నిజానికి ఇదొక చిక్కుముడి… ఏమిటీ అంటారా..? ‘‘మంత్రాలయం మఠం భూములు అమ్ముతారా..? భక్తుల మనోభావాలు దెబ్బతీస్తారా..? దాతలు ఇచ్చిన ఆస్తులను నడిబజారులో వేలం వేస్తారా..? అమ్ముకోవడం కోసమా మీకు ఆస్తులు ధారబోసింది..? దాతలు ఇచ్చే ఆస్తులకు మీరు ధర్మకర్తలే గానీ యజమానులు కారు, ప్రజలు వ్యతిరేకించారని తిరుమల ఆస్తుల అమ్మకం ఆపేశారు… మరి మంత్రాలయం ఆస్తుల్ని అమ్ముకుంటున్నారు ఎందుకు..?’’ అని పవన్ కల్యాణ్ ప్రశ్నించాడు… మంచి ప్రశ్నే…
ఈ జగన్ ప్రభుత్వమే ఆమధ్య హిందుత్వవాదుల విమర్శలతో వెనక్కి తగ్గి, తిరుమల ఆస్తుల విక్రయం ఆలోచన నుంచి వెనక్కి తగ్గింది… మరి అదే స్ఫూర్తి మంత్రాలయం భూముల విషయంలో ఎందుకు లేదు..? ఈ ప్రశ్నకు జగన్ క్యాంపు దగ్గర జవాబు లేదు… అదేమంటే..? ఓసోస్, ఇది మా ఆలోచన కాదు, ఆ చంద్రబాబు చేసిందే… మూడేళ్ల క్రితమే వీటిని అమ్ముకునేందుకు చంద్రబాబు ప్లాన్ చేశాడు… అని ఓ సమర్థన… మరి ఆయనకూ మీకూ తేడా ఏమున్నట్టు..?
Ads
అబ్బే, మాకెందుకు పూస్తారు బురద అంటూ తెలుగుదేశం తప్పించుకోవడానికి ఏమీలేదు… ఆ పార్టీ భగవద్గీతగా భావించే ఈనాడులోనే వచ్చింది…
…. చదివారు కదా… 208 ఎకరాల్ని 2017లో అమ్మేయటానికి ప్లాన్ చేశారు… ఎందుకు అంటే..? అమ్మితే 10 కోట్లు వస్తాయి, బ్యాంకులో వేస్తే ఏటా 80 లక్షలొస్తాయి… ఇప్పుడేమో కౌలు కనీసం 3 లక్షలు కూడా రావడం లేదు… ఏది లాభం..? అందుకే అమ్మేస్తున్నాం అని అప్పటి ప్రభుత్వం చెప్పిందట, ఇప్పటి ప్రభుత్వం కూడా అదే సై అంటున్నదట…
అంటే దాతలు ఇచ్చిన భూముల మీద లాభం రాకపోతే… అమ్మేస్తారా..? గుళ్లకు వచ్చిన విరాళాలను లాభనష్టాల కోణంలోనే చూడాలా..? ఆ భూముల్ని సాగుచేసుకుంటున్న రైతులు ఆ ఫలసాయాన్ని అనుభవిస్తున్నారు కదా… జనం నాలుగు బుక్కల అన్నం తింటున్నారు కదా… పైగా లీజు సరిగ్గా రాకపోవచ్చుగాక… కానీ భూమి విలువ పెరగడం లేదా..? అది లాభం కాదా..? అది గుడికి మేలు కాదా..?
ఇక నాణేనికి మరోవైపు చూద్దాం… గద్వాల ఏరియాలో 1873 ఎకరాల నుంచి రూపాయి రావడం లేదు… పైగా కొందరు పాసుబుక్కులు కూడా తీసుకుని ఓనర్లు అయిపోతున్నారట… మొత్తం అయిదు వేల ఎకరాల భూములున్నాయి మఠానికి… కానీ పేరుకే గొప్ప… లీజు రాదు, కబ్జాలు… కాపాడలేం… కలికాలం… అందుకని అమ్మేసి, డిపాజిట్లుగా మార్చేసి, దేవుడి సొమ్మును కాపాడితే తప్పేమిటి అనేది ఒక వాదన… ఇది ఈ మఠం దురవస్థ కాదు… లక్షల ఎకరాల దేవాలయ భూములు అన్యాక్రాంతం అయిపోయాయి… అది అన్నిచోట్లా ఉన్న సమస్యే…
వాటిని కాపాడుకునే స్థితి లేనప్పుడు, లిక్విడ్‌గా మార్చేయడం తప్పుడు నిర్ణయం ఏమీ కాదు… దాతలు ధర్మం కనీసం రెండు పాదాల మీద ఉన్నప్పుడు ఇచ్చిన ఆస్తులవి… ఇప్పుడు ఆ ధర్మం లేదు… మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తే కరెక్టు..? ఇదే చిక్కుముడి అంటున్నది… లీజు కట్టకుండా, పుణ్యానికి సాగుచేసుకునే రైతులను పోనీలే అని వదిలేస్తే… అందరికీ ఒకవేళ పట్టాలు ఇచ్చేసి, దేవుడి పేరిట జనానికి సంతర్పణ చేస్తే… గుడి దేవుడు పేదవాడు అయిపోతాడు… హుండీ డబ్బులు, కేశఖండనాల ఆదాయం మీద బతకాలి… కాదు, కాదు, వాటిని అమ్మేసేద్దాం అనుకుంటే దాతల మనోభావాలు హర్టవుతాయి… మరి పరిష్కారం ఏమిటి పవన్ కల్యాణ్ సార్..?!
ప్రత్యేకంగా గుడి ఆస్తుల రక్షణదళం పేరిట కొత్తగా జవాన్లను రిక్రూట్ చేద్దామంటావా..? ఎంత మంది మీద కేసులు పెట్టగలరు..? ఎంతమందిని కోర్టులకు ఈడుస్తాం..? అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా సరే, ఈ దుష్కార్యానికి సిద్ధపడుతుందా..? సో, అది తప్పు అని కాదు బ్రదరూ… మరేం చేయమంటావో చెప్పు… ప్లీజు…!!
Share this Article