెన్, వలనన్, పట్టి, చేతన్, చేన్, తోడన్, తోన్ అని కూడా గంభీరంగా అనుకోవచ్చు. ప్రజలే ప్రభువులు అన్నది ప్రజాస్వామ్య మౌలిక ఆదర్శం. పునాది. సూత్రం. సిద్ధాంతం. ప్రజలకు ఏమి కావాలో ప్రభుత్వం అదే చేస్తుంది. లేదా చేస్తున్నట్లు ప్రభుత్వం అనుకుంటూ ఉంటుంది.
ఉదాహరణకు చిన్న వార్త. కరోనా రోజుల్లో ఎన్ని హెచ్చరికలు చెప్పినా జనం వినకుండా తెగతిరుగుతున్నారట. దాంతో తక్కువ దూరం రైళ్లలో ప్రయాణ చార్జీలను రెండింతలు పెంచారట. అంటే ముప్పయ్ రూపాయల చార్జీ ప్రజల భద్రత దృష్ట్యా అరవై రూపాయలు చేశారట. పెరిగిన చార్జీలు షాక్ కొట్టి జనం తిరగడం మానేసి ఇళ్లల్లోనే కూర్చుంటారట. దాంతో ఎలా వ్యాపించాలో తెలియక ముళ్ల బంతి కరోనా కుమిలి కుమిలి ఆత్మహత్య చేసుకుని అంతర్ధానమవుతుందట. ఇది రైల్వే శాఖవారి అధికారిక ప్రకటనలో సారాంశం. చిన్న వార్తే కానీ చాలా విలువయినది. లోతుగా అర్థం చేసుకోవాల్సినది.
Ads
పెరుగుతున్న జి డి పి – అంటే గ్యాస్- డీజిల్ – పెట్రోల్ ధరలకు కూడా బహుశా ఇదే సూత్రం వర్తిస్తుందేమో ఏలినవారు ఇలాగే ఒక అధికారిక ప్రకటన ఇస్తే బాగుంటుంది. ఇవ్వకపోయినా- కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక శాస్త్రీయ సూత్రాన్ని చార్జీల పెంపుతో చిటికెలో ఆవిష్కరించిన రైల్వేవారి సిద్ధాంతాన్ని అమాయకజనం ఆటోమేటిగ్గా మిగతావాటికి కూడా అన్వయించుకోగలరు.
1. కరోనా వ్యాప్తి నిరోధంలో భాగంగానే జనం ఎక్కువ తిరగకూడదని గంట గంటకు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి!
2 . ఇళ్లల్లో ఉండి ఉండి జనం విపరీతంగా గ్యాస్ మీద వండుకుని గంగాళాలకు గంగాళాలు తిని లావెక్కి, కొవ్వెక్కి, అనారోగ్యం పాలవుతున్నారు. వారిని నియంత్రించి, రక్షించడానికి పొయ్యి దగ్గరికి వెళుతున్న ప్రతి పూటా గ్యాస్ ధరలు పెంచాల్సివస్తోంది!
3. ఖాళీగా ఉండి ఊరికే బ్యాంకులకు వెళ్లి డబ్బులు డ్రా చేసి, వృథా ఖర్చులు పెడుతున్నారు. దాంతో అనివార్యంగా కొన్ని బ్యాంకులు రాత్రికి రాత్రి మూసేయాల్సి వచ్చింది. కొన్నిటిని ప్రయివేటీకరించాల్సి వచ్చింది.
4. విశాఖ ఉక్కుకు తుక్కు వెనక కూడా బహుశా ఇలాంటి ప్రజా ప్రయోజన వ్యూహమే ఉండి ఉంటుంది.
—————–
రోగమొస్తే డాక్టరు మందులిస్తాడు. ఆ మందుల్లో ఏమి ఉంటుంది? ఎవరు, ఎక్కడ, ఎప్పుడు తయారు చేశారో మనం అడగం. అడగకూడదు. విషమయినా వైద్యుడిని నమ్మి నమ్మకంగా వేసుకోవాలి. మన ఖర్మ ఫలం ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఇది కూడా అంతే. మన బాగుకోసం మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు మన చేత చేదు గుళికలు మింగిస్తూ ఉంటాయి. మందు ఎంత తియ్యగా ఉంటే గుణం అంత ఆలస్యమవుతుంది. మందు ఎంత చేదుగా ఉంటే గుణం అంత త్వరగా కనిపిస్తూ ఉంటుంది. వేసుకోండి- చేదు మందు. కాచుకోండి- ముందు ముందు!……….. By……. -పమిడికాల్వ మధుసూదన్
Share this Article