జనమంతా జాతిరత్నాలు సినిమా కోసం ఎగబడుతున్నారు… సూపర్ హిట్… దాంతోపాటు విడుదలైన గాలి సంపత్, శ్రీకారం వెనకబడిపోయాయి పోటీలో… జాతిరత్నాల్లో ఏమీ లేదు… ఫన్, సెటైర్, కామెడీ, నాన్ స్టాప్ ఎంటర్టెయిన్మెంట్… థియేటర్లో ఉన్నంతసేపూ నవ్వుకోవడమే… థియేటర్ నుంచి బయటికి వస్తే ఏమీ ఉండదు… బహుశా జనం ఇలాంటి వినోదం కోసమే మొహం వాచిపోయి ఉన్నారేమో… దిక్కుమాలిన కామెడీ ట్రాకులు చూసీ చూసీ.., వల్గారిటీ, బూతు లేని కామెడీని ఇష్టపడ్డారేమో… ఎహె, ఏముంది ఈ సినిమాలో అని లైట్ తీసుకున్నవాళ్లూ బోలెడు మంది… లోకోభిన్నరుచి… సరే, వాటిని వదిలేస్తే మరో రెండు సినిమాలు కూడా విడుదలయ్యాయి… ఒకదాని పేరు లవ్ లైఫ్ అండ్ పకోడీ… రెండోది రాబర్ట్… ఈ రాబర్ట్ జోలికి పోకండి… నలిపేస్తాడు… ఇక లవ్ లైఫ్ అండ్ పకోడీ గురించి చెప్పుకోవాలి ఓసారి… ఎందుకంటే..? కొందరికి ఇది న్యూఏజ్ సినిమాగా కనిపిస్తుంది… చాలామందికి విశృంఖలత్వంగా కనిపిస్తుంది కాబట్టి…
పెళ్లి అంటే ఓ లైఫ్ లాంగ్ అగ్రిమెంట్… అదీ పడక సుఖం కోసం… అంతేనా..? మరి ఆమాత్రం దానికి ఆ బంధనాల్లో చిక్కుకోవడం దేనికి..? నచ్చినవాడితో లేదా నచ్చినదానితో సుఖిస్తే సరిపోదా..? జస్ట్, నచ్చినన్ని రోజులు… పార్టనర్ నుంచి ఆ పడక సుఖం దొరికినన్ని రోజులూ ఎంజాయ్… శృతి కలవకపోతే మరో పార్టనర్… జస్ట్, పడక మారుతుంది… అంతే కదా…. సో, సహజీవనమే బెటర్… మొగుళ్లు, మగాళ్ల ఆధిపత్యం నుంచి విముక్తి అని మహిళ అనుకోవచ్చు… బాధ్యతల బాదరబందీ దేనికిలే అని పురుషుడు అనుకోవచ్చు……… ఏమిటీ పిచ్చి వాదన..? వింటుంటేనే కంపరంగా ఉంది అంటారా..? ఈ సినిమా దర్శకుడు గాలి జయంత్ సహజీవనం, ప్రిమారిటల్ శృంగారం తదితర అంశాల్ని సినిమా కథగా తీసుకోవడం వరకూ ఓ ప్రయోగమే… అలాంటి సబ్జెక్టులకు చాలామంది వెళ్లరు… కానీ పెళ్లి తాలూకు మార్మిక లోతుల్లోకి వెళ్లలేక చివరకు చేతులెత్తేసినట్టు అనిపించింది… ఎంతసేపూ తనకు తెలిసినదాన్ని డైలాగుల్లో వినిపించడానికి నానా ప్రయాసపడ్డాడు తప్ప… పెళ్లిని తనే అర్థం చేసుకోలేదేమో అనిపిస్తుంది సగటు ప్రేక్షకుడికి…
Ads
నిజానికి సహజీవనాన్ని, ఇప్పటితరం యువత ఆలోచనల్ని దర్శకుడే సరిగ్గా అర్థం చేసుకోలేదేమో… సినిమాలో ఓ యువతి… ఆల్రెడీ ఒకడితో బ్రేకప్, అబార్షన్… ఓ యువకుడు… ఆల్రెడీ పలు బ్రేకప్పులు… అనుకోకుండా వీళ్లిద్దరి పరిచయం… కలుస్తారు… వాళ్లకు సహజీవనం అంటే… కలిసి జీవించడం అంటే… నిరంతరమూ పడక సుఖం ఆలోచనలే… గంజాయి దమ్ము కొడతారు… మందు తాగుతారు… స్వేచ్ఛాజీవనం… ఓ తల్లి కూడా బ్రేకప్పు బ్యాచే… మొత్తం పాత్రలన్నీ ఆ టైపే అన్నమాట… నిజంగా ఇప్పటి యువత మొత్తం అదే పంథాలో ఉందా..? ఇది ఓ తప్పుడు భావన… సహజీవనం జాగ్రత్తలు తెలుసు అందరికీ… ఇప్పటి జనరేషన్ చాలా ఫాస్ట్… అదేసమయంలో చాలా ప్లాన్డ్… మెటిక్యులస్… కానీ ఈ సినిమాలో పాత్రలు అలా ఉండవ్… పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు ఓచోట హీరోయిన్ అంటుంది… ‘‘ఏం..? జీవితాంతమూ నీతోనే పడుకోవాలా..?’’ ఈ ఒక్క డైలాగుతో అర్థమైంది కదా సినిమా ఏమిటో..?
నిజానికి పెళ్లి అంటే..? అదొక కమిట్మెంట్… పడక కేవలం ఆ సుఖం కోసమే కాదు… ఆ పడక పిల్లల్ని కంటుంది… పెంచుతుంది… ప్రేమిస్తుంది… బాధ్యతల్ని పంచుతుంది… రోగమొస్తే సేవలు చేస్తుంది… అమ్మలా ఆదరిస్తుంది… ఆలిలా అలరిస్తుంది… జీవనం తాలూకు బరువులు మోస్తుంది… భరోసాగా నిలుస్తుంది… వాట్ నాట్… అన్నీ…! కాకపోతే ఆ ఇద్దరి నడుమా ఆ అవగాహన సరిగ్గా ఉంటేనే…! చాలా సంక్లిష్టమైన సబ్జెక్టును ఎన్నుకోవడం… కాస్త బోల్డ్ సీన్ల మోతాదు, విచ్చలవిడితనం భావనలు అధికంగానే ఉన్నా సరే… తను అనుకున్నది, తను నమ్మిందేదో చెప్పడానికి దర్శకుడు ఓ ప్రయాసపడ్డాడు… దానికి అభినందించొచ్చు… అందరికీ నచ్చాలని లేదు, నచ్చవచ్చు కూడా… కాకపోతే తన ఆలోచనల పరిధిని ఇంకాస్త విశాలం చేసుకుని, ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే బాగుండు అనిపిస్తుంది ప్రేక్షకుడికి… అంతే… అయితే ఇలాంటి సబ్జెక్టులు ఓ రెండు గంటల సినిమా వ్యవధిలో అర్థవంతంగా ఆవిష్కరించడం కష్టం… సబ్జెక్టు విస్తృతి పెద్దది… మనమున్న సమాజం, మన కుటుంబవ్యవస్థకు అంత త్వరగా జీర్ణం కాబోదు కూడా…
చివరగా ఈ హీరోయిన్ గురించి… సంచిత పూనాచా… మనకు సంచిత పడుకోన్, సంచిత శెట్టి తెలుసు… కానీ ఈమె సంచిత పూనాచా… హఠాత్తుగా చూస్తే నిత్యా మేనన్ ఫీచర్స్ కనిపిస్తాయి… అంతేకాదు, నిత్యాలాగే మంచి నటి కూడా… అందం ఉంది, మెరిట్ ఉంది… ఇంకేమైనా అవకాశాలు దొరికితే తనను తాను ప్రూవ్ చేసుకునేట్టుగానే ఉంది… బోల్డ్‌గా నటించడమే కాదు… పలు సీన్లలో తన ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంటుంది… కాకపోతే పాత్రల ఎంపికలో కాస్త జాగ్రత్త అవసరం… అన్నీ ఇలాంటి కేరక్టర్లే వచ్చాయనుకొండి… కష్టం… అసలే ఇండస్ట్రీ సంగతి తెలుసు కదా… ఎముకలోని మూలుగను కూడా పీల్చేసినట్టు, పీల్చేసి, పిండేసి… మక్కీచూజ్ అనే బాపతు…!! ఈ సినిమా పేరులో ఉన్నట్టు… పెళ్లంటే లవ్వు, లైఫు… జస్ట్, టైం పాస్ పల్లీ పకోడీ కాదు…!!
Share this Article