సూపర్ హీరోయిక్ తెలుగు సినిమాల చీకటి దరిద్రం నడుమ అప్పుడప్పుడూ కొన్ని మెరుపులు మెరుస్తుంటయ్… మన తెలుగు సినిమా కూడా మారుతుంది, కాస్త టేస్టున్నవి, డిఫరెంటు సినిమాలు, బుర్ర ఉన్న కథాంశాలు కూడా వస్తాయి అనే ఆశలను అవి రేపుతుంటయ్… హీరోల కాళ్ల దగ్గర పొర్లుదండాలు పెట్టే మన సినిమా కథను బయటికి లాక్కొచ్చి, చెవులు మెలేసి, కొత్త దారిలో పెట్టే ప్రయత్నం, ప్రయోగం ఏ స్థాయిలో చేసినా అభినందించాలి… ఈరోజు రిలీజయిన ప్లే బ్యాక్ అనే సినిమా నిర్మాతను ఈ కోణంలో అభినందించాలి..! ఎందుకంటే..? ఇలాంటి భిన్నమైన, సంక్లిష్టమైన ఒక ఫిక్షన్ కథను చెప్పి ఒక నిర్మాతను ఒప్పించడమే కష్టం… ఎందుకంటే..? నాలుగు పిచ్చి కామెడీ సీన్లు, నాలుగు మాంచి హాట్ మసాలా సీన్లు, రెండు ఫైట్లు, అక్కడక్కడా తలతిక్క పంచ్ డైలాగులు నింపేద్దామని చూసే నిర్మాతలే అధికం మనకు..! ఒకవేళ ఇలాంటి కథల్ని తీయాలీ అనుకుంటే ఓ వెబ్ సీరిస్ తీసి ఓటీటీల్లో నింపేస్తారు, చూసేవాళ్లు చూస్తారులే అనుకుంటారు గానీ వెండితెర మీద ప్రయోగాలకు రిస్క్ తీసుకోరు…
ఇంతకీ ఈ సినిమా కథ ఏమిటో చూద్దాం… 1993 కాలంలో ఉన్న ఒక అమ్మాయి ఇప్పటి కాలంలోని ఒక అబ్బాయికి కాల్ చేస్తుంది… అంటే… గతంలోని అమ్మాయి, వర్తమానంలో ఉన్న అబ్బాయికి కాల్… అదే కనెక్షన్ ఏనాడో కటైన ఓ పాత లాండ్ లైన్ ఫోన్ నుంచి…… కథ స్టార్ట్… కన్ఫ్యూజింగుగా ఉంది కదా… ఆ కాలం నుంచి ఈ కాలంలోకి కాల్ ఏమిటని..? అదే సినిమా కథలోని కొత్తదనం… ఒక ఫిక్షన్… రెండు డిఫరెంట్ టైమ్ లైన్ల నడుమ క్రాస్ టైమ్ కనెక్షన్… ఈ ఫిక్షన్‌ను ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చెబుతూనే, పలు మర్డర్ల నేరకథను సస్పెన్స్ చెడిపోకుండా చివరిదాకా ప్రేక్షకుడిని థియేటర్లో కూర్చోబెట్టి చెప్పాలి… కత్తిమీద సామే… దర్శకుడు జక్కా హరిప్రసాద్ చాలావరకు సక్సెసయ్యాడు ఇందులో… ఈ ప్రయత్నం, ఈ ప్రయోగం గురించి కాదు, నిజానికి తనను అభినందించడానికి ఇంకొన్ని అంశాలూ ఉన్నయ్… మనవాళ్లకు థ్రిల్లర్ అనగానే మధ్యమధ్య రిలీఫ్ కోసం అంటూ దిక్కుమాలిన జబర్దస్త్ మార్క్ కామెడీ స్కీట్లను ఇరికిస్తారు… ఇందులో ఆ ప్రయాస లేదు.. థ్రిల్లర్ అనగానే అశ్లీలాన్ని, హాట్ మసాలాను జొప్పిస్తారు… ఇందులో ఆ కక్కుర్తి లేదు… కావాలని వెతికినా తులం అశ్లీలం, పావుతులం అసభ్యత దొరకదు సినిమాలో… డిష్యూం డిష్యూం ఫైట్ల జోలికి పోలేదు… పెద్ద పెద్ద రిలీఫ్ ఏమిటంటే… పాటలు లేవు… ఇవన్నీ లేకుండా… అంటే సోకాల్డ్ కమర్షియల్ లెక్కల భయాల్ని తెంచుకుని, ఓ సిన్సియర్ ఎఫర్ట్ పెట్టిన తీరు కనిపిస్తుంది… అయితే..?
Ads
కథ ముందే చెప్పుకున్నట్టు మెదడుకు మేత… సినిమా అంటేనే వినోదం, అంతకుమించి ఏమీ కాదు అనుకునే బాపతు ప్రేక్షకులకు ఈ సినిమా ఎక్కకపోవచ్చు… ఓ సైన్స్ ఫిక్షన్ ప్లస్ క్రైం స్టోరీలను ఇష్టపడేవాళ్లకు ఆ జానర్లో ఓ థ్రిల్లర్ పుస్తకం చదువుతున్నట్టు ఉంటుంది సినిమా… నిజానికి ఈ కథ కొత్తదేమీ కాదు… Arthur Eddington అనే ఓ భౌతిక శాస్త్రవేత్త 1927లోనే Arrow of Time అనే కాన్సెప్టు డెవలప్ చేశాడు… దాని ప్రకారం కాలం అనేది ఒక మార్గంలో ప్రయాణం చేస్తుంది… ఆ మార్గం దిశను మార్చడానికి అవకాశం ఉందనేది ఆయన కాన్సెప్టు… అంటే గతంలోకి వెళ్లి ‘ఆల్ రెడీ జరిగిపోయిన’ పరిణామాల్ని కూడా ఎరేజ్ చేయడానికి లేదా మార్చడానికి ప్రయత్నం చేయవచ్చు… ఆ భావనను తీసుకొని క్రిస్టఫర్ నోలన్ ‘టెనెట్’ అనే ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా తీశాడు. అందులో ఒక సీక్రెట్ ఏజెంట్ టైం ఫ్లో మార్చి భవిష్యత్ దాడుల నుండి ప్రపంచాన్ని రక్షిస్తాడు… 2016లో సౌత్ కొరియాలో సిగ్నల్ అనే టీవీ సీరిస్ ఇలాంటి సిమిలర్ పాయింట్ తో వచ్చింది. తర్వాత దాన్ని అన్ నంబర్ అని చైనీస్ లో రీమేక్ చేశారు…. అయితే డిఫరెంటు కాలాల నడుమ కనెక్షన్ ఎలా కుదురుతుంది..? సాధ్యమేనా..? అప్పుడేం జరుగుతుంది…? టైమ్ మెషిన్‌లాగా భౌతికంగా కాలాల నడుమ ప్రయాణించడమా..? మీరే సినిమా చూడండి… అర్థమవుతుంది… లేదంటే ఈ సబ్జెక్టు వదిలేయండి… ఓ క్రైం స్టోరీలాగా చూసేయండి…
సినిమా మంచీచెడుల విషయానికొస్తే… ఎలాగూ ఫిక్షన్ కథే కాబట్టి అక్కడక్కడా తగిలే కొన్ని లాజిక్ రాహిత్యల్ని పట్టించుకోనవసరం లేదు… కానీ పలుచోట్ల దర్శకత్వ లోపాలున్నయ్… అవి పంటికింద రాళ్లు… ఒక్క ఉదాహరణ… విలన్ ఆమెను చంపడానికి ప్రయత్నిస్తాడు, అక్కడి నుంచి తప్పించుకుని పరుగెత్తుకొస్తుంది… ప్రాణభయం, తననెందుకు చంపబోతున్నారో తెలియని ఆశ్చర్యం, ఆందోళన, ఏం చేయాలో తెలియని అయోమయం, పరుగు తీసిన ఆయాసం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేయాలి… కానీ ఆమె బయటికి రాగానే హీరోతో సిగ్గుపడుతూ రొమాంటిక్ సంభాషణ మొదలుపెడుతుంది… ఆడ్‌గా అనిపిస్తుంది సినిమాలో చూస్తుంటే… అనన్య నాగళ్ల మల్లేశం సినిమాలో ప్లజెంటుగా కనిపించింది… ఇందులోనూ అంతే… పెద్ద కళ్లు, తేటమొహం.., తెలుగులో హీరోయిన్లే లేరు అని వాదించే సినిమా పెద్దలకు ఈమె ఎందుకు కనిపించడం లేదో మరి..? ఈ సినిమాలో దినేష్ తేజ అనబడే హీరో మంచి యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా కనిపించాడు గానీ నటన అనే కోణంలో ఇంకా చాలా మైళ్ల దూరం ప్రయాణించాల్సి ఉంది… విచిత్రం ఏమిటంటే… రెగ్యులర్ సినిమా ఆర్టిస్టుల నుంచి సరైన నటనను పిండుకోలేకపోయిన దర్శకుడు నాన్-ఇండస్ట్రీ పర్సనాలిటీస్ టీవీ5 మూర్తి, టీఎన్ఆర్ల నుంచి పాత్రలకు అనువైన నటనను రాబట్టుకోవడం..! సెకండాఫ్‌లో కథ పరుగు అందుకున్నాక… ఆ టెంపోను నిలబెట్టే దశలో ఎడిటర్ బొంతల నాగేశ్వరరెడ్డి ఎఫర్ట్, కామ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రాఫర్ కృషి బాగున్నయ్… ఓ సంక్లిష్టమైన కొత్త సబ్జెక్టును ఎంతమేరకు మన బుర్ర అర్థం చేసుకోగలదు..? పరీక్షించుకోదలిచారా..? సినిమా చూసేయండి…!!
Share this Article