……. జీతెలుగులోనే ఓ సీరియల్ వస్తుంది… ప్రేమ ఎంత మధురం… ఇదే టీవీ, జీ మరాఠీలో వచ్చిన తులా పహ్తేరే, తరువాత జీకన్నడలోకి రీమేక్ అయిన జోతే జోతేయాలి సీరియల్‌కు ఇది తెలుగు రీమేక్… హీరో వెంకట శ్రీరాం ఓ నడివయస్సు వ్యాపారి… హీరోయిన్ వర్ష డిగ్రీ చదివే ఓ యంగ్ ‘కోల్గేట్’ మోడల్ వంటి దరహాసిని… ఇద్దరి నడుమ బోలెడంత వయోభేదం, కానీ ప్రేమ… అదీ కథ… సీన్ కట్ చేయండి… దీనికి పూర్తి భిన్నమైన స్టోరీ చదువుదాం… అంటే ముదురు హీరోయిన్, లేత హీరో…
అదే చానెల్లో సరిగమ అని ఓ మ్యూజిక్ ప్రోగ్రామ్ వస్తుంటుంది… అందులో కొండేపూడి యశస్వి అనే సింగర్ టాప్‌లో ఉన్నాడు… అదరగొడుతున్నాడు… భవిష్యత్తు రాక్ స్టార్ అంటూ సదరు చానెల్ హై పిచ్‌లో కీర్తిస్తోంది… కోటి, శైలజ, చంద్రబోస్… కొందరు సింగర్ మెంటార్లు… ప్లస్ అదనంగా ప్రదీప్ కామెడీ యాంకరింగు… పెద్ద క్లిక్కేమీ కాలేదు… ఇక్కడ మరోసారి సీన్ కట్ చేయండి…
ఏదో ప్రోగ్రామ్‌లో యశస్వి పాడుతున్నాడు… పాట అయిపోయేలోపు ఓ యువతి గబగబా పరుగెత్తుకొచ్చి అలుముకున్నది… ఐ లవ్యూ అన్నది… అనుమతిస్తే అక్కడికక్కడే ప్రపోజ్ చేసి, పెళ్లి చేసుకుంటాను అనేసింది… షో అతిథులు, ప్రేక్షకుల్లో సైలెన్స్… ఆమె పేరు రీతూ చౌదరి… ఏదో ఓ అనామక సినిమాలో కూడా నటించిన, టీవీ నటి… ఇంకో ప్రోగ్రాం వెళ్దాం పదండి… అది జీతెలుగు కుటుంబం అవార్డులు…
Ads
ఈ అవార్డుల కార్యక్రమం పూర్తిగా జీతెలుగు ఇంటి ప్రోగ్రాం, వాళ్లలో వాళ్లు మెచ్చుకుని, దండలు వేసుకుని, ట్రోఫీలు ఇచ్చుకుని, వాళ్లకువాళ్లే చప్పట్లు కొట్టుకునే ఓ షో… అందులో ఈ పిల్లగాడు పాటపాడుతున్నాడు… ఈ రీతూ తన వెనుకే నిలబడి భంగిమలు పెడుతోంది, ఆడుతోంది… బెలూన్లు వదులుతోంది… వీడు నావాడే అనే ఫీల్ ప్రదర్శిస్తోంది… పాట కాగానే ‘నా యశ్శూ’కి ఓ సర్ప్రయిజ్ అంటూ… నేనే తీసుకొచ్చాను అంటూ… వెళ్లి ఆ పిల్లాడి తండ్రి, తల్లి, చెల్లిని వేదిక మీదకు లాక్కొచ్చింది…
సరే, అక్కడ ఓ ఉద్వేగ ప్రదర్శన… ఆ పేరెంట్స్ ఇద్దరూ గాయకులే… సోదరి సంకీర్తన కూడా గాయనే… వాళ్లకు ఓ సంగీతం ట్రూప్… ఈ పిల్లాడు కూడా అయిదేళ్ల వయస్సు నుంచే పాటలు నేర్చుకుంటూ, కీబోర్డు సాధన చేస్తూ… ఎంబీబీఎస్ చదువుతూ కూడా… బోలెడన్ని మ్యూజిక్ కాంపిటీషన్లలో పాల్గొనేవాడు, సొంతంగా ఓ యూట్యూబ్ చానెల్… ఊరు కాకినాడ… మంచి గళం, నిజంగానే మంచి భవిష్యత్తు కూడా ఉంది తనకు… ఆల్రెడీ శర్వానంద్, సమంత నటించిన జాను సినిమాలో ఓ హిట్ సాంగ్ కూడా పాడాడు… కానీ తనకన్నా తొమ్మిదీపదేళ్ల వయస్సెక్కువ ఉన్న ఈ రీతూ చౌదరితో ప్రేమ ఎంత మధురం..?
ప్రేమ గుడ్డిది… దానికి వయస్సుతో పనేముంది..? ఈ పిల్లాడికన్నా ఈ పిల్ల దాదాపు పదేళ్ల వయస్సెక్కువ… కులంతో పనేముంది..? ప్రాంతంతో పనేముంది..? కొండేపూడి అనే ఇంటిపేరు విశ్వబ్రాహ్మణుల్లో ఎక్కువ… తనది కాకినాడ… ఆమెది చిత్తూరు… రూట్స్ ఫ్రం విజయవాడ… ఆమధ్య సుమ, ప్రదీప్ యాంకరింగు చేసిన పెళ్లిచూపులు అనే ఓ అట్టర్ ఫ్లాప్ షో యాదికి ఉందా..? అందులో ప్రదీప్ కోసం ప్రయత్నించే కంటెస్టెంట్లలో ఈ రీతూ కూడా ఉందండోయ్…
మరో ట్విస్టు ఉంది…? పాత ప్రేమలతో కూడా పనేముంది అనుకోవాలా..? ఎందుకంటే, యశస్వికి ఆల్రెడీ శ్రీఝాన్సీ అనే ఓ లవర్ ఉన్నట్టు వెబ్ సమాచారం… ఐతేనేం… రీతూ ప్రేమకు అది అడ్డంకి కాదు… ఈ పిల్లాడు తన సొంతం అన్నట్టుగానే కమ్ముకుంటోంది ఆమె తనను… ఈ ప్రేమ ఎంత మధురం అనే టైటిల్ ఉన్నది చూశారా… అది చాలా పవర్ ఫుల్ బాసూ… అన్నట్టు జీతెలుగు కుటుంబం అవార్డుల సందర్భంగా ఆమె ఏమన్నదో తెలుసా..? ‘నా యశ్శూ… తనకు ఓ కుటుంబం ఉంది, ఈ జీకుటుంబం కూడా ఆశీర్వదిస్తే మాకూ ఓ కుటుంబం వస్తుంది…’’ అంటే..? తనను పెళ్లి చేసుకుంటావా పిల్లా..?! ఏం యశ్శూ… నీకూ వోకేనా..?!
Share this Article