చంద్రబాబు శుద్దపూస అని ఎవరూ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు… ఇవ్వనివ్వడు… దేశముదురు రాజకీయ నాయకుడు… నిమిషాల్లో తన స్టాండ్ మార్చుకునే అత్యంత విశ్వాసరహిత చంచల స్వభావి… తన నోట తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు అనే మాట వచ్చాక, మొదటిరోజు తన డప్పు మీడియా కూడా పెద్దగా పట్టించుకోలేదు…
సోషల్ మీడియా ఎప్పుడైతే రచ్చ చేస్తుందో అనివార్యంగా నేషనల్ మీడియా రంగంలోకి దిగింది… తప్పనిసరై ఇక ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎట్సెట్రా పత్రికలు, బాబు గారి టీవీలు, భజంత్రీలు కూడా ఇక మొదలుపెట్టేశాయి… (తిరుమల లడ్డూ అంటే అదేదో ఏపీ యవ్వారంలే అనుకుని తెలంగాణ పత్రికలు పెద్దగా ఫోకస్ చేయలేదు, ఫాఫం..)
మొదటిరోజు ఈ దుమారం ఊహించే సాక్షి భూమన, సుబ్బారెడ్డి సవాళ్లతో సహా చంద్రబాబు అసలు పన్నాగం ఇదీ అని ఎదురుదాడి స్టార్ట్ చేసింది, రెండోరోజూ కొనసాగించింది… తప్పదు, సహజం… సాక్షి కావచ్చు, వైసీపీ కావచ్చు… వాదనలేమిటీ అంటే..?
Ads
1 సోషల్ మీడియాలో కనిపిస్తున్న కేంద్ర ప్రభుత్వ లేబరేటరీ రిపోర్టు జూలై నెలలోనిది, మరి అప్పుడు చంద్రబాబే కదా అధికారంలో ఉంది, తన హయాంలోనే కదా నెయ్యి సప్లయ్ చేయబడింది, మరి జగన్ మీద బురద దేనికి..?
2. రాజకీయంగా జగన్‌ను దెబ్బతీయడంతోపాటు హెరిటేజ్‌కు నెయ్యి కంట్రాక్టు ఇవ్వడం కోసం ఈ దుష్ప్రచారం చేస్తున్నాడు…
ఆ రిపోర్టు ఎప్పటిది, పరీక్ష ఎప్పుడు చేయించారు అని కాదు… ఆ నెయ్యి ఎవరు సప్లయ్ చేశారు, ఎవరు కంట్రాక్టు ఇచ్చింది, ఆ నెయ్యి ఎప్పుడు వచ్చింది..? ఇవీ అసలు ప్రశ్నలు… ఈ లాజిక్ మిస్సవుతున్నారు చాలామంది… నందిని స్వయంగా చెబుతోంది, నాలుగేళ్లపాటు మేం సప్లయ్ చేయలేదు అని… మళ్లీ చంద్రబాబు వచ్చాకే నందిని సప్లయ్ మళ్లీ స్టార్టయింది…
తన హెరిటేజ్ కోసం ఈ కుట్ర అనుకునే పక్షంలో అత్యంత బలమైన పోటీదారు నందినిని ఎందుకు రానిస్తాడు చంద్రబాబు..? అసలు నందినిని పిక్చర్ నుంచి తప్పించింది ఎవరు..? ఈ దందాలు, ఈ అపవిత్ర పోకడల కోసమేనా..? కోట్ల మంది మనోభావాలు మనకెందుకు..? మన కోట్లు మనకు కావాలి గానీ, దేవుడుంటే కదా మనల్ని శిక్షించడానికి అనే భరోసాతో అక్రమాలకు పాల్పడ్డ బాధ్యులెవరు..? అది కదా తేలాల్సింది…
బాధ్యులు ఎవరో తేలాలి, అంతేతప్ప జగనే ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు అని ఎవరూ ఆరోపించడం లేదు కదా… తను నమ్మిన తిరుపతి ప్రాంత నాయకులా..? ట్రస్టు బోర్డా..? అధికారులా..? తప్పెవరు చేశారో తేలితే మంచిదే కదా, జగన్ కూడా ‘నేను రెడీ, సీబీఐ విచారణకూ సిద్ధమే’ అని ఓ మాటంటే దాని విలువ వేరే ఉంటుంది… కానీ తను బయటికి రావడం లేదు… తన పాలనలో హిందూయిజానికి ద్రోహం అనేక కోణాల్లో జరిగింది అనే విమర్శలకు ఈ లడ్డూ కొవ్వులు మరింత పెట్రోల్ పోసినట్టయింది…
లడ్డూ నాణ్యత కొన్నేళ్లుగా ఘోరంగా దెబ్బతిన్నదనేది నిజం… అందులో చంద్రబాబు పాలన తాలూకు పాపం కూడా ఉంది కదా… అబ్బే, టీటీడీ ఈవో స్వయంగా ఓన్లీ వనస్పతి కల్తీ ఉందని మాత్రమే చెబుతున్నాడు అని ఒక వెర్షన్… ఈ దుమారం ఊహించే కాన్ఫిడెన్షియల్ రిపోర్టు చంద్రబాబుకు ఇచ్చి, తను వనస్పతికి పరిమితమయ్యాడా..? చంద్రబాబు కూడా ఫ్లోలో వెల్లడించాడా..? లేకపోతే పొలిటికల్ దురుద్దేశాలు ఉన్నాయా..?
11 సీట్లకు పడిపోయి, వైసీపీ నాయకులంతా టీడీపీ, జనసేనల్లోకి క్యూ కడుతున్న వేళ… ఇప్పటికిప్పుడు చంద్రబాబుకు జగన్‌ను ఈ కోణంలో దెబ్బతీయాల్సిన సందర్భం, ఆశించే ఫాయిదా ఏముంది..? సో, అన్నీ ప్రశ్నలే… జవాబుల్ని వెంకన్న భక్తగణం ఆశిస్తే తప్పేమిటి..? ఉత్తరప్రదేశ్ హలాల్ సర్టిఫైడ్ అల్ఫా మిల్క్ కంపెనీకి కూడా నెయ్యి కంట్రాక్టులు ఇచ్చారట… అదేం వివాదమో ఇక… చివరగా…
(తమిళనాడులాగే మన తెలుగు రాష్ట్రాల్లోనూ వీరభక్తి ఎక్కువవుతోంది… మరీ మరీ… దేవుడు గీవుడు జాన్తానై… మన అభిమాన దేవుడు అనగా హీరో కావచ్చు, నాయకుడు కావచ్చు… ఈ దేవుళ్లకు మాత్రం నయాపైసా నష్టం జరగొద్దు… ఇమేజీపరంగా… మనకు ఈ దేవుళ్లే పవిత్రమూర్తులు… ఇదీ అసలు విషాదం…)
Share this Article