ఫాఫం నాగ్ అశ్విన్..! ఏమాత్రం సంకోచం లేకుండా చేస్తున్న వ్యాఖ్య ఇది… కొండ మీద ఉన్నవాళ్లు హఠాత్తుగా దిగువ ఉన్న బురదలోకి పడిపోవడం అనేది పెద్ద కొత్తేమీ కాదు, అలా చాలామందిని చూశాం… అశ్విన్ అతీతుడేమీ కాదు… ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి చూశాక తన మీద ఉన్న సదభిప్రాయం కాస్తా జాతిరత్నాలు చూశాక ఆవిరైపోయింది… పోతుంది… పోయేలా చేసుకున్నదీ ఆయనే… అఫ్ కోర్స్, తను ఈ జాతిరత్నాలు అనబడే ఓ పెద్ద జబర్దస్త్ ఎపిసోడ్‌కు నిర్మాత మాత్రమే… దర్శకుడు కాదు… కానీ అనుదీపో ఇంకెవరో తెరపైన కనిపించే దర్శకుడి పేరు… కానీ సినిమా అన్నాక నిర్మాతకు బాధ్యత ఉండదా..? మరీ ఇంత దారుణంగానా..? ఇదా నాగ్ అశ్విన్ టేస్ట్..? మరీ ఈ నేలబారు అభిరుచి..?! ఎస్, సినిమా సూపర్ హిట్… సో వాట్..? హిట్ అయినంతమాత్రాన గొప్ప సినిమా అని కాదుగా అర్థం..? జబర్దస్త్ టీవీషో ఎంత బూతు కామెడీతో నిండినా, ఎంతటి నేలబారు ప్రోగ్రామ్ అయినా సరే టీఆర్పీలు వస్తయ్… దాంతోనే ఈటీవీ బండి నడిపిస్తోంది… ఐనంతమాత్రాన అది నాణ్యమైన సరుకు అని చెప్పలేం కదా… ఈ జాతిరత్నాలు కూడా అంతే… 11 కోట్లు పెడితే 32 కోట్లు వచ్చాయి అని ఓ లెక్క… 110 కోట్లు వచ్చినా సరే, చప్పట్లు కొట్టలేం…
సుకుమార్, బోయపాటి, రాజమౌళి వంటి దిగ్దర్శకులు బోలెడు మంది ఉండొచ్చు… కానీ కమ్ముల శేఖర్, క్రిష్, నాగ్ అశ్విన్, సంకల్ప్ రెడ్డి వంటి దర్శకులు కొందరు భవిష్యత్తు సినిమాల మీద ఆశలు రేకెత్తిస్తుంటారు… పోనీ, ఆశల్ని బతికిస్తూ ఉంటారు… కానీ ఏమైంది..? అంతకుముందున్న పేరును క్రిష్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలతో ఆవిరి చేసుకున్నాడు… ఆ తరువాత పత్తాజాడా లేడు తను… కమ్ముల శేఖర్ తన పేరు కాపాడుకుంటున్నాడు ఇప్పటికైతే… లవ్ స్టోరీ రిలీజయ్యాక చూడాలిక… ఒక విరాటపర్వం సినిమాతో వేణు ఊడుగుల ఏం చేస్తాడో చూడాలిక… సంకల్ప్ రెడ్డి మళ్లీ జాడలేడు… జయాపజయాలు పక్కన పెడితే ఘాజి, అంతరిక్షం మంచి ప్రాజెక్టులు… బంపర్ హిట్ అర్జున్‌రెడ్డి తీసిన సందీప్ రెడ్డి మళ్లీ జాడలేడు… ఇంకా కథనసమయానికి మనకు గుర్తుకురాని మంచి దర్శకులు కొందరు ఉండొచ్చు… కానీ నాగ్ అశ్విన్ అకస్మాత్తుగా తన పేరు చెడగొట్టుకోవడం అనూహ్యం…
Ads
ఎంత దారుణం అంటే… సినిమా ముగింపుకొచ్చాక కూడా… కథకు కీలకమైన ఆ వీడియోలో ఏముందో ఎవడికీ తెలియదు… ఆ వీడియో కోసం వందల కోట్ల రాయబారాలు, రాజీబారాలు ఎందుకో తెలియదు… దర్శకుడు కూడా చెప్పే ప్రయత్నం చేయలేదు… జలీల్ ఖాన్ బీకామ్ ఫిజిక్స్ తరహాలో క్రికెట్లో గోల్ కీపర్ అని ఎవరికో ఏదో ఇంటర్వ్యూలో చెబుతాడు మురళిశర్మ… అంతేనా..? తన వీరాభిమాని తనను చంపే ప్రయత్నం చేశాడని హఠాత్తుగా డిస్క్లోజ్ చేస్తాడు దర్శకుడు… కానీ అదెలా జరిగిందో తెలియక ప్రేక్షకుడు జుత్తుపీక్కుంటాడు… ఒకసారి ఛీకొట్టి పంపించిన స్వతంత్ర ఎలక్ట్రానిక్స్‌కే మంత్రి మళ్లీ కంట్రాక్టు ఎందుకిస్తాడో ఎవడికీ అంతుపట్టదు… ఇవన్నీ జస్ట్, మచ్చుకు… ఇలాంటివి బోలెడు లాజిక్ రాహిత్యాలు… అయినా జబర్దస్త్ తరహా కామెడీకి లాజిక్ ఎందుకంటారా..? అంతేలెండి… కనీసం అండర్ ట్రయల్స్‌కు ఖైదీ దుస్తులు ఉంటాయా..? వాళ్లతో పనులు చేయిస్తారా..? అనేదైనా తెలుసుకోవాలి కదా ఆ కథారచయిత ఎవరో… సినిమా విడుదలకు ముందు సదరు నాగ్ అశ్విన్ ప్రివ్యూ చూసుకోలేదా..? తను కూడా ఓ దర్శకుడే కదా… కథను, కథనాన్ని వదిలేయండి, కామెడీ షోలో వాటికి విలువ లేదు, కానీ పంటికింద రాళ్లలా తగిలే మైనస్ పాయింట్లనైనా చూసుకోవాలి కదా… ఎటొచ్చీ సినిమాలో బాగా నచ్చేది తెలంగాణ డయలెక్ట్… జోగిపేట భాషను పర్ఫెక్ట్గా దింపారు… వెన్నెల కిషోర్, హీరో నవీన్, కమెడియన్లు రామకృష్ణ, ప్రియదర్శి వంక పెట్టలేని రీతిలో ఆ యాసను పట్టుకున్నారు… ఇది సినిమా రివ్యూ కాదు… కాబట్టి ఇక్కడ ఆపేద్దాం… నాగ్ అశ్విన్ పట్ల ‘ప్చ్, పాపం’ అనుకుంటూ…!!
Share this Article