నిజానికి పవన్ కల్యాణ్ తప్పు వీసమెత్తు కూడా లేదు… తప్పు చేసింది, శరం తప్పిందీ బీజేపీయే..! ఈ మాట కటువుగా ఉన్నా అదే నిష్ఠురసత్యం… ప్రత్యేకించి తెలంగాణ బీజేపీ విషయంలో అంతే…! పవన్ కల్యాణ్ వైఖరి చూసి బీజేపీ నాయకులకు మూర్ఛ వచ్చినంత పనైంది… ‘‘జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు తెలంగాణ బీజేపీ మమ్మల్ని అవమానించింది… సో, మేం టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి మద్దతు ప్రకటిస్తున్నాం’’ అనేశాడు చాలా ఈజీగా… కావల్సిందే… బీజేపీకి కావల్సిందే… శాస్తి జరగాల్సిందే… పవన్ కల్యాణ్ రాజకీయ పరిణతి ఏమిటో ఎందుకు అంచనా వేసుకోలేకపోయంది బీజేపీ..? అసలు ఏం ఆశిస్తోంది తనతో స్నేహం ద్వారా…! మొదట్లో టీడీపీ ప్లస్ బీజేపీ ప్లస్ పవన్ కల్యాణ్… తరువాత ప్యూర్ చంద్రబాబు దోస్త్… తరువాత లెఫ్ట్, బీఎస్పీ… మళ్లీ ఇప్పుడు బీజేపీ… తన ఐడియాలజీ ఏమిటి అసలు..? తన కన్సిస్టెన్సీ ఏమిటి..? తన వ్యవహారధోరణి ఏమిటి..? పవన్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో రాజ్యాధికారం దక్కించుకోవాలనుకుందా బీజేపీ..? ఫాఫం…
బండి సంజయ్ పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి కలిసినప్పుడే… పవన్‌తో బీజేపీ దోస్తానా అన్నప్పుడే తెలంగాణలోని బీజేపీ అభిమాన గణానికి చివుక్కుమంది… తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడిన ఓ ఆంధ్రాపార్టీని భుజాన మోసి, పార్టీ సాధించేది ఏమిటి అనే అసంతృప్తి కనిపించింది… సరే, టీఆర్ఎస్ వంటి పార్టీయే తెలంగాణ పాత వ్యతిరేకుల్ని చేరదీస్తోంది… సెటిలర్స్ వోట్ల కోసం అంగలారుస్తోంది… బీజేపీ చేస్తే తప్పేమిటి అంటారా..? సరే… ఏపీలో కులపంచాయితీలు కాబట్టి… రెడ్లకు వైసీపీ ఉంది, కమ్మలకు టీడీపీ ఉంది, సో, మనం కాపు స్టాండ్ తీసుకుందాం అని బీజేపీ అనుకోవచ్చుగాక… అది ఎంత రాంగ్ స్ట్రాటజీయో దానికే అర్థం అవుతుంది రానురాను… అగ్రవర్ణ పెత్తందారీ పెత్తనానికి బదులు బహుజన నాయకత్వం అనే స్టాండ్ తీసుకుంటే బీజేపీకి ఫ్లెచింగ్ ఉండేది… ఇప్పటికీ అదే సరైన ఆచరణ… సర్లెండి… అంతగా అర్థమైతే ఏపీలో పార్టీ ఇప్పుడీ దురవస్థలో ఎందుకుంటుందిలే గానీ దాన్నలా వదిలేద్దాం…
Ads
తెలంగాణలో ఎలాగూ సంజయ్, అరవింద్ తదితరులు కాపే కదా… ఇంకా ఆంధ్రా కాపు దేనికి..? సరే, ఏపీలో ఏదో కలిసి పనిచేయాలని అనుకున్నారు… అయినంతమాత్రాన తెలంగాణలో కూడా కలిసి పనిచేయాలని ఏముంది..? పవన్ కల్యాణ్‌ను భుజాన మోయాలని ఏముంది..? గ్రేటర్ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ బీజేపీ నుంచి ఏం ఆశించాడు..? బీజేపీ ఎలా అవమానించింది..? అసలు పొత్తు చర్చలు జరిగాయా..? ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పవన్ ఏం ఆశించాడు..? తెలంగాణలో జరిగే ప్రతి ఎన్నికకూ ఇక పవన్ ఆమోదం, తనతో చర్చలు, తనను శాటిస్ఫై చేయడం అవసరమా..? ఎందుకిలా సాగిలబడటం..? పోనీ, బీజేపీ మీద అసంతృప్తి ఉంది సరే, దాన్ని టాకిల్ చేసే విధానం తెలుసా తనకు..? స్నేహధర్మం ఏమిటో తెలుసా తనకు..? ఏ టీఆర్ఎస్ మీద బీజేపీ తెగబడి పోరాడుతున్నదో ఆ పార్టీకి బేషరతు మద్దతు ప్రకటించడం అంటే బీజేపీ చెంప చెళ్లుమనిపించినట్టే…! ఇన్నాళ్లూ తెలుగుదేశం తోక పట్టుకుని, రోజురోజుకూ క్షీణించిపోయి, తరువాత టీఆర్ఎస్ ప్రభావానికి గురై… ఇప్పుడిప్పుడే కాస్త తేరుకుంటున్న పార్టీ ఇప్పుడిక జనసేనకు తోకగా మారాలా..?
నిజానికి ఏపీలో కూడా ఆ స్నేహబంధమేమీ సరిగ్గా లేదు… హైకమాండ్‌కు నేనంటే గౌరవమే గానీ ఏపీ బీజేపీ నాయకులే సరిగ్గా లేరంటూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తీకరిస్తున్నాడు పవన్… మొత్తానికి తెలంగాణ వాణిదేవికి జనసేన మద్దతు ఈ స్నేహం నడుమ చిచ్చు రగిల్చే సూచనలే కనిపిస్తున్నయ్… కలిసి పనిచేసే సీన్ ఇక కనిపించడం లేదు… ఏమాటకామాట… గెలుపో ఓటమో జానేదేవ్… పురపాలక ఎన్నికల్లో చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ తదితరులు విపరీతంగా తిరిగారు… ప్రచారం చేసుకున్నారు… కానీ బీజేపీ, జనసేన వైపు నుంచి ఏది..? ఒక స్ట్రాటజీయో, ఒక కార్యాచరణో కనిపించాయా అసలు..? అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే రెండు పార్టీల వోట్లూ ఎంతగా పడిపోయాయో అర్థమైందా బీజేపీ హైకమాండ్‌కు..? జాలి, నవ్వు పుట్టించింది ఏమిటంటే..? జనసేన సపోర్ట్ లేకపోతే సాగర్ ఉపఎన్నికలో నష్టం జరుగుతుందట, పార్టీ జాతీయ నేతల ద్వారా పవన్‌తో సమాలోచనలు జరిపించి, ఇష్యూ సెట్ రైట్ చేయిస్తారట… నిజమే… పవన్‌కల్యాణ్ తప్పేమీ లేదు… బీజేపీకి ఈ శాస్తి జరగాల్సిందే… వినడానికి కటువుగా ఉన్నా ఇదే నిష్ఠురసత్యం…
Share this Article