కంటెంటులో కొత్తదనం… కథనంలో ప్రయోగం… నిర్మాణంలో సాహసం… తొక్కాతోలూ ఏమీ అక్కర్లేదు ఇప్పుడు… థియేటర్ దాకా వెళ్లాలంటే అది రెండు గంటలపాటు నవ్వించి, ఎంటర్టెయిన్ చేయాలి… పెట్టిన టికెట్టు ధరకు న్యాయం జరగాలి… లేకపోతే ఈ కాలుష్యంలో, ఈ ట్రాఫిక్ జాముల్లో, ఇంతలేసి పెట్రోల్ ధరల్లో, ఆ క్యాంటీన్-పార్కింగ్ దోపిడీల్లో థియేటర్‌కు వెళ్లి ఎవడు చూస్తాడు సినిమా..? నాలుగు రోజులు ఆగితే ఏదో ఓటీటీలో కనిపిస్తే, ఎంచక్కా ఇంట్లోనే టీవీ ముందు కూర్చుని చూడలేమా ఏం..? అప్పటికప్పుడు ఆమ్లెట్లు, పకోడీలు, మిర్చి బజ్జీలు వేసుకుంటూ, తింటూ చూడలేమా ఏం..? కాదంటే మరో వారం పదిరోజులు ఆగితే సరి… ఏదో దిక్కుమాలిన చానెల్లో వేసేస్తారు… కాకపోతే కక్కుర్తిగాళ్లు ఎడాపెడా యాడ్స్‌తో కుమ్మేస్తారు… ఇదే కదా చాలామందిలో పెరుగుతున్న ఫీలింగు..? ఖచ్చితంగా ఇదే… సో, ప్రస్తుతం జనం థియేటర్ వెళ్లాలంటే వాళ్లకు వినోదం కావాలి… అది జబర్దస్త్ మార్క్ కామెడీ అయినా సరే వెళ్లడానికి రెడీ… ఈమధ్యలో విడుదలైన సినిమాల కథే తీసుకుందాం…
ఆమధ్య విడుదలైన వాటిలో ముఖ్యమైని జాతిరత్నాలు, గాలిసంపత్, రాబర్ట్, శ్రీకారం అనుకుందాం… మిగతా సినిమాలను కాసేపు పక్కన పెట్టేయండి… వాటిల్లో రాబర్ట్ ఫిట్ ఫర్ నథింగ్… దాన్ని కూడా కొట్టేసేయండి… టీవీ, ఓటీటీల్లోనే దానికి పెద్ద స్కోప్ లేదు… గాలి సంపత్ సినిమాకు కొన్ని పాజిటివ్ రివ్యూలు వచ్చినా సరే ప్రేక్షకులకు అది ఎక్కలేదు… దర్శకుడు రావిపూడి అనిల్ డబ్బులు పెట్టి, నేల విడిచి సాము చేశాడు… ఆ ఫఫాఫిఫీ అనబడే ఫ గుణింతం అడ్డగోలుగా ఎదురుతన్నింది… ప్రధానలోపం రాజేంద్రప్రసాద్ నటన నేచురల్‌గా లేకపోవడం, కృతకంగా అనిపించడం… మంచి నటుడే కానీ నటనలో జీవిస్తున్నట్టుగా ఒకటే శ్రమపడిపోతాడు… ఇక మిగిలింది శ్రీకారం… ఎస్, శర్వానంద్ మంచి నటుడు… కానీ అదొక్కటే సినిమాను నిలబెట్టదు… ప్రేక్షకుడికి ఏదో కొత్తగా కనెక్ట్ కావాలి… అది థియేటర్ దాకా లాగాలి… అందులో శ్రీకారం సినిమా ఫెయిలైంది… మరీ తీసిపారేయలేదు గానీ అంతంతమాత్రమే… లవ్, లైఫ్ అండ్ పకోడీ సినిమా కూడా పెద్దగా జనంలోకి పోలేకపోయింది… ఈ సినిమాకు పెద్దగా థియేటర్లు కూడా దొరకనట్టుంది… కారణం తెలియదు… తెలుగు సినిమా డిస్ట్రిబ్యూషన్ కమ్ థియేటర్ మాఫియా నుంచి ఏమైనా ఇబ్బందులేమో బహుశా… ఇక ఈరోజు విడుదలైనవి మూడు ముఖ్యమైనవి… చావు కబురు చల్లగా… శశి… మోసగాళ్లు…
Ads
చావు కబురు చల్లగా సినిమా అనుకున్నంతగా వర్కవుట్ కాలేదు… స్వర్గరథం డ్రైవర్ హీరో… కార్తికేయ… పిల్లలవార్డులో పనిచేసే హీరోయిన్… హీరోకు ఈ చావులంటే కేర్లెస్నెస్… హీరోయిన్‌కు ప్రతి పుట్టుక వాల్యుబుల్… ఆమె భర్తను కోల్పోతుంది… రోదిస్తున్న ఆమెను చూసి హీరో మనసు పారేసుకుని, ఇక లైనేస్తుంటాడు… వెంటపడుతుంటాడు… అక్కడ యాంటీ-సెంటిమెంట్… ప్రేక్షకుడికి చిరాకు పుట్టేస్తుంది… దీనికితోడు హీరో తల్లి ఆమని… ఆమెదీ మరో అక్రమబంధం బాపతు కథ… దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో ఓపట్టాన అర్థం కాదు… మధ్యలో వైరాగ్యాన్ని మోసుకొచ్చే ఓ ఐటం సాంగ్… నీరసపడిపోయిన ప్రేక్షకుడు ఈసురోమంటూ ఇల్లు చేరడమే… కొన్ని ఫన్నీ సీన్లు, ఒకటీరెండు మంచి బరువైన డైలాగ్స్ సినిమాను నిలబెట్టడం కష్టం… ఫాఫం లావణ్య త్రిపాఠీ… ఈమె కెరీర్ కూడా క్రమేపీ ముగింపుకొస్తున్నట్టే కొడుతోంది…
ఈ మంచు మోహన్‌బాబు రూటే కాదు… పిల్లల రూటు కూడా సపరేటు… ‘‘నా మార్కెట్ వాల్యూను మించి ఖర్చుపెట్టాను, కథలో దమ్ముంది’’ అన్నాడు నిర్మాతగా కూడా మారిన మంచు విష్ణు… పైగా కెరీర్ అయిపోతున్న దశలో ఉన్న వెటరన్ కాజల్… సునీల్ శెట్టి ప్లస్ ఓ ఇంగ్లిషు దర్శకుడు జెఫ్రీ గీ చిన్… అబ్బో, అంత దమ్మున్న కథ ఏమటబ్బాా అనుకుని థియేటర్ వెళ్తే దబదబా బాదేశాడు… నిజమే… ఓ కొత్త తరహా సైబర్ మోసాన్నే తీసుకున్నారు… కానీ ప్రజెంటేషన్ ఆ స్థాయిలో లేదు… ప్రేక్షకుడు థ్రిల్ ఫీలయ్యే రేంజ్ కనిపించలేదు… ఈమాత్రం దానికి జెఫ్రీ గీ చిన్ అవసరమా, అది కూడా మంచు విష్ణు చేసేస్తే సరిపోయేది అనిపిస్తుంది… ఫాఫం నవదీప్… తనకూ ఓ పాత్ర ఉందిలెండి… చూస్తే జాలేస్తుంది… ఇంతకుమించి ఈ సినిమాకు రివ్యూ కూడా అవసరం లేదు… సాంగ్స్ లేకపోవడం రిలీఫే అయినా… మరీ ఎంటర్టెయిన్మెంట్ వాటా లేకపోవడం సినిమాకు మైనస్… ముందే చెప్పుకున్నాం కదా… ప్రేక్షకుడు థియేటర్ దాకా రావాలంటే అది ఓ రేంజ్లో కనెక్టయ్యేలా ఉండాలి, ఎంటర్టెయిన్ చేయాలి…
ఆది సాయికుమార్ కెరీర్ ఓ అంతులేని ఫెయిల్యూర్ స్టోరీ… అది కొనసాగుతూనే ఉంది… ఇప్పుడు తాజాగా శశితో ముందుకొచ్చాడు… పాపం దర్శకుడు, హీరో, హీరోయిన్ గట్రా అందరూ బాగానే కష్టపడ్డట్టు కనిపిస్తుంది… కానీ ఓ రొటీన్ లవ్ స్టోరీ… అదీ పెద్దగా ఎమోషన్స్ లేకుండా ప్లాటుగా నడవడం పెద్ద మైనస్… పైగా స్లో… ఏదో ఓ సాదాసీదా సినిమాను మరోసారి చూస్తున్నట్టు అనిపించడమే తప్ప కొత్తదనం కనిపించదు… కామెడీ పెద్దగా వర్కవుట్ కాకపోవడంతో సినిమా వీక్ అయిపోయింది… పోనీ, ఆ ప్రేమకథయినా బలంగా ప్రేక్షకులకు ఎక్కించగలిగారా అంటే అదీ లేదు… వెరసి అంతంతమాత్రమే అయిపోయింది… సో, ఇలా కొత్త మూడు సినిమాలు పెద్దగా పోటీకి నిలబడకపోవడం జాతిరత్నాలు సినిమాకు బాగా కలిసొస్తుంది… ఇప్పటికే హిట్ టాక్ వచ్చింది కదా… ఈ వసూళ్లు మరో మంచి బలమైన సినిమా వచ్చేదాకా కొన్నాళ్లు కంటిన్యూ అయ్యే చాన్సుంది… డబ్బులు పెట్టిన నాగ్ అశ్విన్‌కు లక్కు… హీరోకు చెప్పనక్కర్లేదు… ప్రస్తుతానికి తెలుగు థియేటర్ అంటే… జై జోగిపేట…!!
Share this Article