నిమిషం నిడివి నుంచి వందల ఎపిసోడ్ల వరకూ రకరకాల కంటెంట్లతో కనిపించే ఓటీటీ వేదికలు… ఓవైపు కేంద్రం పలు ఆంక్షలు విధిస్తున్నా… విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించే సీరిస్ లను విడుదల చేస్తూనే ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్ వేదికగా వచ్చిన బాంబే బేగమ్స్ ఇప్పుడటువంటి వివాదాన్నే ఎదుర్కొంటోంది. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఛైల్డ్ రైట్స్ వెంటనే ఆ వెబ్ సీరిస్ ను ఆపేయాలని… యుక్తవయస్సుకెదిగే బాలబాలికలపై తీవ్ర ప్రభావాన్ని చూపే ఆ కంటెంట్ ను విడుదల చేయడానికి గల కారణాలను 24 గంటల్లోపు తెలపాలని నోటీసులు జారీ చేసింది. లేకపోతే… చట్టపరమైన చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది.
భార్యా, భర్తల మధ్య ఆధిపత్యపోరు… ప్రవర్తనలో తేడా కనిపించే తల్లుల పట్ల యుక్తవయస్సుకొచ్చిన పిల్లల వ్యవహారశైలి.. ఆడదానికి ఆడదే శత్రువయ్యే రీతి… ఇలాంటి అంశాలను సరిగ్గా ఆరు ఎపిసోడ్లలో పట్టిచూపే ప్రయత్నమే నెట్ ఫ్లిక్స్ బాంబే బేగమ్స్ డ్రామా. చాలాకాలం తర్వాత ఓ పవర్ ఫుల్ రోల్ లో దర్శనమిచ్చిన పూజాభట్ తో పాటు.. షహానా గోస్వామి, ప్లబితా బోర్తాకూర్, అమృతా సుభాష్ వంటి మహిళా నటులు ఇండియన్ కార్పోరేట్ విష వలయంలో చిక్కుకునే తీరును క్యాన్వాస్ కెక్కించే ఓ ప్రయత్నం. ఆ మహిళల ప్రభావం… ముఖ్యంగా ఇంట్లో తల్లి పోకడలు.. కార్పోరేట్ స్కూల్ కు వెళ్లినప్పుడు అక్కడి కల్చర్… ఇవన్నీ వెరసి యుక్తవయస్కురాలైన షాహీపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయనేవి చర్చించిన సీరిస్ ఇది. పితృస్వామ్యపాలనకు భిన్నంగా… పూర్తిగా మహిళాధిపత్యపు పోకడలతో… విభిన్నరకాల మనస్తత్వాల మహిళల సామాజిక, ఆర్థిక, లైంగిక అంశాలను చర్చిస్తూ డిఫరెంట్ షేడ్స్ ను ప్రతిబింబించేందుకు అలంకృత శ్రీవాత్సవ అనే దర్శకుడి రూపకల్పనే ఈ సీరిస్.
Ads
ఏ భగవద్గీత సత్సంగమో… ఏ వేద పారాయణమో జరుగుతోందంటే వెళ్లేవారి సంఖ్య కంటే… గల్లీలో చిన్న లొల్లైనా ఏం జరుగుతుందోనని ఎనలేని ఉత్కంఠతో కూడిన ఆసక్తిని కనబర్చే సమాజంలో… క్రైమ్, విచ్చలవిడితనం, అశ్లీలత, డ్రగ్స్, వయోలెన్స్ ను ప్రోత్సహించే విధంగా ఈ సీరిస్ ను తెరకెక్కించడమే ఇప్పుడు వివాదానికి ఓ ప్రధాన కారణం. ఇలాంటి విషయాలపై కనీసం ఎలాంటి స్వీయనియంత్రణ కూడా లేకుండా సీరీస్ ల పేరిట విడుదల చేయడమేంటన్నదే ఇప్పుడు ఎన్సీపీసీఆర్ నుంచి నెట్ ఫ్లిక్స్ యాజమాన్యానికి ఎదురవుతున్న ప్రశ్న? ఇదే విషయాన్ని నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఛైల్డ్ రైట్స్ ట్విట్టర్ ద్వారా కూడా నెట్ ఫ్లిక్స్ దృష్టికి తీసుకెళ్లే యత్నం చేయగా… శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు సమర్థించుకునేవారూ సోషల్ మీడియాలో కనిపించడం ఊహించే పరిణామమేగానీ… భిన్నమేమీ కాదు. ఆ జాబితాలో ప్రముఖ దర్శకులు కూడా ఉండటం… బాలల హక్కుల కమిషన్ అసలు తన పనేంటో మర్చి.. ఓటీటీల్లో షోస్ చూస్తోందా అంటూ ట్వీటడం.. దానికి కౌంటర్స్.. ఇదిగో ఇలా నడుస్తోంది నెట్ ఫ్లిక్స్ బాంబే బేగమ్స్ సీరిస్ వివాదం.
సమాజంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు… వార్తల రూపంలో ప్రచారంలోకొస్తున్న విషయాలు… లేక, నిజజీవిత కథలను
ప్రస్తావించాలన్న తపనతో… సమాజంలో కూడని అంశాలను తెరపైకి తేవడమే వివాదాలకు ప్రధాన హేతువనీ తెలిసినా.. ఈ వివాదాల చుట్టే ఇప్పుడు రేటింగ్స్, వ్యూస్, రెవెన్యూ ఇలా ఓటికోటి ముడిపడి ఉండటంతో… ఎంత వివాదమైతే అంత బెటరన్నట్టుగా తయారవుతున్నాయి మల్టీమీడియా వేదికలు. ఇదిగో ఇక్కడే నెట్ ఫ్లిక్ పై నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఛైల్డ్ రైట్స్ కొరడా ఝళిపించింది. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ యాజమాన్యం ఒక నివేదికను సమర్పించగా… మొత్తం సీరిస్ నే తొలగించాలన్న అభ్యంతరంపై మంగళవారంలోపు స్పందించాల్సి ఉంది. నెట్ ప్లిక్స్ లో వివాదాస్పదమైన సీరిస్ గా ప్రచారం జరుగుతున్న బాంబే బేగమ్స్ ఇప్పుడు మొదటిదీ కాదు… కాంట్రవర్సీసే అధికంగా చూడబడి, ఇష్టపడే రోజుల్లో ఆఖరిదీకాదు.. అయితే ఇదే విధానంలో అభ్యంతరాలు చెప్పాలనుకుంటే ఇప్పుడున్న పలు ఓటీటీ వేదికల్లో బోలెడంత కంటెంట్ కూడా కళ్లముందే లభ్యమవుతోంది. కానీ వివాదాస్పదమంటూ పతాకశీర్షికలకెక్కే అవకాశం మాత్రం నెట్ ఫ్లిక్సే కొట్టేయడం కొసమెరుపు…… By…. రమణ కొంటికర్ల
Share this Article