ఈమధ్య మనోభావాలు దెబ్బతినడం బాగా ఎక్కువయిపోయింది కదా… ఏ చిన్న సందు దొరికినా సరే పలు సంఘాలు మనోభావాల పేరిట ఆందోళనలు చేయడం, కోర్టుకెక్కడం, ఇతరత్రా బెదిరింపులు కామన్ అయిపోయాయి… కొన్నిసార్లు అసలు ఇష్యూ లేకపోయినా సరే, ఏదో ఒకటి క్రియేట్ చేసి మరీ గొడవలకు దిగుతాయి… కొన్ని సెటిల్ అవుతాయి, కొన్ని ఎవరూ పట్టించుకోక అవే చల్లారతాయి, కొన్ని కోర్టుల్లో పడి క్రమేపీ కాలం చెల్లిపోయి, నేచురల్ డెత్‌కు గురవుతాయి… సరే, అవన్నీ ఎలా ఉన్నా… గతం నుంచీ బ్రాహ్మణవర్గాన్ని అవహేళన చేసే సీన్లు బోలెడు కనిపించేవి సినిమాల్లో… కోపమొచ్చినా సరే లోలోపల ఉడుక్కుని ఊరుకునేవాళ్లు… కానీ ఇప్పుడు ఊరుకోవడం లేదు… తాజాగా ఓ సినిమాలో 14 సీన్లను పట్టుబట్టి తీసేయించారు… ఓ విశేషమే.. ఒక నిర్మాత అంతగా దిగివచ్చి, మనోభావాలను గౌరవించడం వార్తే… కానీ ఇందులో భజన లేదు కదా, అందుకే మన సినిమా పేజీలకు పెద్దగా ఆనలేదు…
సినిమా పేరు పొగరు… ఈమధ్యలోనే విడుదలైంది… కన్నడంలో, తెలుగులో ఒకేసారి రిలీజ్ చేశారు… తెలుగులో ఎప్పుడొచ్చిందో ఎప్పుడు పోయిందో ఎవరికీ తెలియనంత అనామకంగా రిజల్ట్… హీరో ఎవరంటే ధ్రువ సర్జా… తమిళ్ స్టార్ హీరో అర్జున్ మేనల్లుడు తను… ఇందులో హీరోయిన్ రష్మిక మంథన… నిజానికి ఆమెకు తెలుగులో కాస్త పాపులారిటీ ఎక్కువ కాబట్టి, ఆమె ఫోటోలు పెట్టి, హీరో కండల ఫోటోలు పెట్టి విడుదల చేస్తే నాలుగు టికెట్లు తెగుతాయి అనుకున్నట్టున్నాడు… తీరా అందులో కొన్ని సీన్స్ మీద బ్రాహ్మణ సంఘాలు కస్సుమన్నాయి… ఒరేయ్, నికృష్టుడా, పూజారి తల మీద విలన్ కాలు పెట్టడమేంట్రా అని తిట్టిపోశాయి… అబ్బే, కథే అలా ఉంది అయ్యవార్లూ అని నిర్మాత చెప్పబోతే… నీ సినిమా కథ మారుస్తాం బిడ్డా అని శపించబోయారు… ఎందుకొచ్చిన గొడవ అనుకుని దర్శకుడు నందకిశోర్ కర్నాటక ఫిలిమ్ చాంబర్ ఆఫ్ కామర్స్ మధ్యవర్తిత్వంతో ఏకంగా 14 సీన్లను కట్ చేయడానికి అంగీకరించాడు… కట్ చేశాడు కూడా… కుల సంఘాల మనోభావాల ఎదుట పొగరు చూపిస్తే చెల్లదు అనే ప్రజెంట్ నీతికి తనే తలొగ్గాడు… చివరకు కథ సుఖాంతం…!!
Ads
Share this Article