…….. By….. Gurram Seetaramulu ………………. దొంగ లంజడి కొడకా ? !!
“వారసత్వ శాస్త్రాల్లో తల్లికూడా పుల్లింగమే మరి ! శీల రాజకీయాల్లో నేను లంజా కొడుకునే గానీ లంజడి కొడుకుని కాదు కదా” అంటూ తన ‘తల్లి రాయని వీలునామాలో’ ప్రసేన్ భాషా రాజకీయాలలో తిష్టవేసిన భారత దేశ సంస్కృతీ పరిరక్షణ నాటక సమాజాన్ని నడి బజార్లో నిలేసాడు.
నువ్వే లంజడివిరా అన్నాడు చండీదాసు…
ఇప్పుడు వేణు తన విరాట పర్వాన్ని లంజడి కొడకా అని మరో అడుగు ముందుకు వేసాడు. తెలుగు తెర ఇలాంటి చర్చలకు భయపడుద్ది. తెలంగాణ సినిమాకు అలాంటి ఇబ్బంది లేదు.
నిన్న విడుదల అయిన విరాటపర్వం టీజర్ పవర్ పాక్డ్గా అనిపించింది. తెలంగాణ అవిర్భావం తెలంగాణ భాషకూ మట్టి గోసకూ పాలక పక్షాలు ప్రాణం పోయక పోయినా, ఇక్కడి సృజన శీలురు ఆ పని బలంగా నెత్తికి ఎత్తుకున్నారు… తెలంగాణ మట్టి పొరల్లో అనామకంగా మిగిలిపోయిన వేలాది రాగో ల జీవితాలు సెల్యులాయిడ్ ఎక్కితే ప్రపంచ సినిమా తన చూపు ఈ నేల మీదికి సారించగల పోరాటాలు త్యాగాలు ఇక్కడ ఉన్నాయి.
ఈ దేశంలో వలస పాలన మార్పిడి జరిగాక ఏర్పడిన నయా భూస్వామ్యం కొన్ని మౌళిక ప్రశ్నలకు జవాబులు చెప్పలేక పోయింది.
ఆ మార్పిడీ ఒక దశలో కేవలం భూమి మరొక దశలో స్వాభిమాన అంశాలు ముందుకు తెచ్చింది.
పాలక పక్షం నామమాత్రంగా తెచ్చిన భూ సంస్కరణల కన్నా యాభై, నుండి డెబ్భై , యనభయ్యో దశకం దాకా విప్లవ రాజకీయాలు జల్, జమీన్, జంగ్ ద్వారా తెచ్చిన మార్పు అసామాన్యమైనది.
ఉత్తర, దక్షిణ తెలంగాణలో భూస్వామ్యాన్ని తరిమి కొట్టిన తర్వాత నగరాల బాట పట్టిన ఫ్యూడల్ శక్తులు మలివిడత తెలంగాణలో నగరం నుండి మళ్ళీ పల్లెల దారి పట్టాయి.
అవి మిగిల్చిన సంక్షోభాలు ఎన్నో.
ఇంకో సందర్భంలో మాట్లాడుకుందాం.
ఇన్ని ఉత్పాతాలు చూసిన తెలంగాణ ఎన్నో సమస్యలకు పరిష్కారాలు చూపినా మహిళా స్వాభిమాన అంశంలో జరిపిన చర్చ తక్కువనే అనుకోవచ్చు. జనతన సర్కార్ లో మహిళల స్వాభిమాన ప్రకటన గొప్పది. కానీ మైదాన ప్రాంత సంక్షోభాలే అనేక మంది ‘రాగో’ లను సృష్టించింది. చిక్కుముడి లాంటి ఇక్కడి అనేక ప్రశ్నలకు సమాధానాలు వెతుకులాటలే ఎంతో మంది రాగోలు తమ గమ్యం గమనం ఏంటో తేల్చుకున్నారు.
తొంభై ల మొదలు కింది కులాల భావోద్వేగాలను హైజాక్ చేసిన స్త్రీవాదం స్థానే వికసించిన ‘మట్టిపూలు’ స్త్రీవాదం పేరుతో చలామణి అవుతున్న ఆధిపత్య చర్చను భూమార్గం పట్టించాయి. రాగోలు, బెల్ హూక్స్ లు ఇంటా బయటా పితృస్వామిక భావజాలం మీద అలుపెరగకుండా పోరాటం చేస్తున్నారు వాళ్ళు ఆకాశంలో అవకాశాల్లో సగం అని నినదించినవి.
ఉప్పొంగిన అడవి, వాగులు, వంకలు, చెలకలు ఆమె నడకకు సాగిలపడ్డవి.
విరాటపర్వం సినిమా మొదలైన రోజు నుండి ఇవే ప్రశ్నలు నాలో…
దండకారణ్యంలో కూర్చున్న
ఈ సరోజ కథ ఏమయి ఉంటది ?
అమాయకంగా అడవిలో తప్పిపోయి
ఏ వెలుగుల కోసం ఈ రాగో వెతుకుతోంది?
ఏ సంక్షోభ అవశేషం తను ?
ఏ తప్పిపోయిన సమాధానాల కోసం ఎదురు చూస్తోంది ?
ఏ ప్రశ్నలు సంధించిన బాణం తను ?
అసలు ఆమె ప్రయాణం ఎటు ?
అరణ్య కాండ అరణ్య నడిపిన ప్రత్యామ్నాయ రాజకీయాలు ఈ మానవ వికాసానికి ఎలా తోడ్పడబోతున్నాయి ?
మా వేణు ఈ రాగోతో ఏ సందేశం ఇవ్వబోతున్నాడు అంతు చిక్కని
చిక్కు ప్రశ్న …
Share this Article