కీర్తి ప్రతిష్ఠల కోసమే లోకం బతుకుతూ ఉంటుంది. తిరుమల కొండమీది వెంకన్న కీర్తి ప్రభతో- వికారాబాద్ పక్కన అనంతగిరి కొండల్లో ప్రశాంతంగా ఉన్న అనంతపద్మనాభస్వామి ప్రభను పోల్చడానికి వీల్లేదు. ఎవరి కీర్తి వారిదే. తిరుమల వెంకన్న అన్నమయ్య అంతటి మహామహుడిని పి ఆర్ ఓ గా పెట్టుకుని పోషించగలిగాడు. అనంతగిరి స్వామికి ఆర్థికంగా అంత వెసులుబాటు లేదేమో? లేక అన్నమయ్య లాంటి కారణజన్ముడు దొరకలేదేమో? మనకెలా తెలుస్తుంది? అది పెరుమాళ్లకే ఎరుక! మనిషికయినా, దేవుడికయినా, చివరకు రాక్షసుడికయినా కీర్తి ప్రతిష్ఠలు, గౌరవ మర్యాదలు, బిరుదులు, గండపెండేరాలు, ఉచితాసనాలు, ముందువరుస ప్రోటోకాల్, టోల్ గేట్లు కట్టకుండా, ఆగకుండా వెళ్లే వి ఐ పి మర్యాదలు, వి ఐ పి బ్రేక్ దర్శనాలు, ట్రాఫిక్ లో సిగ్నల్ పడినా ఆగకుండా వెళ్లగలిగే కాన్వాయ్ లు…ఒక హోదా. ఒక అనుభవించి తీరాల్సిన వైభోగం. మిగతా విషయాల సంగతి ఎలా ఉన్నా భారత దేశంలో పిండికొద్దీ రొట్టెలా- డబ్బు పెట్టే కొద్దీ గౌరవ డాక్టరేట్లు, బిరుదులు, అవార్డులు అందుబాటులో ఉన్నాయి.
ఈ దందాపై ఈనాడు మొదటిపేజీలో తగిన ప్రాధాన్యంతో చక్కటి వార్తను ప్రచురించింది. రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు మనకు అనేక వాహనాల మీద రెడ్ కలర్ డేంజర్ స్టిక్కర్ మీద తెల్లటి అక్షరాల్లో చాలా హోదాలు కనిపిస్తుంటాయి. ఏ బి సి డి లు కలిపి చదవడం వచ్చిన ఎవరికయినా అవి లేని హోదాలని, ఫేక్ అని తెలిసిపోతూ ఉంటుంది. కానీ- అవి నంబర్ ప్లేట్ గా తగిలించుకున్నవారికి అంత జ్ఞానం ఉండదు. తమ అజ్ఞానాన్ని, అహంకారాన్ని, మూర్ఖత్వాన్ని బహిరంగంగా అలా మెడలో పలకకట్టి పెట్టుకున్నట్లు ప్రదర్శించుకునే వారి ప్రకటన హక్కును మనం కాదనం. ట్రాఫిక్ ను పట్టించుకోవడానికే రెండు కళ్లు చాలని పోలీసుల కంట్లో ఇలాంటివి పడాలనుకోవడం అత్యాశ లేదా దురాశ అవుతుంది.
Ads
కొంతమంది నటులకు ఇంటిపేరు ముందు డాక్టర్ అని గౌరవంగా వచ్చి చేరుతుంది. అంతకుముందే అభిమానులు ఒళ్లు కోసుకుని రక్తాభిషేకంతో ఇచ్చిన బిరుదులు రెండో, మూడో ఉండి ఉంటాయి. ఖర్మ బలంగా కాలితే ఆ నటుడి తండ్రి బిరుదు కూడా ఒక ముక్క కొడుకుకు అతికించాల్సిన మర్యాద పాటించాల్సి వస్తుంది. అప్పుడది మొత్తంగా- డాక్టర్, విశ్వ అపఖ్యాతి, నటశూన్య, నటనా భయంకర, నట పక్షవాత కంపిత, నట రోగ పీడిత, నట తాడిత, నట రక్త బిందు చిందిత…ఇలా దండకంలో సమాసం ఆగని పదబంధ బంధురమై భాషకే గిలిగింతలు పెడుతూ ఉంటుంది. ఇంటిపేరు తప్ప పేరు ముందు నిజానికి ఏవీ పెట్టుకోకూడదు. వృత్తిని బట్టి పేరు ముందు డాక్టార్, లాయర్, పోలీస్, టీచర్…అన్నది కూడా స్పష్టత కోసమే. చదువులో భాగంగా పి హెచ్ డి చేసినవారు డాక్టర్ అని పెట్టుకుంటూ ఉంటారు. ఈమధ్య అదికూడా నామోషీగా ఫీలయి కొంతమంది పి హెచ్ డి చేసినా డాక్టర్ అని పెట్టుకోవడం లేదు. వైద్య వృత్తిలో డిగ్రీ, పి జి పూర్తి చేసినవారిని, వైద్యం ప్రాక్టీస్ చేస్తున్నవారిని మాత్రమే డాక్టర్ అనాలి.
వైద్యులు, పి హెచ్ డి పూర్తి చేసినవారినే డాక్టర్ అనాలన్న మర్యాదలో సమానత్వం లోపిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఒకరు ఎక్కువ- ఒకరు తక్కువ కాదు. తమ నటనతో ఎర్రగడ్డకు దారిచూపే నాటదారి దీపాలకు డాక్టర్ బిరుదు ఇవ్వకపోతే డాక్టరేట్ కే మర్యాద దక్కదు. యాభై వేలు, లక్ష, పది లక్షలకు డాక్టరేట్లు, బిరుదులు కొనుక్కునేవారు ఉన్నప్పుడు అమ్మేవారు కూడా ఉండాలి. లేకపొతే డిమాండ్- సప్లై మార్కెట్ సూత్రం తలకిందులవుతుంది. చేతిలో డబ్బులేక బిరుదులు కొనుక్కోలేనివారికి బ్యాంకులు ఉదారంగా వడ్డీలేని రుణాలు ఇవ్వాలి. వాహనాలు కొనగానే ఫాన్సీ నంబర్లు ఆన్ లైన్ వేలంలో అందుబాటులో ఉంచినట్లు- మంచి మంచి బిరుదు భుజకీర్తులను ఆన్ లైన్లో పారదర్శకంగా వేలం వేయాలి. అధికారికంగా వైట్లో చెక్కులిచ్చి కొన్న బిరుదులను ఐ టి శాఖవారు కూడా గుర్తించి గౌరవించాలి. ఇంటిపేరు ముందు కొన్న బిరుదులను తగిలించుకోవడానికి చట్టాల్లో సవరణలు చేయాలి. న్యాయస్థానాలు కూడా పెద్ద మనసుతో పెద్ద పెద్ద పెట్టుడు బిరుదులను అంగీకరించాలి!…..…….. By……… పమిడికాల్వ మధుసూదన్
Share this Article