వేణుస్వామి కొద్దిరోజులుగా వార్తల్లో వ్యక్తి… అలా చేసింది సోకాల్డ్ యెల్లో మీడియా… బహుశా లోకేష్ రెడ్‌బుక్‌లో ఉందేమో పేరు… అందుకేనేమో టీవీ5 టార్గెట్ చేసి డిబేట్ల మీద డిబేట్లు చేస్తూ టార్గెట్ చేస్తూ వెంటాడుతోంది అనుకున్నాను… జగన్ గెలుస్తాడనే వేణుస్వామి జోస్యాల వెనుక కూడా ఏదో కుట్ర ఉందనీ… ఐప్యాక్ దగ్గర నుంచి జగన్ చానెళ్లు, వేణుస్వామి వంటి జ్యోతిష్కులు ఓ కూటమిగా పనిచేశారని యెల్లో సిండికేట్ ప్రచారం చేసింది…
వోెకే, ఆ కసి ఉందనుకుందాం… ఇదోరకం వర్గ కసి… అందులో భాగంగానే వేణుస్వామిని టార్గెట్ చేశారనే భ్రమలో ఉన్నాను… కానీ అంతకుమించి..? అదుగో ఆ వివరాలతో వేణుస్వామి ఇన్‌స్టాలో ఓ వీడియో పెట్టాడు… తనను ఎలా టార్గెట్ చేశారో, టీవీ5 జర్నలిస్టులతో సహా ఓ కూటమి, ఓ సిండికేట్‌గా, ఓ మాఫియాగా మారిన మీడియా తనను ఎలా వేధిస్తున్నాయో, ఎంత డిమాండ్ చేస్తున్నాయో ఆ వీడియో సారాంశం…
అందులో నిజానిజాల జోలికి నేనిక్కడ పోదల్చుకోలేదు… ఆ మీడియా మాఫియా, సిండికేట్లు నిజమేనా అనే చర్చ కూడా నాకనవసరం… కానీ ఒకటి మాత్రం నిజం… వేణుస్వామిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి పదే పదే కొడుతున్నారనేది నిజం… తెల్లారిలేస్తే అవే డిబేట్లు పెడుతున్నారు… వేణుస్వామి ఓ జాతీయ సమస్యా…? జనానికేమైనా నష్టకారకమా..? ఇదా టీవీ5 జర్నలిజం ప్రమాణాలు..? సగటు తెలుగు యూట్యూబ్ చానెల్ స్థాయికి ఎవరు దిగజార్చారు దాన్ని..? ఎవరి కోసం నడుస్తున్నది ఆ చానెల్..? ఈ ప్రమాణాల ఈ చానెల్ ఓనర్ ఏకంగా టీటీడీ ఛైర్మన్ అవుతాడట రేప్పొద్దున..? ఆహా… ఏపీకి ఎంత స్వర్ణ యుగం వచ్చిందో కదా…!
Ads
ఎస్, వేణుస్వామి చెప్పే వ్యక్తిగత జోస్యాలు తప్పా ఒప్పా అనే చర్చ కాదిక్కడ… అంతటి అమెరికాలోనే కమలా హారిస్ గెలుస్తుంది, ట్రంప్ మట్టిగరుస్తాడనే జోస్యాలు కూడా చెబుతున్నారు… నమ్మేవాడు నమ్ముతాడు, లేదంటే అవాయిడ్ చేస్తాడు… అనేక జోస్యాలు ప్రపంచవ్యాప్తంగా తెర మీదకు వస్తూనే ఉంటాయి… నాగచైతన్య, శోభిత మీద జోస్యంతో నాగార్జునకు బాధ లేదు, శోభితకు బాధ లేదు, చైతన్యకు బాధ లేదు… మరి ఆ టీవీ5 మాత్రమే ఎందుకు చొక్కాలు, తెరలు చించుకుంటోంది… వ్యక్తుల్ని పదే పదే వెంటాడటం ఏం జర్నలిజం..?
సరే, దాన్ని వదిలేద్దాం… ఈ వేధింపులతో నాకిక ఆత్మహత్యే శరణ్యం అని వేణుస్వామి దంపతులు చెబుతున్నారు… ఇదేదో సంపతీ డ్రామాలాగా లేదు… ఎందుకంటే… నిజంగానే టీవీ5 వాళ్ల వెంటబడింది… వేటాడుతోంది… డబ్బేనా ప్రధాన లక్ష్యం..? ఏమో, వేణుస్వామి రిలీజ్ చేసిన ఆడియో నిజానిజాల లోతుల్లోకి కూడా నేను పోవడం లేదు… ఎప్పుడూ తన వీణ ఏమిటో, తన సంగీతం ఏమిటో ఆ ప్రపంచంలోనే బతికే వేణుస్వామి భార్య వీణ కూడా తెరపైకి వచ్చి తన ఆవేదన వ్యక్తం చేస్తోంది…
అసలు తెలంగాణ మహిళా కమిషన్‌కు తన విధివిధానాలు తెలుసా..? వేణుస్వామి మీద ఫిర్యాదును అసలు చదివిందా..? దానికి కేస్ మెరిట్ ఉందా..? ఎవరికి భయపడుతోంది ఆ కమిషన్..? ఎందుకు..? అయ్యా, సీఎం రేవంత్ రెడ్డి గారూ, ఇదా మీ మహిళా కమిషన్ పనితీరు..? కేటీయార్ మీద సూమోటో కేసు అంటే దానికి రాజకీయ కారణాలు ఉన్నాయని అనుకుందాం… కానీ ఏవో పిచ్చి ఫిర్యాదులు ఎవరో ఇచ్చేస్తే సమన్లు జారీ చేయడమేనా దాని విధి..? అసలు ఆ కేసు తన పరిధిలోకి వస్తుందో లేదో కూడా చూసుకోదా కమిషన్..?
ఇక్కడ మరో ప్రశ్న… టీవీ5 ఫిలిమ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలోనే తెలంగాణ వుమెన్ కమిషన్‌కు ఫిర్యాదు… పైగా తోడుగా డిజిటల్ జర్నలిస్ట్ అసోసియేషన్ అట… ఇదెక్కడిదో, ఎవరు స్థాపించారో తెలియదు… ఫిర్యాదు చేశారుట… అందులో ఏముంది..? చైతన్య, శోభితలపై జోస్యం మహిళలను కించపరచడం అట… చివరకు ఆ స్థాయికి చేరింది మన ఫిలిమ్, డిజిటల్ జర్నలిజం… ఆ అసోసియేషన్లలో ఉన్న మిగతావాళ్లకు ఏమైనా సోయి ఉందా..? ఈ మాట అనడానికి నేను ఏమాత్రం సందేహించడం లేదు…
సో వాట్..? ఇదే సినిమా సెలబ్రిటీల మీద బోలెడు యూట్యూబ్ చానెళ్లు, సైట్లు నానా పిచ్చి కూతలూ కూస్తాయి… అప్పుడేమయ్యాయి ఈ సంఘాలు..? సో… పక్కాగా, ఓ పకడ్బందీ ప్రణాళికతోనే వేణుస్వామిని టార్గెట్ చేస్తున్నారని అర్థం..! సరే, వీళ్లు జర్నలిస్టులు అని చెప్పుకోవడానికి మనం ఎంత కడుపు చించుకున్నా సరే, లోకేష్ రెడ్ బుక్ అంగీకరించదేమో..? టీవీ5 నాయుడు కూడా అంగీకరించడేమో… మరి సోకాల్డ్ జగన్ చానెళ్లుగా చెప్పబడుతున్న టీవీ9, ఎన్టీవీ, టెన్ టీవీ, సాక్షిటీవీలకు సిగ్గూశరం లేవా..? వాటికి వర్గకసి లేదా..? రెడ్ బుక్ బాధితులకు అండగా నిలబడవా..?
ఇదంతా తెలుగు టీవీల దౌర్భాగ్యం… మా పొలిటికల్, ఫైనాన్షియల్ ప్రయోజనాల కోసం మేం ఏమైనా చూపిస్తాం, మీరంతా చూడాలి, చూడక తప్పదు, లేకపోతే మర్యాద దక్కదు అన్నట్టుగా ఉంది యవ్వారం… ఎహె, చేతనైతే జగన్ గత పాలనకాలం యవ్వారాలను తవ్వండి, పీకే మార్క్ రాజకీయాలను తవ్వండి… ఇలా వ్యక్తుల్ని టార్గెట్ చేయడం కాదు… మళ్లీ చెబుతున్నా… టీవీ5 జర్నలిస్టులు, వాళ్ల ఆధ్వర్యంలో నడిచే సోకాల్డ్ ‘జర్నలిస్టు సంఘాల’ చర్యల లోగుట్టులోకి నేనిక్కడ వెళ్లడం లేదు… కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతున్న పెంట గురించే బాధ,,!!
Share this Article