చదువుకుంటే లీడర్లు ఎలా అవుతారు?
——————-
మహాత్మా గాంధీ న్యాయవిద్య చదివి, అంతర్జాతీయస్థాయిలో న్యాయవాదిగా నిరూపించుకుని భారత స్వాతంత్ర్య పోరాటంలో ఊరూరు తిరిగాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా లండన్లో లా డిగ్రీ చదువుకుని భారత్ వచ్చాడు. పి వి నరసింహారావు చదువు సంధ్యలు, బహుభాషల్లో పాండిత్యం అందరికీ తెలిసినవే. అటల్ బిహారీ వాజపేయి హిందీ, సంస్కృతం, ఇంగ్లీషు అంశాలతో గ్వాలియర్ లో డిగ్రీ చదివాడు. చదువుకుని రాజకీయాల్లోకి వచ్చేవారు తగ్గిపోయారు. రాజకీయాల్లోకి వచ్చాక బుద్ధిగా డిగ్రీలు, పిజీ లు చేసేవారు చాలా అరుదు. ఫలానా వయసు దాటితే ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు అని మన రాజ్యాంగం వయసును మాత్రమే చూస్తుంది కానీ- కనీసం పదో తరగతి అయినా పాస్ కానివారు పదిమందికి ఎలా లీడర్ అవుతారు? అని అనుకోలేదు. అలా అభ్యంతరం చెప్పలేదు. అలా చెప్పాలని నాగరిక సమాజం కోరుకోకూడదు. అనివార్య కారణాలవల్ల అయిదో క్లాసు దాటని లీడర్ విద్యాశాఖ మంత్రిగా యానివర్సిటీ ప్రొఫెసర్లు ఏ చదువులు చెప్పాలో? ఏవి చెప్పకూడదో? నిర్ణయించవచ్చు. ప్రజాస్వామ్యంలో గొప్పతనంగా దీన్ని చూడాలే తప్ప- పిహెచ్డి దాకా చదువుకున్న వ్యక్తి పశువుల శాఖ మంత్రి ఎలా అవుతాడు? అనిగానీ, ఏమీ చదవని వ్యక్తి విద్యా శాఖ మంత్రి ఎలా అవుతాడు అనిగానీ అడగడంలో అర్థం లేదు.
చదువులకు- రాజకీయాలకు అసలు పొత్తు కుదరదు. ఎంత ఎక్కువ చదివితే అంత పిరికిగా తయారవుతారు. రాజకీయనాయకుడికి మొదట కావాల్సింది అంతులేని ధైర్యం. అజ్ఞానం, అహంకారం, లెక్కలేనితనం రాజకీయానికి డ్రెస్ కోడ్. చదువుకునే కొద్దీ రాజకీయానికి అవసరమయిన బాడీ లాంగ్వేజ్ మాయమవుతుంది. చొక్కా గుండీలు పొట్టదాకా విప్పుకుని, మెడలో బంగారు గొలుసులు, పులిగోరు, చేతికి బంగారు బ్రేస్లెట్, పది వేళ్లకు పది ఉంగరాలు, తెల్ల ప్యాంట్, తెల్ల చొక్కా వేసుకుని తల పైకెత్తుకుని గర్వంగా తిరగడం రాజకీయాల్లో కనీస అవసరం. ఏ మాత్రం చదువుకున్నా ఇవన్నీ అసహ్యించుకోదగ్గవిగా అనిపిస్తాయి. గెలిచినా, ఓడినా- సాక్షాత్తు దేవదేవుడి దగ్గరయినా క్యూలో నిలుచోవడం రాజకీయనాయకులకు ఇష్టం ఉండదు. చదువు వల్ల సంస్కారం, సంస్కారం వల్ల వినయం, వినయం వల్ల ఓర్పు, ఓర్పు వల్ల మౌనం, మౌనం వల్ల చేతగానితనం ఒకటి ఒకటిగా అలవాటవుతాయని రాజకీయనాయకులు దూరదృష్టితో ముందుగానే చదువులకు మంగళం పాడతారు. రాజకీయనాయకులకు భయపడి సరస్వతి వారికి దూరంగా భయం భయంగా తిరుగుతుండడంవల్ల వారి పిల్లలు కూడా ఎక్కువభాగం చదువుకు దూరంగా ఉండాల్సిన చారిత్రక అవసరం ఏర్పడుతుంది. రెండు లక్షల మంది ఓటర్లను చదవగలిగిన లీడరు- అనుకుంటే రెండు పుస్తకాలు చదివి పారేయగలడు. కానీ- సమాజసేవలో తలమునకలు కావడం వల్ల చదవలేడు. అంతే.
Ads
——————-
రాజస్థాన్ లో అరవై రెండేళ్ల వయసులో ఎమ్మెల్యే పూల్ సింగ్ డిగ్రీ పరీక్ష రాశాడు. పొలిటికల్ సైన్స్ లో పి జి కూడా చేసి, ఆపై పి హెచ్ డి కూడా చేయాలన్నది ఆయన సంకల్పమట. మంచిదే. ఆయన కోరుకుంటున్నట్లు డాక్టరేట్ కూడా తీసుకోవాలని మనం కూడా కోరుకుందాం. చదువుకోవాలన్న తపన ఉంటే మార్గాలు అనేకం. తోలుమందం రాజకీయ పక్షులకు మామూలు సూది సరిపోతుందా? అని మన ప్రధాని ఒక గంభీరవాతావరణాన్ని తేలికపరచడానికి జోక్ వేశారు. “తోలుమందం” విశేషణం వెనుక ఎన్నెన్నో అర్థాలున్నాయి. తోలుమందానికి చదువుల విలువ చెప్పగలిగిన ధీరులెవ్వరు?…………. By….. -పమిడికాల్వ మధుసూదన్
Share this Article