Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓ సాదాసీదా మూస కథకు మల్లెమాల మార్క్ ట్రీట్‌మెంట్…

October 22, 2024 by M S R

సోగ్గాడు శోభనాద్రి లాంటి సినిమా ఈ నాయుడుబావ సినిమా . ప్రముఖ నిర్మాత , దర్శకుడు , కవి మల్లెమాల యం యస్ రెడ్డే 1978 లో వచ్చిన ఈ సినిమాకు నిర్మాత , దర్శకుడు , మాటల పాటల స్క్రీన్ ప్లే రచయిత . కధ రొటీనే అయినా ఆయన బాణీలో ఆయన తీసారు .

ఓ కోటీశ్వరుడయిన తాతగారు , ఆయనకో ముద్దుల మనమరాలు , ఆస్తి మీద హీరోయిన్ మీద కన్నేసిన ఓ విలన్ మామయ్య , తాతగారు అర్జెంటుగా పెళ్ళి చేసుకోవాలని మారాం చేయటం , దొంగ ప్రియుడుగా నాయుడుబావని ప్రవేశపెట్టడం , తర్వాత పెళ్ళి అవటం , నాయుడుబావ మరదలు బావ దగ్గరకు చేరటం , విలన్ అందరినీ ఆస్తి కోసం బంధించటం , నాయుడుబావ అందరినీ విలన్ని ఉతికే క్రమంలో తాతగారి మనుమరాలు చనిపోవటం , చనిపోతూ బావామరదళ్ళను కలిపి తన బిడ్డను అప్పచెప్పటం . ఇదీ కధ టూకీగా .

ఇలా దొంగ మొగుడ్స్ , దొంగ ప్రియులు ప్రవేశపెట్టబడటం చాలా సినిమాలలో చూసి ఉంటాం . యం యస్ రెడ్డి గారు సీతయ్య లాగా ఎవరి మాటా వినరు అని అంటారు . తన బాణీలో తాను తీసారు . శోభన్ బాబు అభిమానులను బాగా హుషారు పెట్టిందని గుర్తు . సోగ్గాడు సినిమాలాగా కనకం కురియలేదు .

Ads

శోభన్ బాబు , ఆయన మరదలుగా జయప్రద , తాతగారి మనుమరాలిగా జయసుధ , తాతగారిగా సత్యనారాయణ , విలన్ మామయ్యగా మోహన్ బాబు , విలన్ శకునిగా సాక్షి రంగారావు , ఇతర పాత్రల్లో రాజబాబు , నిర్మలమ్మ , మా గుంటూరు కళాకారుడు జయప్రకాష్ రెడ్డి , ప్రభృతులు నటించారు .

సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవలసింది మల్లెమాల మాటలు , పాటలు . శోభన్ బాబు నటించిన హిట్ సినిమా పేర్లతో ఒక పాట ఇంటరెస్టింగుగా ఉంటుంది . నా పేరే హడల్ అని పాట పాడుతూ క్లైమాక్సులో విలన్ గేంగుని చితగ్గొట్టడం వెరైటీగా ఉంటుంది . నెల్లూరి చేలలో పిల్లగాలికి ఊగే వరి వెన్నులాంటిది మల్లి సొగసు పాట సాహిత్యం , శోభన్ బాబు , జయప్రదల డాన్స్ అందంగా ఉంటాయి . ఇది మల్లెమాల మార్కు పాటే .

ఇలాంటిదే మరో మల్లెమాల మార్క్ పాట కూడా ఉంది . శోభన్ బాబు , జయమాలినిల మీద ఉంటుంది . ఎ బి సి డి ఎక్స్ అంటూ జయమాలిని మోడరన్ డాన్సుతో మొదలయి , శోభన్ బాబు మన తెలుగు నేల గొప్పతనాన్ని , మన సంస్కృతిని వివరించే పాటతో ముగుస్తుంది .

హీరోని హీరోయిన్ , హీరోయిన్ని హీరో టీజ్ చేసే ఢీ డిక్కుం ఢీ ఢీ పాట హుషారుగా ఉంటుంది . హరిహరి నారాయణ , పాలూ చక్కెర కలిసాయి ఆలూమగలై వెలిశాయి , దిక్కుల్లో మొదటిది తూరుపు దిక్కు దిక్కు లేని వారికి దేవుడే దిక్కు పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి .

జయసుధ ఓ కీచకుడితో కారుతో ఫైట్ చేయటం , శోభన్ బాబు సైకిలుతో ఫైట్ చేయటం , పాట పాడుతూ విలన్ని , అతని గేంగుని చితగ్గొట్టడం ఈ సినిమాలో ప్రత్యేకతలు . శోభన్ బాబుకి హడల్ అనే పేరుతో ఓ మారు వేషం కూడా ఉంటుంది . సినిమా యూట్యూబులో ఉంది . శోభన్ బాబు అభిమానులు చూడనివారు ఉంటే చూడవచ్చు . చూడబులే . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు    (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాపూర్ కేసు ! కేసీయార్ పట్టించుకోలేదు- రేవంత్ చేసి చూపించాడు !!
  • ‘అన్యమతస్తులు ఎంతటివారైనా సరే… ధ్వజస్థంభం దాటడానికి లేదు…’
  • వారణాసి OTT బిజినెస్… జక్కన్న మరో మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడా ?
  • శ్రీదేవి బిడ్డకు తత్వం బోధపడిందట ! తప్పు జరిగిందని ఒప్పుకోలు !!
  • కొంపదీసి సీతమ్మ కిడ్నాప్ లోకకల్యాణం కోసమేనని చెబుతారా ఏం?!
  • అమెరికాలో ‘హ్యూమన్ కంపోస్టింగ్’… గుర్తొస్తున్న వీరశైవుల అంత్యక్రియలు!
  • టైమ్ లూప్‌లో చిక్కుకున్న కథనం… నవ్వించాలని నీరసపరిచే కామెడీ !
  • హాలోవీన్ కోలాహలం… అమెరికా మొత్తాన్ని ఆత్మలు ఆవహిస్తాయి!
  • గురువులు, విజ్ఞులు దయచేసి ఈ ధర్మసందేహాలు తీర్చగలరు…
  • సుమో దీదీ… అసాధారణ క్రీడాకారిణి కథకు శ్రియమ్ భగ్నానీ ప్రాణం!! 

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions