తిరుమలను నానా అపచారాల అడ్డగా మార్చిన పాత ఈవో అధర్మారెడ్డి చివరకు జర్నలిస్టులను కూడా బలిగొన్నాడా..? తిరుమల అరాచకాల్లో మీడియా పాత్ర ఏమిటి..? (కోలా లక్ష్మీపతి/ ఎడిటర్ / మాయావి న్యూస్) పేరుతో వాట్సప్ గ్రూపుల్లో ఓ స్టోరీ వైరల్ అవుతోంది… తను తిరుమల జర్నలిస్టే…
ఆ సుదీర్ఘమైన పోస్టులోని కొన్ని పాయింట్లు తీసుకుందాం… వీటిల్లో నిజానిజాల మాటెలా ఉన్నా, రేప్పొద్దున అత్యున్నత విచారణ కమిటీ గనుక వేస్తే అది ఈ అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలి… శాంతి హోమాలు, క్షమామంత్ర పఠనాలు కాదు… అసలైన ప్రక్షాళన ఏ దిశలో జరగాలో చంద్రబాబుకూ తెలియాలి కాబట్టి, చెప్పుకుందాం ఓసారి…
- అధర్మారెడ్డి తనకు అనుకూల డెయిరీకి టెండర్లు వచ్చేలా చేశాడు… నాణ్యత లేదని 16సార్లు తిప్పి పంపించిన నెయ్యి ట్యాంకర్లను మళ్లీ భారీ సిఫార్సులతో టీటీడీకి అంటగట్టారు… స్థానిక మీడియాకు ఈ వివరాలు తెలుసు…
- వైసీపీ బాకా మీడియాకు ఓ ప్రతినిధి ఉన్నాడు… ఈవోకు, చైర్మన్‌కూ సన్నిహితుడు… నాసిరకం నెయ్యి విషయంలోనూ పైరవీలు చేశాడు… టీటీడీ బదిలీల్లో కూడా చక్రం తిప్పేవాడు… ప్రభుత్వం విజిలెన్స్ విచారణ కూడా చేసిందట కానీ ఆ రిపోర్టు ఏమిటో తెలియదు…
- అధర్మారెడ్డికి అనుకూలురైన మీడియా ప్రతినిధులు దర్శన టికెట్ల పైరవీలు, డబ్బు సంపాదనలతోపాటు స్థానికుల ముసుగులో దుకాణాలు ఏర్పాటు చేసుకుంటూ ఈవో భజనలో తరించారు…
- మీడియా యాజమాన్యాలు వాళ్ల ప్రయోజనాల కోసం ఎవరిని పంపిస్తే వాళ్లకు ప్రత్యేక దర్శనాలు చేయిస్తారు అక్కడి మీడియా ప్రతినిధులు…
టీటీడీ అక్రమాలను, అవినీతిని బయటపెట్టిన కొంతమంది నిజాయితీగల జర్నలిస్టులపై అధర్మారెడ్డి అక్రమ కేసులు బనాయించాడు… పరకామణిలో రవికుమార్ అనే వ్యక్తి విదేశీ డాలర్లు దొంగిలిస్తూ, ఏళ్ళ తరబడి సాగించిన అక్రమాన్ని, అందులో ఐఏఎస్ ఐపీఎస్ ఇతర అధికారుల దారుణాలను వెల్లడించిన ఓ మీడియా ఛానల్ ప్రతినిధులపై అక్రమ కేసులు బనాయించారు…
Ads
దేవుడు సొమ్ము దిగమింగుతూ ఓ ప్రైవేటు హోటల్ యాజమాన్యాన్ని అక్రమంగా ఖాళీ చేయించి ఐదు కోట్ల రూపాయల టీటీడీ బకాయిలను వదిలేసిన అధికారుల వ్యవహారం ప్రచురించిన ఓ పత్రిక ఎడిటర్ పై అక్రమ కేసులను బనాయించి అన్ని విధాల వేధింపులకు గురి చేశారు. మరో ఇద్దరు జర్నలిస్టులపై గంజాయి కేసులను పెట్టారు. ఈ అక్రమ కేసును అవమానంగా భావించిన ఓ ఆంగ్ల దినపత్రిక విలేకరి కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు…
శ్రీవాణి ట్రస్టు పేరిట వందల కోట్ల గోల్‌మాల్ జరిగిందని పవన్ కల్యాణ్, చంద్రబాబు ఆరోపించారు కదా… అధర్మారెడ్డికి మద్దతుగా, టీడీపీ కూటమి ఆరోపణలన్నీ అబద్దాలు అని చాటడానికి ఓ ప్రయత్నం మీడియా వైపు నుంచి జరిగింది… తిరుపతి ప్రెస్ క్లబ్ నాయక ప్రతినిధి ప్రమేయంతో మీడియా ప్రతినిధులు నిజనిర్ధారణ కమిటీ పేరుతో ఏడుగురితో స్వయంగా ఓకమిటీని ప్రకటించుకున్నారు… అధర్మారెడ్డికి క్లీన్ చిట్ ఇవ్వడం కమిటీ ఉద్దేశం… కాగ్ రిపోర్టు తరహాలో ఓ క్లీన్ చిట్ కూడా ఇచ్చింది ఆ కమిటీ…
ప్రభుత్వం మంజూరు చేసే ఆక్రిడిటేషన్ కార్డులకు కూడా విలువ ఇవ్వకుండా… ఎంపిక చేసిన 26 మంది మీడియా ప్రతినిధులను మాత్రమే టీటీడీలో దర్శనాలకు సిఫార్సులకు అనుమతించేలా కింది స్థాయి పౌర సంబంధాల అధికారులకు లోపాయి కారీగా ఆదేశాలిచ్చాడు అధర్మారెడ్డి…….. ఇలా సాగిపోయింది ఆ వైరల్ వాట్సప్ పోస్టు… సీఎం చంద్రబాబు గారూ… ప్రక్షాళన తంతులో ఏం చేయాలో అర్థమవుతోంది కదా… ముందుగా దేవుడి సమక్షంలో గొట్టాలు పెట్టడాన్ని నివారించండి… ప్రత్యేక దర్శనాల్లో మీడియా విచక్షణ కోటాకూ పరిమితులు విధించండి…!!
Share this Article