అక్షర అనే సినిమా విడుదలైంది నిన్న… కరోనా కారణంగా పెండింగ్ పడిపోయిన సినిమాలన్నీ చకచకా గుమ్మడికాయలు కొట్టేసుకుని, థియేటర్లలో వచ్చి వాలుతున్నయ్… నిన్న పలు సినిమాలు రిలీజైనా అందరి దృష్టీ ప్రధానంగా నితిన్ సినిమా చెక్ మీదే కాన్సంట్రేట్ అయింది… అది కాస్తా ఛస్ అనిపించుకుంది… చాలా తక్కువ మంది ప్రేక్షకుల దృష్టి అక్షర అనే సినిమా మీద పడింది… అదీ నందిత శ్వేత మొహం చూసి…! కార్పొరేటు విద్య ఒక మాఫియాగా మారి, క్రమేపీ పేదవాడి ఉన్నత విద్యను కబళించేయడం ఈ మూవీ కథాంశం అని ముందే వెల్లడి కావడం వల్ల కూడా కాస్త ఇంట్రస్టు క్రియేటైంది… కార్పొరేటు విద్య ఓ కోవిడ్ వైరస్… దానికి వేక్సిన్ లేదు, విరుగుడు లేదు… హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చే అవకాశాలు అస్సల్లేవు… అలాంటి సీరియస్ సబ్జెక్టు టాకిల్ చేయాలంటే సీరియస్నెస్ ఉండాలి… సబ్జెక్టు మీద కాస్త అధ్యయనం, పరిష్కార మార్గాలపై కాస్త అవగాహన, బలమైన ప్రజెంటేషన్ కావాలి… కానీ ఏం జరిగింది..?
దర్శకుడు దీన్ని ఓ నాన్ సీరియస్ వ్యవహారంగా మార్చేశాడు… ఓ ఫిజిక్ లెక్చరర్, సారీ, ఫిజిక్స్ లెక్చరర్… ఫిజిక్ అనే పదమున్నా పర్లేదు, ఆమె ఫిజిక్ చూసే ఆ హీరో అనబడువాడు, మరో ముగ్గురు రోమియో కేరక్టర్లు ఆమె వెంట ఏకకాలంలో పడతారు… పడితే పడ్డారు, ఈ పడటాలు లేకుండా తెలుగు సినిమా ఎక్కడ ఏడ్చింది అనుకుంటాం… కానీ ఓ వెగటు కామెడీని నింపేశాడు… అసలే ఈ వెంటపడటాలు, ఆపై వెలికి కామెడీలు కలిపి ఫస్ట్ అరగంటలోనే ఈ సినిమా జస్ట్, బీకామ్ ఫిజిక్స్ బాపతేనని అర్థమైపోతుంది… ఇద్దరినో ముగ్గురినో ఇంట్రవల్ ముందు హీరోయిన్ అనబడు కేరక్టర్ ఫట్ఫటామని కాల్చిపారేస్తుంది… ఇదేందమ్మా అరాచకం అని మనం విస్తుపోతాం… మళ్లీ భయంభయంగానే ఇంట్రవెల్ తరువాత చూడటం మొదలుపెడతాం… అప్పుడు కాస్త ఈ కార్పొరేటు విద్య తాలుకు ప్రభావాన్ని చెప్పడం మొదలుపెడతాడు దర్శకుడు… కానీ అతకదు… సరైన పంచ్ లేదు… అనగా బలమైన ప్రజెంటేషన్ లేదు…
Ads
ఓచోట ఓ డైలాగ్ ఉంటుంది… ప్రభుత్వ కళాశాలల్లో అమ్మాయిలు చేరకపోవడానికి మరుగుదొడ్లు లేకపోవడం కూడా ఓ కారణమే అని…! నిజమే… ఇలాంటి పలు వాస్తవ కారణాల్ని కళ్లకు కట్టేలా పిక్చరైజ్ చేయాలి… మీడియం, ల్యాబులు, బోధకులు, తరగతి గదులు ఎట్సెట్రా అనేకం… అలాగే ముందే చెప్పినట్టు ఇది ఓ వైరస్… ఓ పదిమందిని ఫసాక్ అని కాల్చేస్తే తీరే సమస్య కాదు… పైగా ఓ ప్రెస్ మీట్ ఈమె స్పీచ్ ఇవ్వగానే జనమంతా కదిలి వెల్లువెత్తడం, ప్రభుత్వం అనివార్యంగా తన విధానాన్ని మార్చుకునే పనిలోపడటం టూ సినిమాటిక్… ర్యాంకుల దందాలు, డొల్ల బోధనలతోపాటు సర్కారీ వ్యవస్థలో లోపాల్ని బలంగా చూపించగలిగితే బాగుండేది… ఉన్నత విద్యకు ఓ సగటు గ్రామీణ, పేద అమ్మాయి పడే కష్టాల కోణంలో గనుక కథను ఎత్తుకుంటే… ఈ సినిమా కథ కాస్త వేరే ఉండేదేమో… కథాకథనాలే ఇలా ఉన్నాక ఇక మిగతా విషయాల గురించి చెప్పడానికి ఏముంది..? ముగించడమే…!!
Share this Article