Subramanyam Dogiparthi….. లవర్ బాయ్ , సాఫ్ట్ బాయ్ ఇమేజిలో నుండి రెబల్ , నెగటివ్ షేడున్న పాత్రలోకి దూరి హీరోగా తన స్థానాన్ని సుస్థిరపరచుకున్న సినిమా ఇది శోభన్ బాబుకు … వీరాభిమన్యు , కాలం మారింది , చెల్లెలి కాపురం వంటి చక్కని చిత్రాల ద్వారా మంచి పేరు తెచ్చుకున్న శోభన్ బాబు ఈ సినిమా ద్వారా మాస్ హీరోగా అవతరించాడని చెప్పవచ్చు . సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ …
అఖల్ & జేన్ అనే నవల ఆధారంగా ఈ సినిమా కధను నేసారట . కధ , స్క్రీన్ ప్లే బాధ్యతలను చేపట్టిన నిర్మాత పి చిన్నపరెడ్డిని , దర్శకుడు పి చంద్రశేఖరరెడ్డిని అభినందించాలి . బిర్రయిన స్క్రీన్ ప్లే సినిమాను పరుగెత్తిస్తుంది . నటీనటులు అందరూ చాలా బాగా నటించారు . ముఖ్యంగా శోభన్ బాబు , కృష్ణకుమారి , ముక్కామల .
మోదుకూరి జాన్సన్ మాటలు తూటాల్లాగా పేలుతుంటాయి . సినిమా ఈరోజుకీ ప్రేక్షకులు గుర్తు ఉంచుకోవటానికి కారణం అశ్వత్థామ సంగీతం , పాటలు , డాన్సులు … జ్యోతిలక్ష్మి , జయకుమారి రెండు డాన్సులు , పాటలు సూపర్బ్ … కొప్పు చూడు కొప్పందము చూడు అనే పాటలో జ్యోతిలక్ష్మి డాన్స్ , ఆ జానపద పాటలోని సరదా అయిన సాహిత్యం అద్భుతంగా ఉంటాయి . అలాగే జయకుమారి డాన్స్ చేసే క్లబ్ సాంగ్ కంచె కాడ మంచె కాడ కందిచేను గుబురు కాడ పాట కూడా వీర హుషారుగా ఉంటుంది .
Ads
ఈ సినిమాలో మరో పాట ఈరోజుకీ స్వాతంత్య్ర దినోత్సవం నాడు , రిపబ్లిక్ దినోత్సవం నాడు వినిపించే సందేశాత్మక పాట సి నారాయణరెడ్డి వ్రాసిన అణువూ అణువున వెలసిన దేవా . ఆ పాటలోని సాహిత్యం చాలా గొప్పగా ఉంటుంది . మరో పాట సి నారాయణరెడ్డి వ్రాసిన ఎవరు వీరు ? ఎవరు వీరు ? దేశమాత పెదవి పైన మాసిన చిరునవ్వులు . వేశ్యావాటిక / రెడ్ లైట్ ఏరియాలోని వేశ్యల బతుకుల మీద చిత్రీకరించబడిన పాట ప్రేక్షకుల హృదయాలను తాకుతుంది . ఈ పాట ఇరవై రోజులు షూట్ చేసారట .
దాశరధి వ్రాసిన అమ్మ లాంటి చల్లనిది , లోకం ఒకటి ఉందిలే పాట , ఓ అబ్బాయో నిలు నిలు నిలు అనే శారద శోభన్ బాబుని టీజింగ్ చేసే పాట , పచ్చని మన కాపురం పాట చాలా శ్రావ్యంగా ఉంటాయి . వీటన్నింటితో సమానంగా మోదుకూరి జాన్సన్ మాటలు చాలా సన్నివేశాలలో తూటాల్లాగా పేలుతుంటాయి .
తెలుగులో కనక వర్షం కురిపించిన ఈ సినిమా హక్కులను శారద కొనుక్కొని మళయాళంలో నిర్మించింది . తమిళంలో వి బి రాజేంద్రప్రసాద్ శివాజీ గణేశన్ తో , హిందీలో డూండీ వినోద్ ఖన్నాతో నిర్మించారు . అయితే , తెలుగులో శోభన్ బాబు జగన్ పాత్ర పేలినట్లు ఇతర భాషల్లో పేలలేదు .
కృష్ణంరాజు అతిధి పాత్రలో కనిపిస్తారు . సత్యనారాయణ , రాజబాబు , ఏడిద నాగేశ్వరరావు ప్రభృతులు నటించారు . మా నరసరావుపేటలో సత్యనారాయణ టాకీసులో ఎన్ని సార్లు చూసానో ! టి విలో వచ్చిన ప్రతిసారీ కాసేపయినా చూస్తుంటా .
కృష్ణకుమారి పాత్ర , ఆ పాత్రలో ఆమె నటన నాకు బాగా నచ్చాయి . ప్రేక్షకుల సానుభూతి పొందే పాత్ర . యూట్యూబులో ఉంది . చూడనివారు అర్జెంటుగా చూడతగ్గ సినిమాయే . ఎక్కడా బోర్ కొట్టదు , పరుగెత్తిస్తుంది , ఎవరు వీరు వంటి పాటలప్పుడు ఆలోచింపచేస్తుంది . Excellent , unmissable and entertaining movie #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు
Share this Article