ఒక వార్త ఎందుకో పెద్దగా తెలుగు రాజకీయాల్లో చర్చనీయాంశం కాలేకపోయింది… బహుశా ఏపీలో బీజేపీకి పెద్ద సీన్ లేకపోవడం వల్ల కావచ్చు… ఆ వార్త ఏమిటంటే..? బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఆ పార్టీని వదిలేసి, తిరిగి తన మాతృసంస్థ ఆర్ఎస్ఎస్లోకి వెళ్లిపోవడం… చాలా నిశ్శబ్దంగా… ఏదో ఒక ఆఫీసు నుంచి మరో ఆఫీసుకు బదిలీ జరిగినంత సాఫీగా జరిగిపోయింది… సరే, ఆర్ఎస్ఎస్ చెట్టుకు బీజేపీ కూడా ఒక శాఖే కదా… అయితే ఒక జాతీయ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి, అత్యంత కీలకమైన బాధ్యతల్ని నిర్వర్తించిన ఆయన ఇంత అకస్మాత్తుగా ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది… ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలోకి చేరడం సర్వసాధారణమే… కానీ బీజేపీ నుంచి ఘర్‌వాపసీ అనేది కాస్త అసాధారణం… ఎందుకంటే..? ఒకసారి పొలిటికల్ ఫ్రేమ్ వర్క్‌లోకి వచ్చాక, ఇక తిరిగి సంఘ్‌లోకి వెళ్లేవాళ్లు చాలా అరుదు… పైగా రాంమాధవ్ నిర్వర్తించిన పాత్ర బీజేపీలో చిన్నదేమీ కాదు…
ఏడేళ్ల క్రితం తను బీజేపీలో చేరుతున్నప్పటి ఫోటో ఇది… తరువాత వేగంగా ఎదిగాడు… ఆల్రెడీ ఆర్ఎస్ఎస్లో కీలక బాధ్యతల్ని సమర్థంగా నిర్వహించాడు కాబట్టి పార్టీలోనూ చకచకా ఎదిగిపోయాడు… ఒక దశలో మొత్తం ఈశాన్య రాష్ట్రాలకు ఇన్చార్జి… బీజేపీకి తీవ్ర రాజకీయ భావవైరుధ్యం ఉన్న పార్టీలను కూడా బీజేపీ స్నేహకూటమిలోకి తీసుకొచ్చాడు… మరీ కాశ్మీర్లో పీడీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు అనేది మరో విశేషం… పీడీపీ, బీజేపీ రెండు వేర్వేరు ధృవాలు నిజానికి… ఒక దశలో రాంమాధవ్‌కు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి, కేంద్రంలో మంత్రిని చేస్తారనే ఊహాగానాలు సాగాయి… మోడీ ఏదైనా దేశానికి వెళ్లడానికి ముందు రాంమాధవ్ వెళ్లేవాడు… తరువాత మోడీ వెళ్లివచ్చేవాడు… తరువాత ఫాలో అప్ కోసం రాంమాధవ్ మళ్లీ వెళ్లేవాడు… ఆ స్థాయిలో మోడీ ప్రాధాన్యం ఇచ్చాడు తనకు… తెలుగు బీజేపీ నేతలు కూడా రాంమాధవ్ ఆశీస్సుల కోసం వెంపర్లాడేవారు… అలాంటిది హఠాత్తుగా ఈ పరిణామం ఏమిటో ఎవరికీ అంతుపట్టలేదు… పైకి చెప్పడానికి ఆర్ఎస్ఎస్లో తను నిర్వర్తించాల్సిన కీలక బాధ్యతలున్నాయని చెప్పినా… నిజానికి తనను పక్కన పెట్టేసినట్టే..!
Ads
అమిత్ షా, మోడీ లెక్కలు వేరే ఉంటయ్… వాళ్ల అంచనాలు, సమీకరణాలు వేరు… వాటిల్లో ఫిట్ కాకపోతే చాలు, ఇక వర్తమాన బీజేపీ నుంచి పక్కకు జరగాల్సిందే… మరి ఎక్కడ మోడీ-షాలతో రాంమాధవ్‌కు సంబంధాలు చెడిపోయి ఉంటయ్..? తనపై ఏమైనా ఫిర్యాదులొచ్చాయా..? ఆర్ఎస్ఎస్ మద్దతుతో తను క్రమేపీ థ్రెట్‌గా మారుతున్నాడనే భావనతో కావాలనే తనను వాపస్ పంపించేశారా..? మరోవైపు సంఘ్ వర్గాల నుంచి వినవచ్చే క్లారిఫికేషన్ ఏమిటంటే..? ‘లేదు, ఇందులో పెద్ద విశేషమేమీ లేదు, తన ప్రాధాన్యం ఏమీ తగ్గలేదు, సంఘ్ కీలకమైన 12 మంది సభ్యుల కోర్ కమిటీలో సభ్యుడు తను ఇప్పుడు’… నిజానికి ఏపీ, తెలంగాణ ఆర్ఎస్ఎస్ ముఖ్యుల ప్రస్తుత వ్యవహారశైలి మీద కూడా సంఘ్ సంతృప్తిగా లేదు… త్వరలో కొన్ని విశేష మార్పులు తప్పవంటున్నారు… బీజేపీ అంతర్గత విభేదాల మీద కూడా ఆర్ఎస్ఎస్ కోపంగా ఉంది… వేచి చూడాలి ఇక..!!
Share this Article