‘‘ఒక సూటి ప్రశ్న… అందరికీ సొంతమైన ఒక పాపులర్ జానపదంలో పల్లవిని తీసుకుని, దానికి కొనసాగింపు రాసుకుంటే తప్పెలా అవుతుంది..? లవ్ స్టోరీ సినిమా కోసం సుద్దాల అశోక్ తేజ సారంగదరియా పాటను ఆ డైరెక్టర్ సూచనలకు అనుగుణంగా ట్యూన్‌కు తగినట్టుగా కొత్తగా రాస్తే ఎందుకు తప్పుపట్టాలి..? ఇది తన క్రియేటివ్ ఫ్రీడంను కించపరిచినట్టు కాదా..? అసలు ఆ జానపదం మీద ఎవరికీ రైట్స్ ఉండవు కదా… వాడుకుంటే తప్పేముంది..?’’…. ఒకాయన వేసిన ప్రశ్న ఇది… నిజమే… ఒక సినిమా పాట మీద ఇంత డిబేట్ జరగడం విశేషమే… కానీ ఎందుకు జరుగుతోంది..? అది కదా అసలు ప్రశ్న… ప్రత్యేకంగా ఎవరూ ఆయన మీద కక్షకట్టి విద్వేషాన్ని చిమ్మాల్సిన అవసరం ఏముంటుంది..? కాకపోతే ఈ డిబేట్‌కు, ఈ విమర్శలకు రకరకాల పాటసంబంధ కారణాలు ఉన్నయ్, వాటిల్లోకి మళ్లీ ఇక్కడ పోదలుచుకోలేదు… కానీ తెలంగాణ సమాజం తన క్రియేటివ్ ఫ్రీడంను కూడా ఏమీ కించపరచడం లేదు… నిజానికి తెలంగాణ ఆకాంక్షల్ని, తెలంగాణ జానపదాల్ని, పల్లె కళల్నీ కించపరిచింది తనే… అందుకే సుద్దాల పేరు చెబితేనే తెలంగాణ సమాజం మొహం చిట్లిస్తుంది…
సినిమా వాళ్లకు కోపమొస్తుందని కావచ్చు, ఇంకేదైనా కారణం కావచ్చు… కానీ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నవేళ కూడా తను గొంతు కలపలేదు, కలం కదల్లేదు, ఒక్క పాటా పుట్టుకురాలేదు… అసలు తెలంగాణ ఉద్యమం మీద ఏమైనా రాయడమంటేనే ఓ పాపకార్యం అన్నట్టుగా ఉండేవాడు… తెలంగాణ రాగానే అమరావతి మీద పాటలు రాశాడు… మొన్నామధ్య తనకేదో ఆరోగ్య సమస్యలు వస్తే ఇదే తెలంగాణ సమాజ ధనం నుంచి కేసీయార్ డబ్బు ఖర్చు పెట్టాడు… తనకు కావల్సింది కూడా ఇలాంటోళ్లేకదా…. సరే, పోనీ… అందరూ ఉద్యమంలో కదలాలని ఏమీ లేదు… తనకు తెలంగాణతనం మీద అంత ప్రేమ కుదరకపోవచ్చుగాక… కానీ తను ఇప్పుడు ఏమంటున్నాడు సారంగ దరియా పాట మీద… ఏదేదో పిచ్చి సమర్థనలకు దిగుతూ… తెలంగాణ జానపద గీతాలను తరతరాలుగా బతికించుకున్న పల్లెవాసులను, కళాకారులను, స్థూలంగా తెలంగాణ జానపదాల్నే కించపరుస్తున్నాడు… ఒక్కసారి ఈ వీడియో చూడండి…
Ads
అప్పట్లోని టీన్యూస్ క్లిప్పింగులు గమనించండి… ఆ జానపద కళాకారిణి ఈ సారంగదరియా పాటను ఎంచుకుంది… రాగయుక్తంగా ప్రాణం పెట్టి పాడింది… అప్పట్లో బాగా హిట్ ఆ పాట… అదే రేలారే జడ్జిగా ఉన్న ఇదే సుద్దాల అశోక తేజా ‘‘దాని ఇంటి ముందు బురద… రమ్మంటే రాదురా నిదుర..’’ అనే వాక్యానికి భారతంలోని ఓ పద్యంతో పోల్చుతూ ఓ ప్రశంసాపూర్వకమైన వివరణ ఇచ్చాడు… మెచ్చుకున్నాడు… చప్పట్లు కొట్టాడు… పరవశించిపోయాడు… ఈ పాట చరణాల్లో ఎంత గొప్ప వ్యక్తీకరణ ఉందో కదా అని హాశ్చర్యపోయాడు… అద్భుతమైన రచన, సూపర్‌గా పాడావు కోమలీ అని ఆకాశానికెత్తాడు… అదే కవి ఇప్పుడు తనపై వస్తున్న కాపీ విమర్శలకు ఎలా రియాక్టయ్యాడో కూడా ఇదే వీడియోలో చూడండి… ‘‘ఇట్లాంటివి తీసుకున్నప్పుడు ఓ ప్రమాదం ఉంది… వాళ్లు ఒక ధోరణిలో రాస్తారు… వాళ్లు చదువుకున్నవాళ్లు కాదు… వాళ్లకు ప్రత్యేకమైన అకడమిక్ డిగ్రీలుండవ్…’’ ఇదేం మాట..?
పాట రాయాలంటే చదువుకున్నవాళ్లు అయి ఉండాలా..? జానపద గీతాలు జనం చెమట నుంచి, జనం కన్నీటి నుంచి, జనం సరదాల నుంచి, జనం పండుగల నుంచి, జనం ఉద్వేగాల నుంచి పుట్టుకొచ్చేవి… అవెక్కడా రాయబడవు… చదువుకున్నవాళ్లే రాయరు… పాట ఒక తరం నుంచి ఒక తరానికి అలాగే ప్రవహిస్తుంది… జానపదగీతం ఎప్పుడూ ఎప్పటికప్పుడు కొత్త పదాల్ని ఇముడ్చుకుంటూ ఓ సజీవప్రవాహంలా తరువాత తరాలకు పయనిస్తుంది… అంతే తప్ప వాళ్లకు అకడమిక్ డిగ్రీలుండవ్ అని సుద్దాల వంటి మహా విద్యావేత్తలు, ఘనకవులతో వెక్కిరింపబడటానికి కాదు… జానపదం మీద, అదీ తెలంగాణ జానపదం మీద తనకున్న తేలికభావాన్ని చూశారుగా… ఎలా కించపరుస్తున్నాడో చూశారుగా… అదీ తన ధోరణి… దీనిపైన ఓ డిబేట్ జరిగితే తప్పేమిటి..?! తను ఇంకా సమర్థించుకునేకొద్దీ ఇంకా వంద తవ్వగలదు తెలంగాణ సమాజం… తనతో పోలిస్తే దర్శకుడు శేఖర్ కమ్ముల వేయి రెట్లు బెటర్… ఎహె, పోలికే లేదు… శేఖర్ ఏ సమాజాన్నీ,ఏ సంస్కృతినీ కించపరచడు… నిజాయితీగానే ఉంటాడు… ఫిదా చూశాం కదా… ఓ నిజామాబాద్ పల్లెను అచ్చంగా చూపించాడు… ఎక్కడా తెలంగాణతనానికి మచ్చ రానివ్వలేదు… అవును మరి, తను సుద్దాల కాదు కదా…!!
Share this Article