ఇక వంద కోట్ల సంవత్సరాలే ఆక్సిజన్ ఉండేది!
త్వరగా ఊపిరి పీల్చుకోండి!!
——————–
త్రేతాయుగంలో హనుమంతుడు పుట్టగానే అద్భుతాలు జరిగాయి. ఉయ్యాల కొద్దిగా ఒరిగి రోజుల పిల్లాడయిన హనుమ కింద పడితే తల్లి అంజనాదేవి తల్లడిల్లిపోయింది. పసిపిల్లాడికి ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయో అని ఆతృతగా ఒళ్లంతా తడిమి తడిమి చూసింది. పిల్లాడికి దెబ్బలు తగలలేదు కానీ- పిల్లాడి దెబ్బకు కొండ పిండి పిండి అయ్యింది. మళ్లీ ఉయ్యాల్లో పెట్టగానే పిల్లాడు ఏడుపు అందుకున్నాడు. ఒక్క నిముషం ఆగు నాయనా! తోటలోకి వెళ్లి తియ్యటి పండు తెస్తా! అని అంజనాదేవి వెళ్లింది. ఈలోపు ఆకలికి తాళలేక హనుమ ఆకాశంలో ఎర్రగా కనిపించే సూర్యుడిని పండనుకుని ఎగిరి పట్టుకోబోయాడు. అదే సమయానికి సూర్యుడిని రాహువు మింగాలి. నా పనికి ఈ పిల్లాడు అడ్డొస్తున్నాడని రాహువు వెళ్లి ఇంద్రుడికి ఫిర్యాదు చేస్తే ఆయన పరుగు పరుగున వచ్చాడు. ఐరావతం తెల్లగా వింతగా ఉండడంతో – తెల్ల పండేమో అనుకుని హనుమ మింగడానికి చేతులు చాచాడు. ఒక్క సెకను ఆలస్యం చేసినా బతికేలా లేమనుకుని ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమను కొట్టాడు. సరిగ్గా దవడ మీద దెబ్బ తగిలి స్పృహ దప్పి అంతెత్తు నుండి కింద పడ్డాడు.
Ads
దవడను సంస్కృతంలో హనుమ అంటారు. ఇంద్రుడి దెబ్బవల్ల అంజనీ పుత్రుడయిన ఆంజనేయుడు అప్పటినుండి హనుమ అయ్యాడు. తన గారాల పిల్లాడిని ఇంద్రుడు స్పృహదప్పేలా కొట్టాడని అలిగిన వాయుదేవుడు నిరసనగా గాలిని స్తంభింపజేశాడు. అంతే లోకాలన్నీ స్తంభించిపోయాయి. ఏ లోకంలోనూ గాలి లేదు. కదిలిక లేదు. ప్రాణవాయువు లేక ప్రాణికోటి అల్లాడిపోతోంది. దేవతలందరూ బ్రహ్మ దగ్గరికి పరుగెత్తుకెళ్లారు. బ్రహ్మ ఆధ్వర్యంలో సకల దేవతలు నిరసన దీక్షలో ఉన్న వాయుదేవుడి దగ్గరికి వచ్చి, పశ్చాత్తాపం ప్రకటించారు. హనుమకు స్పృహ తెప్పించారు. ఒక్కో దేవుడు తమ శక్తిని హనుమకు వరంగా ప్రసాదించారు. తన పేరిట ఉన్న బ్రహ్మాస్త్రం కూడా హనుమను ఏమీ చేయలేదని బ్రహ్మ వరమిచ్చాడు. అందువల్లే హనుమ సకలదేవతల సార శక్తి అయ్యాడు. రావణాసురుడిని ఎదుర్కోవాలి అంటే ఇంత అపరిమిత బలం కావాలి కాబట్టి- ఇంద్రుడిచేత ఇలా చేయించారని ఇందులో అంతరార్థం. అప్పటికి వాయుదేవుడు శాంతించి మళ్లీ ఎప్పటిలా ప్రసరించడం మొదలు పెట్టాడు. లోకాలు ఊపిరి పీల్చుకున్నాయి.
——————-
త్రేతాయుగమంతా గడిచింది. ద్వాపర కూడా దొర్లిపోయింది. కలిలో ఉన్నాం. మళ్లీ ఇన్ని కోట్ల సంవత్సరాల్లో వాయుదేవుడు అప్పుడు స్తంభించినట్లు- మరో వంద కోట్ల సంవత్సరాల్లో అసలు పీల్చడానికి ప్రాణవాయువు మిగిలి ఉండదట. సూర్యుడి వేడి పెరిగి పెరిగి నెమ్మదిగా ప్రాణవాయువు ఆవిరయిపోతుందట. భయపడేవారేమో- హతవిధీ వంద కోట్ల సంవత్సరాలకే గాలి అయిపోతుందా? ఇక బతకడమెలా? అని ఈ వార్త చదివి వెంటనే ఊపిరి వదిలేస్తున్నారు. భయంలేని వారేమో- వంద కోట్ల ఏళ్ళు అంటే ఎన్నెన్ని కోట్ల కోట్ల తరాలు? ఇప్పుడు మనకెందుకు దిగులు? అని హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు……… By…. -పమిడికాల్వ మధుసూదన్
Share this Article